Minister Niranjan Reddy: హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఉదయం ఎరువుల సరఫరా మరియు నిల్వలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. పలు అంశాలపై ఆధికారులతో చర్చించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎరువులు అందుబాటులోనే ఉన్నాయని అన్నారు. ఈ వానాకాలం సీజన్ కు 9.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించామని, ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, మార్చి 31 నాటికి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ముందస్తు నిల్వ చేశారని మంత్రి అన్నారు.
ఎలాంటి ఎరువుల కొరత లేదు
మొత్తం ఈసీజన్ లో ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన యూరియా 9.93 లక్షల మెట్రిక్ టన్నులు అని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిల్వలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని, ఈఏడాది రుతుపవనాల ఆలస్యం మూలంగా 10 లక్షల ఎకరాల సాగువిస్తీర్ణం తగ్గిందని ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎరువుల కొరత లేదని మంత్రి అన్నారు.
Also Read: Ivy Gourd Profits: ఏడాది పొడవునా ఆదాయం పొందే దొండకాయ.!
రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 16,615 అధీకృత డీలర్ల ద్వారా యూరియా సరఫరా జరుగుతున్నదని మొత్తం రాష్ట్రంలో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో యూరియా లేదంటూ దుష్ప్రచారానికి తెరలేపారని అన్నారు.
సంఘాల మీద విచారణ జరిపి చర్యలు
ఇది అవగాహనా రాహిత్యమే కాదు .. దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం అని మంత్రి అన్నారు. సంబంధిత సహకార సంఘాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఉద్దేశపూర్వకంగా తప్పుచేసిన ఎవరినీ ఉపేక్షించబోమని అన్నారు. శుక్రవారం నాడు రాష్ట్రంలో 15,838 మెట్రిక్ టన్నుల యూరియా ఖరీదు చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, సంయుక్త సంచాలకులు (ఎరువులు) రాములు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Capsicum Cultivation in Polyhouse: పాలీహౌస్ లో క్యాప్సికం సాగు – లాభాలు బాగు