Siddipet Puliraju: పులి రాజు… తెలంగాణాలో పుట్టిన ఇతను ఒక సాధారణ గవర్నమెంట్ టీచర్. టీచర్ అనగానే పొద్దున్నే ఐరన్ చేసిన చొక్కా వేసుకొని బడికి వెళ్లి పాఠాలు చెప్పి ఇంటికి వచ్చేస్తారు, కానీ ఈ టీచర్ మాత్రం అలా కాదు. ఓ వైపు బడిలో పాఠాలు చెప్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దుతూనే మరో వైపు అప్పు చేసి ప్రాణాలు తీసుకున్న రైతులకు అండగా నిలుస్తున్నాడు. పులి రాజు తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని ఒక గవర్నమెంట్ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు. వారి కుటుంబ నేపథ్యం వ్యవసాయం కనుక ఆయనకు రైతులు పడే ప్రతి ఒక్క కష్టం విలువ తెలుసు. ఇతను 1997 లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికి అనేక రకాల సమస్యలతో ఎంతో మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకోవడం అతన్ని కలచివేసింది. అలా ఓ జర్నలిస్ట్ మిత్రుని సహాయంతో వారి ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యల వివరాలు సేకరించుకునేవాడు. 2002లో అలా ఆత్మహత్య చేకున్న వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి నేను మీకు ఏ విధంగా అయినా సహాయపడగలనా? అని అడిగి ఎంతో మందికి ఆర్ధికంగా, తనకు తోచిన విధంగా సహాయం అందించేవారు.
ఇలా చేస్తున్న సమయంలో ఒకసారి అతను జిల్లా అధికారిక కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల లెక్కలను చూసారు, కానీ అవి నిజంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కంటే చాలా తక్కువ అని తెలుసుకున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే చనిపోయిన వారి పేరున భూమి లేదు కాబట్టి వారిని రైతుగా గుర్తించలేము అని వారు చెప్పారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎవరి పేరు మీద అయితే భూమి ఉంటుందో వారినే రైతుగా పరిగణిస్తారు. దీని వల్ల చాలా మంది రైతులకు ప్రభుత్వం తరపున అందాల్సిన 1.5 లక్షల పరిహారం అందడం లేదని గుర్తించారు. అదే సమయంలో 2014 లో కేంద్రం రైతుల ఆత్మహత్యలకు సంబందించిన అధికారిక లెక్కలను విడుదల చేసింది. అందులో కేవలం తన ప్రాంతం నుండే దాదాపు 27 వేల మంది ఉన్నారు. అందులో ఎంతమందికి నష్టపరిహారం అందిందో తెలుసుకోవడానికి RTI కి లేఖ రాసారు. కొద్దిరోజులకు RTI వారు కేవలం 7 వేల మందికి మాత్రమే నష్ట పరిహారం అందిందని రిప్లై ఇచ్చారు. అంటే మిగతా 20 వేల కుటుంబాలకు అన్యాయం జరిగిందని గమనించి హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. దీనితో దాదాపు 400 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇలా ఇప్పటివరకు దాదాపు 2500 కుటుంబాలకు ఆర్ధికంగా మరియు మానసికంగా సహాయం అందిస్తున్నారు. సదరు కుటంబాల పిల్లలను దాతలు చదివించేలా, ఇతర సహాయ సహకారాలు అందించేలా దారి చూపుతున్నారు. వీటితో పాటు రైతుల ఆత్మ హత్యలకు కారణమైన అప్పుల జోలికి వెళ్లకూడదని, అప్పుల బారిన పడకుండా పంట సాగు చేసే విధానాలను కూడా ప్రచారం చేస్తున్నారు. పురుగు మందులు, కృత్రిమ ఎరువులు వాడకుండా సహజ పద్ధతిలో ఎలా వ్యవసాయం చేయాలో కూడా వాళ్లలో అవగాహన కలిపిస్తున్నారు. ఇలా ఇప్పటికే వందల మంది రాజు మాటలతో సహజ వ్యవసాయాన్నే పాటిస్తున్నారు. ఇలా రైతుల కోసం తనకు సాధ్యమైనది సంతోషంగా చేస్తానని, తాను బ్రతికున్నంత వరకు రైతు సమస్యల కోసం పోరాడతానని, రైతు ఆత్మహత్యలు లేని వ్యవసాయం చూడాలన్నదే తన కోరిక అని పులి రాజు గర్వంగా చెబుతున్నారు.
Also Read: PJTSAU: కృషి విజ్ఞాన కేంద్రాలు(KVK) అనుసరించాల్సిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక.!