Minister Niranjan Reddy: పచ్చిరొట్ట విత్తనాల సాగును ప్రోత్సహించాలని హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు, సీడ్స్ ఎండీ కేశవులు గారు, ఏడీడీ విజయ్ కుమార్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం అని 65 శాతం సబ్సిడీపై రూ.76.66 కోట్లు భారం భరించి పచ్చి రొట్ట విత్తనాలు సరఫరా ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. 1445 డీసీఎంస్, పీఎసీఎస్ , గుర్తింపబడిన అగ్రో రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని లక్ష 46 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని తెలిపారు.
పచ్చి రొట్ట ఎరువులతో నాణ్యమైన, ఆరోగ్యవంతమైన పంట దిగుబడులు పెరగాలని రైతులను పచ్చి రొట్ట ఎరువుల వినియోగంపై నిరంతరం చైతన్యం చేయాలని మంత్రి సూచించారు. విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వాడకం ద్వారా నేలల సహజ స్వభావం దెబ్బతింటున్నదని .. భూమి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కోల్పోతున్నదని చౌడు శాతం పెరిగిపోతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Also Read: Nano Urea: నానో యూరియాతో విప్లవాత్మక మార్పులు – ఫలితాలు
రాష్ట్రంలో, దేశంలో నేలలో సేంద్రియ కర్భనం తగ్గిపోతూ వస్తున్నది. అది కనీసం ఒకశాతం కూడా మించి లేదని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది మూడు శాతానికి పైగా ఉన్నదని మంత్రి వెల్లడించారు. అదిక రసాయనిక ఎరువుల వాడకంతో భూమి పంటల సాగుకు పనికిరాకుండా పోయి రైతుల పెట్టుబడి ఖర్చు పెరిగినా దిగుబడులు రాక నష్టపోతున్నారని.. నేలల పునరుజ్జీవనానికి రైతులు సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.
పశువులు, కోళ్లు ,గొర్రెలు, వర్మి కంపోస్ట్ ఎరువుల వాడకం రైతులకు భారంగా మారిందని.. పచ్చిరొట్ట పైర్లయిన జీలుగ, పిల్లిపెసర, జనుము సాగుచేసి రైతులు నేలలో కలియదున్నాలని చెప్పారు. మే రెండవ వారం నుండి జూన్ రెండవ వారం లోపు పచ్చిరొట్ట విత్తనాలు రైతులు విత్తుకోవాలని వీటి సాగుమూలంగా భాస్వరం, గంధకం పోషకాలు గణనీయంగా పెరగడంతో పాటు నత్రజని వాడకం 25 నుండి 30 శాతం తగ్గించవచ్చని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Also Read: Precautions in Organic Farming:సేంద్రియ, సహజ వ్యవసాయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు – రాజీలేని సూత్రాలు