Sustainable Agriculture: వాతావరణ మార్పుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి పరిష్కారం చూపాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ ఉపకులపతి M. రఘునందన్ రావు అన్నారు. రాజేంద్రనగర్ లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంలో నిర్వహించిన 3వ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. భూసారం పై కూడా తగిన పరిశోధనా కార్యక్రమాలు రూపొందించి రైతులతో కలిసి, సాయిల్ హెల్త్ ను ఏ విధంగా కాపాడాలన్న అంశాలపై పరిశోధనలు చేయాలన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున సాగునీటి వనరులు కల్పించిన నేపథ్యం లో భూములలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయో రైతులతో చర్చించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా, రైతుల ఆదాయం పెంచడానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి పరచాలని సూచించారు. అలాగే వ్యవసాయ రంగంలో వస్తోన్న అధునాతన సాంకేతికత, పరిశోధనలపై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకొని అవి మన రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్న అంశాలపై దృష్టి నిలపాలని అన్నారు.
Also Read: PJTSAU: పీజేటీఎస్ఏయూ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ ఉద్యోగ విరమణ.!
సుస్థిర వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ అన్నారు. అంతకుముందు 2020- 22 పరిశోధన, విస్తరణ కార్యక్రమాల నివేదికలను పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, విస్తరణ సంచాలకులు డాక్టర్ వి. సుధారాణి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రసంగించి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎలక్ట్రానిక్ వింగ్ ఆధ్వర్యంలో రూపొందిన 3 డి.వి.డి లను ఉపకులపతి, ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు.
Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.!