Tenant Farmers: వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగలా మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పలు మార్లు చెప్తున్న మాట. అయితే సీఎం అనుకున్నవిధంగా తెలంగాణ వ్యవసాయ రంగం మారిందా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది. వరి కొనుగోలు ఇష్యూ నుంచి రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటను కొనుగోలు చేయమని ప్రభుత్వాలు ప్రకటించడంతో తెలంగాణాలో రైతులు వెంట వెంటనే ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాము. తాజాగా ఓ రైతు రైతుబంధు అమలుకాలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.
మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి లో అప్పుల బాధతో ఇటీవల రవి అనే ఓరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రవి కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అదేవిధంగా బాధిత కుటుంబానికి తన వంతు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతు బంధు రాకపోవడంతో రవి లాంటి ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మెగా కృష్ణారెడ్డి అపర కోటీశ్వరుడైతే…కాళేశ్వరం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు పేదవాళ్లుగా మారారు అని ఫైర్ అయ్యారు.
ప్రాజెక్టుల కోసం ఎంతో మంది అమాయకులు తమ పంట భూముల్ని ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం నమ్మబలికి తీరా వారిని నట్టేట మోసం చేసిందని అన్నారు వివేక్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు ఆయన వెంట ఉన్నారు.