రైతన్నకు అభయహస్తం – రైతు నేస్తం ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అరుగాలం పొలంలో కష్టపడుతూ దేశానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలకు అవసరమైన, సరైన సాంకేతిక సలహాలు సూచనలు సత్వరమే ప్రత్యక్షంగా అందించే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పి.జె.టి.ఎ.యు.), ఎలక్ట్రానిక్ వింగ్ వారు రూపొందించిన కొత్త డిజిటల్ వ్యవసాయ విస్తరణ మాధ్యమానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంకు (ఆర్.కె.వి.వై.) ఆమోదించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 2601 రైతు వేదికలకు (96.24 కోట్లు బడ్జెట్‌తో మూడు సంవత్సరాల వ్యవధిలో) వీడియో కాన్ఫెరేన్స్ సదుపాయాలు ఏర్పాటు చేసి, ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులతో నేరుగా మాట్లాడి, చర్చించి వారి క్షేత్రస్థాయి సమస్యలకు తక్షణమే పరిష్కారాలు సూచించడం జరుగుతుంది.
‘‘రైతు నేస్తం’’ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం:
- పి.జె.టి.ఎ.యు., ఎలక్ట్రానిక్ వింగ్ వారి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ఆమోదించి మొదటి విడతగా 110 రైతు వేదికలను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా శాస్త్రవేత్తలు, అధికారులు నేరుగా సలహాలు అందించే డిజిటల్ వ్యవసాయ విస్తరణలో నూతన ఆవిష్కరణను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, అధికారుల సమక్షంలో మార్చి 6వ తేది 2024న రైతునేస్తం పేరుతో ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం ఉదయం 10:00 నుంచి 11:00 వరకు నిర్వహించి రైతులుకు అవసరమైన పంటల, వాతావరణ ఆధారిత సలహాలను శాస్త్రవేత్తలు, అధికారుల ద్వారా అందిస్తున్నాం. ఈ రైతు నేస్తం కార్యక్రమం విస్తరణలో భాగంగా రెండవ విడతగా మరో 456 రైతు వేదికలకు వీడియో కాన్ఫెరెన్స్ సదుపాయం కల్పించి ముఖ్యమంత్రి
ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూలై 18, 2024న ప్రారంభించడం జరిగింది.
ముఖ్య ఉద్దేశాలు:
1. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులను రైతు వేదికలు, క్షేత్రస్థాయిలో అనుసంధానం చేసి వారి సమస్యలను గుర్తించి తక్షణమే సలహాలు, సూచనలు ఇచ్చే డిజిటల్ మాధ్యమాన్ని అభివృద్ధి పరచడం.
2. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పని చేస్తున్న వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులకు వారు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అవసరమైన సాంకేతిక నైపుణాన్ని పెంపొందించడం.
అమలుపరిచే విధానం:
పి.జె.టి.ఎ.యు., ఎలక్ట్రానిక్ వింగ్ స్టూడియో ద్వారా 2601 రైతు వేదికలను, మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలను, ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాలను, రైతులకు ఉపయోగపడే ఇతర సంస్థలను ఈ నూతన డిజిటల్ మాధ్యమం ద్వారా అనుసంధానం చేసి రైతులు సాగుచేసే వ్యవసాయ అనుబంధ రంగాల సమస్యలకు త్వరగా పరిష్కారాలు, సలహాలు అందించడం జరుగుతుంది. రైతులు నేరుగా తమ పొలంలో గుర్తించిన చీడపీడల సమస్యలను శాస్త్రవేత్తలకు ఈ మాధ్యమం ద్వారా చూపించి సూచనలు పొందుతున్నారు.
మూడు స్థాయిలలో…
ఈ డిజిటల్ మాధ్యమం మూడు స్థాయిలలో పనిచేసే విధంగా ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
- మొదటిది రాష్ట్రస్థాయిలో ఎలక్ట్రానిక్ వింగ్ ద్వారా రైతులకు రైతు వేదికల ద్వారా సలహాలు, సూచనలు అందించడం
- రెండవది జోనల్ స్థాయిలో (ఆర్.ఎ.ఆర్.ఎస్.) రైతులు పండించే పంటల్లో సమస్యలకు ఆయా శాస్త్రవేత్తల ద్వారా సమాచారం అందించడం.
- మూడవది జిల్లా స్థాయిలో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక వ్యవసాయ పరిస్థితులు, పంటలో సమస్యలకు శాస్త్రవేత్తలు, అధికారులు అవసరమైన సమాచారం అందించడం.
ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకొని రైతు వేదికల ద్వారానే కాకుండా రైతులు, విస్తరణ అధికారులు క్షేత్రస్థాయి పంటల సమస్యలను నేరుగా శాస్త్రవేత్తలు, అధికారులకు చూపించి శాస్త్రవేత్తల సలహాలు పొందే వీలును కూడా ఏర్పాటు చేశారు.
ఉపయోగాలు:
1. రైతులకు అవసరమైన క్షేత్రస్థాయి సాంకేతిక సమాచారాన్ని త్వరగా అందించి పంటల్లోని సమస్యలకు పరిష్కారాలు సూచించి తద్వారా పంట నష్టాన్ని నివారించి అధిక దిగుబడులను సాధించవచ్చు.
2. పి.జె.టి.ఎ.యు., వ్యవసాయ శాఖ అందిస్తున్న నూతన సాంకేతిక పరిశోధనలు, వివిధ పథకాల ఫలితాలు, ఉపయోగాలను రైతుల ద్వారా నేరుగా తెలుసుకొని తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడం.
3. ప్రభుత్వం, పి.జె.టి.ఎ.యు. ప్రస్తుతం ఉన్న విస్తరణ వ్యవస్థపై పెట్టే ఖర్చును, సమయాన్ని, మానవ వనరుల వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ఇప్పటి వరకు వాతావరణ ఆధారిత పంటల సాగు, ఉద్యాన, పాడి పరిశ్రమ, మార్కెటింగ్ శాఖకు సంబంధించిన అంశాల మీద 28 ఎపిసోడ్‌లను నిర్వహించి సుమారు రెండు లక్షల మందికి పైగా రైతులకు, గ్రామస్థాయి విస్తరణ అధికారులకు నేరుగా శాస్త్రవేత్తలు, అధికారులు సాంకేతిక సలహాలు అందించారు.
ఈ విధంగా భవిష్యత్‌లో రైతు నేస్తం వీడియో కాన్ఫెరేన్స్ ప్రత్యక్ష కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల(2601) ద్వారా పి.జె.టి.ఎ.యు., ఎలక్ట్రానిక్ వింగ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించి రౖెెతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన సమయంలో సలహాలు సూచనలు అందించి రైతులలో సాంకేతిక సాధికారత (టెక్నాలజికల్ ఎంపవర్ మెంట్), సరైన నిర్ణయాలు తీసుకునే (డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ) సామర్ధ్యాన్ని నిరంతరం బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయంలో సుస్థిర అదాయం సాధించే దిశగా కృషి చేయడం జరుగుతుంది.
డా. ఎం. శ్రీనివాసులు, కో`ఆర్డినేటర్, డా. జె.ఎస్. సుధా రాణి, శాస్త్రవేత్త, డా. జె. రవీందర్, శాస్త్రవేత్త, బి. సింగారెడ్డి, వ్యవసాయ ఉప సంచాలకులు, నోడల్ అధికారి (రైతునేస్తం)
ఎలక్ట్రానిక్ వింగ్, పి.జె.టి.ఎ.యు., ఎ.ఆర్.ఐ., రాజేంద్రనగర్, హైదరాబాద్.