PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ జగదీశ్వర్ దంపతులను రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు డాక్టర్ జగదీశ్వర్ విశ్వవిద్యాలయం ఉన్నతి కోసం చేసిన సేవలను కొనియాడారు.
నూతనంగా ఏర్పాటైన వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన ఫలాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లేందుకు అహర్నిషలు కృషి చేశారని అన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ మాట్లాడుతూ తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా విశ్వవిద్యాలయం అభ్యున్నతి కోసం నూతన పరిశోధనా కార్యక్రమాల రూపకల్పనల కోసం జగదీశ్వర్ కృషి చేశారన్నారు.
Also Read: Summer Vegetables Cultivation: వేసవిలో కూరగాయల సాగు.!
ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేస్తున్న డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో ఏ అవకాశం వచ్చినా దాన్ని త్రికరణశుద్ధిగా పూర్తి చేసేందుకు కృషి చేశానని, ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి అవకాశం వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. మనం చేసే పనులే మన అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, అధికారులు డాక్టర్ జగదీశ్వర్ దంపతులను ఘనంగా సన్మానించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన పరిశోధన సంచాలకులుగా డాక్టర్ ఎం. వెంకటరమణ నియామకం:
వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులుగా పనిచేసి మంగళవారం పదవి విరమణ చేసిన డాక్టర్ జగదీశ్వర్ స్థానంలో డాక్టర్ ఎం. వెంకటరమణ ను నియమిస్తూ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఎం. వెంకట రమణ విశ్వవిద్యాలయం లో పలు విభాగాలలో పనిచేశారు. ఈ పదవికి ముందు క్రాపింగ్ సిస్టమ్స్ స్కిం లో ఆయన పనిచేస్తున్నారు.
Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.!