Agri Awards: హోటల్ పార్క్ హయాత్ లో అగ్రి బిజినెస్ సమ్మిట్ & అవార్డ్స్ 2022 ప్రధానోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. భారత్ లో అగ్రి ఇన్ ఫుట్స్ పరిశ్రమ యొక్క టర్నోవర్ రూ.70 వేల కోట్లు .. దానిలో 10 శాతం తెలంగాణ నుండి ఉండడం రాష్ట్రానికి గర్వకారణం. అగ్రి ఇన్ ఫుట్స్ ప్రధాన సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రెడా, ఇక్రిసాట్, మేనేజ్, నారమ్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు ఇక్కడ ఉండడం హైదరాబాద్ ప్రత్యేకత. విత్తనరంగానికి తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రసిద్ధి అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే ఇది సాధ్యమయింది. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చి పలు ప్రత్యేకమైన పథకాలు ప్రవేశపెట్టడం మూలంగా తెలంగాణ దేశానికి ఆదర్శం అయింది.
దేశం నలుమూలల నుండి అగ్రి ఇన్ ఫుట్ సంస్థల సీనియర్ ప్రతినిధులు 200 మంది ఇక్కడికి రావడం సంతోషదాయకం. తెలంగాణ వ్యవసాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దేశంలోని రైతులకు ఈ ఫలాలు అందేలా మీ వంతు కృషిచేయాలి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంస్థలు అన్నీ కలిసి హైదరాబాద్ లో సదస్సు జరపడం సంతోషదాయకం అని మంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం పురోగమిస్తున్నది. దేశంలో వంటనూనెల కొరతను గమనించి తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం. 2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటేందుకు అన్ని సిద్దం చేశాం. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉన్నది. రే కన్సల్టింగ్ ఆధ్వర్యంలో హోటల్ పార్క్ హయాత్ లో పద్మభూషణ్ రజనీకాంత్ ష్రాఫ్ కు అగ్రి బిజినెస్ సమ్మిట్ & అవార్డ్స్ 2022 జీవిత సాఫల్య పురస్కారం, మంత్రి నిరంజన్ రెడ్డికి రైతుబంధు పురస్కారం ప్రధానం అందజేశారు.
పద్మభూషణ్ రజనీకాంత్ ష్రాఫ్ సేవలు మరవలేనివి. ఆయన మరింత ఉన్నత పురస్కారాలు భారత ప్రభుత్వం నుండి అందుకోవాలని అభిలషిస్తున్నాను. దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి ఎక్కడ ఏ పంటలు పండతాయో అక్కడ ఆయా పంటల సాగును ప్రోత్సహించాలి. సాగులో వ్యవసాయ కూలీల సమస్య ప్రధానంగా వేధిస్తున్నది. పెట్టుబడిలో 50 శాతం కూలీల కోసం ఖర్చు చేయాల్సి వస్తున్నది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు వ్యవసాయ యాంత్రీకరణలో ఎంతో ముందున్నది. భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణను ఊబరైజేషన్ విధానంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. తద్వార రైతులు సాగులో సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ దిశగా అగ్రి ఇన్ ఫుట్స్ సంస్థలు దృష్టి సారించాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.