Minister Niranjan Reddy: హైదరాబాద్ ఫిస్సీ సురాన ఆడిటోరియంలో నిర్వహించిన ‘వ్యవసాయ మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు – తెలంగాణ’ అంశంపై జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ నినాదానికే పరిమితం అయిందన్నారు. నినాదాలు కాదు .. విధానాలు మారాలి అని మంత్రి అన్నారు. 2022 పోయి 2023 సంవత్సరం వచ్చేసింది .. రైతుల ఆదాయం రెట్టింపు సంగతి పక్కనపెడితే రైతులకు సాగు పెట్టుబడి రెట్టింపు అయిందని.. పంటల మార్కెటింగ్ అనేది రైతులకు ఇబ్బందికరంగా మారిందని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
ఆహారం లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదని, అత్యంత ప్రాధాన్యం కలిగిన రంగాలలో వ్యవసాయం ఒకటి అని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. సాగుకు భారతదేశ నేలలు, వాతావరణం అనుకూలమైనవి, కానీ దానికి తగినట్లుగా దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు అన్నారు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని, అందుకే సాగునీరు, కరంటు, రైతుబంధుతో వ్యవసాయరంగానికి అండగా నిలిచి రైతుభీమాతో రైతన్నలకు భరోసా ఇస్తున్నారు .. అలాగే మద్దతుధరకు పంటలను కొనుగోలు చేసి రైతులలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారని వారు తెలియజేసారు. వ్యవసాయరంగం బలోపేతం అయితే ఆ రంగం మీద ఆధారపడిన ప్రజలు నాలుగైదేళ్లలో వారి కాళ్ల మీద వారు నిలబడతారన్నది కేసీఆర్ విశ్వాసం అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు తెలియజేసారు. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడితే మిగిలిన రంగాల మీద దృష్టిసారించ వచ్చు .. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నదని, ప్రభుత్వం చేపట్టిన చర్యల మూలంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలబడిందని వారు చెప్పారు.
Also Read: Heavy Rains in Telangana: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. అన్నదాతకు తప్పని కష్టాలు
వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎగుమతులను పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, కావున ఎగుమతులు పెంచడానికి ఏఏ చర్యలు తీసుకోవాలి అన్నదానికి నిపుణులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందజేయాలని, ప్రపంచ మార్కెట్ ఎగుమతులకు అనుగుణంగా ఎలాంటి నిబంధనలు అనుసరించాలో తెలియజేయాలని నిపుణులను, శాస్త్రవేత్తలను కోరారు. మనకు అత్యంత ప్రతిభ కలిగిన పరిశ్రమల శాఖా మంత్రిగా కేటీఆర్ ఉన్నారు .. ఒక మంచి పాలసీని ముందుకు తెస్తే అత్యంత తక్కువ సమయంలో దానిని అమల్లోకి తెచ్చే సత్తా ఆయనకు ఉందని, ఆయన సమర్దవంతమైన నాయకత్వంలో అత్యధిక మంది ఇష్టపడుతున్న నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దబడిందని వారు అన్నారు. ప్రపంచానికి సాఫ్ట్ వేర్ సేవలు అందించడంలో భారత్ ముందున్నది. ఒక్కరోజు దిగుమతులలో అంతరాయం ఏర్పడితే బ్రిటన్ ఆకలితో అల్లాడుతుంది, వారు ప్రపంచానికి ఏమీ ఎగుమతి చేయడం లేదు .. అన్నింటికి దిగుమతుల మీదే ఆధారపడుతున్నారని ఈ సందర్బంగా వారు ప్రస్తావించారు.
ప్రపంచంలో 800 కోట్ల జనాభా దాటిపోయింది .. భారతదేశం అత్యధిక జనాభాతో అగ్రస్థానంలో ఉన్నది. మానవాళికి అవసరమైన దైనందిన అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడడం అనివార్యమయిందని, వాణిజ్య ఒప్పందాలు లేకుండా దేశాలు మనుగడ సాగించడం అసాధ్యం .. అది లేకుండా జీవితం లేదని వారు తెలియజేసారు. ప్రపంచానికి భారతదేశ రైతుల సేవలు అత్యంత ఆవశ్యకం, రాబోయే రోజుల్లో ప్రపంచ ఆకలితీర్చేందుకు భారతదేశం కేంద్ర బిందువుగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద దృష్టిపెట్టిన వారికి భవిష్యత్ ఉంటుందని కాబట్టి ప్రపంచ అవసరాలు, డిమాండ్ ఉన్న ఉత్పత్తుల మీద దృష్టిసారించాలని వారు అన్నారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ కన్నా మన వేరుశెనగ లో ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి.. కానీ వారు వారి ఉత్పత్తికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు అని మంత్రి వర్యులు తెలియజేసారు. ప్రపంచంలోని అనేక దేశాలలో పీనట్ బట్టర్ కు డిమాండ్ ఉన్నదని, అప్లాటాక్సిన్ రహిత తెలంగాణ వేరుశెనగకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నదని, కావున తెలంగాణలో యాసంగిలో వేరుశెనగ సాగుకు రైతులను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని వారు గుర్తు చేశారు.
ఉచిత చేపపిల్లలతో మత్స్య పరిశ్రమ, సబ్సిడీ గొర్రెలతో, గొర్రెల పెంపకం ప్రోత్సాహంతో తెలంగాణలో గణనీయంగా వాటి ఉత్పత్తి పెరిగింది కావున వాటి ఎగుమతుల మీద కూడా దృష్టిసారించాలని వారు చెప్పారు. సులభంగా కాకుండా పనిచేసి కష్టపడి జీవించగలం అన్న ఆలోచనలు అందర్లోనూ పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో పాటు, ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, టీఎస్టీపీసీ జేఎండీ విష్ణువర్దన్ రెడ్డి, ఫిస్సీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Spinach Health Benefits: బచ్చలి కూరతో బోలెడన్ని లాభాలు మీ సొంతం!