Minister Niranjan Reddy: తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, అయిజ మండలం, ఉప్పల గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణలో కరెంటు కోత అనేది కొరత ఉండదని అన్నారు. ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని దీనికి నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలకపాత్ర అని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రతి చోట విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని మంత్రి అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా లేకుంటే పరిశ్రమలు, వర్తక, వాణిజ్యాలు, గృహావసరాలు, వ్యవసాయం వాటి మూలంగా కోట్లాది మంది ఉపాధిని కోల్పోతారని అన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగం అయినా ఐటీ, పారిశ్రామిక, చేతివృత్తులలో ఉపాధి లభిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఈ పని చేస్తున్నారని అన్నారు.

Minister Niranjan Reddy
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానం
దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని మంత్రి అన్నారు. తెలంగాణ దరిదాపుల్లో కూడా ఇతర రాష్ట్రాలు లేవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగాన్ని బట్టే ప్రజల అవసరాలు తీరుతున్నాయని అన్నారు. అంతేకాకుండా అభివృద్ధి సూచికలో విద్యుత్ ప్రధానమైనదని అన్నారు.
ప్రస్తుతం వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయిందని అయినా అక్కడ వర్షాధార పంటలైన పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. నెలరోజులు సాగు ఆలస్యమైందని అందుకే రైతులు వ్యవసాయ అధికారుల సూచన మేరకు సాగు చేయాలని కోరారు. అంతేకాకుండా ఆరుతడి పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. ఈకార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆర్ డి ఓ చంద్రకళ, డి ఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Tomato linked with Aadhar Card: ఏపీ లో ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే టమాటా.!