Minister Niranjan Reddy: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై హెచ్ఐసీసీలో ప్రారంభమయిన జాతీయసదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ సీఈఓ ఆశోక్ దాల్వాయి, కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోభా ఠాకూర్, ఐకార్ అడిషనల్ డీజీ డాక్టర్ ఆర్.కె.సింగ్, ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ రత్నావతి, ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ సీఈఓ డాక్టర్ దయాకర్ రావు, సమున్నతి సంస్థ అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ అదనపు కమీషనర్ హన్మంతు తదితరులు హాజరయ్యారు.
చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలకు ఉపాధి, ఆహారం ఇచ్చే రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం నుండి వచ్చే ఉత్పత్తులు సమకాలీన పరిస్థితులు, ప్రపంచపు ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తులు పెంచేలా రైతాంగాన్ని నడిపించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో దేశంలో రికార్డ్ స్థాయి పంటలను ఉత్పత్తి నమోదు చేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన పంటల సాగు, ఉత్పత్తులకు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు, ఉత్పత్తులలో అద్భుతమైన పురోగతి ఉన్నది. ఈ వానాకాలంలో ఒక కోటి 45 లక్షల 44 వేల ఎకరాలు వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక దృక్పధంతో వ్యవసాయరంగానికి ప్రత్యక్ష్యంగా ఇస్తున్న ప్రోత్సాహం, చేయూత మూలంగా తెలంగాణ వ్యవసాయ రంగం స్థిరపడడం, బలపడడమే కాకుండా రికార్డు స్థాయిలో పంటలు ఉత్పత్తి అవుతున్నాయి.
Also Read: TS Agri Minister: వ్యవసాయం వృత్తి కాదు జీవితం – మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రపంచ వ్యాపితంగా ఉన్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని మన దేశంలో పంటలసాగును చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో చిరు ధాన్యాలకు తెలంగాణ ప్రసిద్ది. కాలక్రమంలో అది తగ్గింది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి. చిరుధాన్యాల విస్తరణ పెంచడం ద్వారా భవిష్యత్ లో ప్రపంచ మార్కెట్ ను భారత్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నది.
చిరుధాన్యాల మీద ఆధారపడే ఉప ఉత్పత్తులు రోజురోజుకు విశేషమైన ఆదరణ చూరగొంటున్నవి. అన్ని సమయాలలో తినగలిగేలా చిరుధాన్యాల నుండి తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్లు దేశంలో ప్రారంభమయ్యాయి. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్రం ప్రకటించింది. చిరుదాన్యాల వాడకం పెంచాలని ఐరాస 2015 సదస్సు ద్వారా ప్రపంచ దేశాల ముందు ఉంచిన 17 అంశాలలో ఇది 17వ అంశం.
పంటల వైవిధ్యీకరణలో భాగంగా చిరుధాన్యాల సాగును పెంచాలని, పప్పు, నూనెగింజల పంటలు సాగుచేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతులు తరచూ విజ్ఞప్తి చేస్తున్నది. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరగాలంటే పరిశోధనా సంస్థలు ఆ ధాన్యాల ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉన్నది. రైతాంగం చిరుధాన్యాల సాగు వైపు మళ్లాలంటే మిగతా పంటల మాదిరిగా మద్దతుధరను ప్రకటించి మొత్తం కొనుగోలు చేసేలా కేంద్రం రైతాంగాన్ని ప్రోత్సహించాలి.
దీనిమూలంగా అధిక ఆదాయం రావడంతో పాటు దేశానికి దిగుమతులు చేసుకునే పరిస్థితి నుండి ఎగుమతి చేసే స్థితికి ఎదుగుతాం. ఈ సదస్సు ద్వారా ఆశాజనకమైన కొత్తదారులు రైతాంగానికి వెలువడుతాయని ఆశిస్తున్నాను. చిరుధాన్యాల సాగులో ఉన్న ఇబ్బందులు, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరగాలి.
పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం, చక్కెర ఇస్తున్నట్లే చిరుధాన్యాలకు చోటు కల్పించేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేశంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్న పలు సంస్థలు, శాస్త్రవేత్తలు, అధికారులకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఐసీడీఎస్ ద్వారా చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన అవార్డును ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ చాహత్ భాజ్ పాయ్ స్వీకరించారు.