ఇటీవల భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆద్వర్యంలో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు లో నిర్వహించిన అఖిల భారత మొక్కజొన్న పరిశోధన సమన్వయ సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల రూపొందించిన ఐదు ఉత్తమమైన మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను విడుదల చేశారని విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. నూతనంగా విదుదలైన హైబ్రిడ్ రకాలు దక్కన్ హైబ్రిడ్ మక్కా () 144, డి.హెచ్.యం. 182, డి.హెచ్.యం.193, డిహెచ్.యం.206,డిహెచ్.యం.218 లతో కలిపి ఈ విశ్వవిద్యాలయం నుండి మొత్తం 24 మొక్కజొన్న హైబ్రిడ్ రకాలు విడుదల అయ్యాయి. ఇందులో డి.హెచ్.యం. 144 (తెలంగాణ మక్క – 6) రకంలో అధిక పిండి పదార్థాలు ఉండటం వలన ఇథనాల్ ఉత్పత్తికి బాగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా డి.హెచ్.యం. 206 (తెలంగాణ మక్క – 3) మెట్ట సాగుకు అనుకూలమైనదని మరియు ఎండు తెగులును సమర్థ వంతంగా తట్టుకుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్థుతం రైతాంగానికి అందుబాటులో ఉన్న వివిధ మొక్కజొన్న వంగడాలతో పోల్చితే డి.హెచ్.యం. అన్ని విధాలుగా మేలైందని పరిశోదనలో తేలింది. కాబట్టి ఈ సదవకాశాన్ని రాబోయే కాలంలో రైతాంగం వినియోగించుకోవలసిందిగా విశ్వవిద్యాలయ అధికారులు కోరుతున్నారు.
16 పంట రకాలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటిత రకాలుగా గుర్తింపు:
ఈ మధ్య కాలంలో జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన 16 వివిధ పంటల రకాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారిక ప్రకటిథ రకాలుగా (నోటిఫైడ్ వైరైటీస్) గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసారు. తద్వార జయశంకర్ వర్సిటీ విడుదల చేసిన ఈ పంట రకాలను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా విత్తనోత్పత్తి ప్రణాళికలు రూపోందించి ఈ రకాలను రైతాంగానికి అందుబాటులోనికి తేవడానికి సహకరిస్తుంది. ఈ నేపధ్యంలో రాస్ట్రంలోని వివిధ విత్తన సంస్థలు ఈ రకాల మూల విత్తన సరఫరా కొరకు విశ్వవిద్యాలయాన్ని సంప్రదించాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచిస్తున్నారు.