Ground Water Resources Assesment: వనపర్తి జిల్లా కేంద్రంలో భూగర్భ జల విభాగం (ground water resources assesment) రూపొందించిన వనపర్తి జిల్లా భూజల వనరులు పుస్తకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా గారు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి గారు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశీష్ తదితరులు హాజరయ్యారు.
వనపర్తి జిల్లాలో 4.40 మీటర్ల లోతున భూగర్భజలాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భజలాలు పెరిగిన జిల్లా వనపర్తి ఒక్కటే. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఫలితమే భూగర్భజలాలు పెరిగాయి.దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మలిచాం అని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. కేవలం మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలకు నిదర్శనం అని కొనియాడారు. ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చే ఏడాదికి మొదటి దశ అందుబాటులోకి వస్తుందని అన్నారు.
Also Read: Palle Nidra: వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలి – మంత్రి నిరంజన్ రెడ్డి.!
ఒకప్పుడు ప్రాజెక్టులున్నా నీళ్లు లేని దుస్థితి .. నేడు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా దర్శనం ఇస్తున్నా ఒడిసి పట్టుకోవడానికి రిజర్వాయర్లు లేని పరిస్థితి దాపరించిందని నిరంజన్రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కనీసం నాలుగు టీఎంసీలు నీళ్లు నిలుపుకునే రిజర్వాయర్లు కూడా నిర్మించలేదని అన్నారు. గత పాలకులు కేవలం పేరుకు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టారు .. కానీ వాటి నుండి ప్రయోజనాలు రైతాంగానికి చేరకుండా చేశారన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో కాలువల ద్వారా చెరువులు, కుంటలు నింపే అవకాశం ఇవ్వడం మూలంగా నేడు భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి అని తెలిపారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ ముందుచూపు ఫలితంగానే సాగునీటి వసతి మూలంగా పల్లెలు పచ్చబడి వలసలు ఆగిపోయాయి అని నిరంజన్ రెడ్డి గారు సగర్వంగా తెలిపారు.