Cotton Varieties : తెలంగాణ ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో గత మార్చిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున దృశ్య శ్రవణ పరికరాలు ఏర్పాటు చేసి రైతులతో నేరుగా మాట్లాడే రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ,అనుబంధ శాఖల కార్యకలాపాలపై రైతులకు ప్రతి మంగళవారం అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 38,794 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు.
రైతునేస్తం కార్యక్రమంలో అధిక సాంద్రత పత్తి సాగు,సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొని హాజరైన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేశామని,ఇతర రాష్ట్రాల నుంచి కూడా విత్తనాలు తెప్పించి అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు పత్తి విత్తనం అందుబాటులో ఉందని, అన్నిపత్తి రకాలు సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే ఒకే రకమైన దిగుబడిని ఇస్తాయని, నిర్దిష్టరకాన్ని డిమాండ్ చేయవద్దని రైతులకు సూచించారు.
పంట కాలం ఆధారంగా రైతుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత రైతులకు అవసరమైన విషయాలపై రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టాలని,ఎక్కువ మంది మహిళా రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైతులు సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని సక్రమంగా అనుసరించి పంటలు పండిస్తే ఎగుమతులకు అవకాశం ఏర్పడి పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉందని సూచించారు.
పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించి, ప్రజలు శ్రేయస్సు కోసం సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అనుసరించాలని రైతులను అభ్యర్థించారు.
వ్యవసాయసంచాలకులు బి. గోపి మాట్లాడుతూ రెండవ విడతలో మండలానికి ఒకటి చొప్పున మరో 456 దృశ్య శ్రావణ పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, అవి ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ రైతు వేదికల నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో పాటువ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధన సంచాలకులు డా.పి.రఘురామి రెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం, వరంగల్ నుంచి పత్తి శాస్త్రవేత్త డా.పి.ప్రశాంత్ హాజరై రైతులకు అధిక సాంద్రత పత్తి సాగుపై అవగహన కల్పించారు.