Devarakadra TRS MLA Ala Venkateshwara Reddy- మహబూబ్ నగర్: రాష్ట్రంలోనే ఎక్కువ చెక్‌డ్యాంలు నిర్మించి జలవనరులను సద్వినియోగం చేసుకుంటున్న నియోజకవర్గం అది.. ఒకటి కాదు రెండు కాదు రెండు వాగులపై రూ.170 కోట్లు వెచ్చించి 20చెక్‌డ్యాంలు నిర్మించారు. వాగులు వంకల్లో వృథాగా పోతున్న జలవనరులను ఒడిసి పట్టేందుకు ప్రత్యేక నిధులను తీసుకొచ్చి నాలుగు మండలాల్లో వాగులపై చెక్‌డ్యాంలు కట్టారు.
కందూరు వాగుకు ఏకంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కెనాల్‌కు లింక్ ఇవ్వడం ద్వారా ఏడాదిలో ఆరునెలల పాటు ఎక్కడచూసినా నీళ్లే కనిపిస్తాయి. ఫలితంగా నియోజకవర్గంలో భూగర్భజలాలు ఉబికివస్తున్నాయి. అదనంగా 20వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ఆయా గ్రామాల సమీపంలో నిర్మించిన ఈ చెక్‌డ్యాంలు సరస్సులను తలపిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల యువకులు ఈతకొడుతూ సరదా తీర్చుకుంటున్నారు.
మత్స్యసంపద రెట్టింపయింది. దీంతో దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మంత్రాంగం ఫలించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే ఆదర్శంగా మారిన దేవరకద్ర నియోజకవర్గం.
వ్యవసాయ బోర్లు రీచార్జ్ అయి రెండు పంటలకు అనువుగా మారుతుంది. ఆరునెలల పాటు నీరు నిల్వ ఉండటంతో రైతులు ఉత్సాహంగా సాగు చేస్తున్నారు.
Also Read: Devarakadra Check Dam: జలసిరులతో కలకలలాడుతున్న దేవరకద్ర నియోజకవర్గం.!
ఎమ్మెల్యే ఇంజినీర్ కావడం వల్లే..
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఇంజినీర్ కావడం.. పైగా వ్యవసాయంపై కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. తన తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జెడ్పీటీసీ నుంచి ఏకంగా రెండుసార్లు దేవరకద్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే తన నియోజకవర్గంలో వాగులు వంకలు ఎక్కువ ఉండటం వల్ల రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రతిపాదించారు. గతంలో పెద్దవాగులపై వాలుకట్ట నిర్మాణం చేపట్టేందుకు వీలుండేది. దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదని భావించి ఆయన చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాగులపై చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గం ఉమ్మడి జిల్లాకే ఆదర్శంగా నిలిచింది.
కల్వకుర్తి ఎత్తిపోతల లింక్..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం వరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వ ద్వారా జలాలు పారుతాయి. ఈ కాల్వ ద్వారా ఏకంగా అడ్డాకుల మండలంలోని పెద్దవాగుకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయాలని, తక్కువ ఖర్చుతో సాగులోకి వస్తాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
దీంతో తక్కువ ఖర్చుతో ప్రత్యేక కెనాల్‌ను తవ్వి పెద్దవాగుకు ఈ నీటిని మళ్లించారు. దీంతో ఎంజీకేఎల్ఐ నుంచి ఎప్పుడు నీళ్లు వదిలినా ఈ కాల్వ ద్వారా వచ్చిన నీళ్లు నేరుగా వాగులోకి మళ్లుతాయి. దీంతో మూసాపేట, అడ్డాకుల మండలాల్లోని వాగు పరీవాహక ప్రాంతాల రైతులకు ప్రయోజనం కలుగుతున్నది. సమీప గ్రామాల వ్యవసాయ బోర్లు రీచార్జ్ అయి రెండు పంటలకు అనువుగా మారుతుంది. ఆరునెలల పాటు నీరు నిల్వ ఉండటంతో రైతులు ఉత్సాహంగా సాగు చేస్తున్నారు.
చెక్‌డ్యాంలతో జలకళ
మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియెజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాగులపై 20చెక్‌డ్యాంలు నిర్మించారు. ఫలితంగా భారీ వర్షాలు కరిసినప్పుడు వరదను ఎక్కడికక్కడే ఒడిసిపట్టే విధంగా డిజైన్ చేశారు. 2019లో ప్రారంభమైన ఈ బృహత్ పథకం 2022వరకు పూర్తయింది. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నాణ్యతలో రాజీపడకుండా నిర్మించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. వీటిని దగ్గరుండి పర్యవేక్షించి సూచనలు, సలహాలు చేశారు.
దీంతో దేవరకద్ర మండలంలో గూరకొండ, చిన్నరాజమూరు, బస్వాపూర్, పెద్దరాజమూరు, పేరూరు, రేకులంపల్లి, బండర్‌పల్లి, అడ్డాకుల మండలం వర్నె, కన్మనూరు, గౌరిదేవిపల్లి, పొన్నకల్, రాచాల, చిన్నచింతకుంట మండలం లాల్కోట, పల్లమర్రి, ముచ్చింతల, కురుమూర్తి, ఏదులాపూర్, అల్లీపూర్, మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామాల సమీపంలోని వాగుల్లో నిర్మించారు. నీటిపారుదల శాఖ, మిషన్‌కాకతీయ సాధారణ ప్లాన్ కింద రూ.170కోట్లు వెచ్చించారు. మరో 11చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు.
20వేల ఎకరాలు సాగులోకి..
దేవరకద్ర నియోజకవర్గంలోని రెండు వాగులపై చెక్‌డ్యాంలను నిర్మించడం వల్ల తక్కువ ఖర్చుతో దాదాపు 20వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలైంది. వాగు పరీవాహక ప్రాంతాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు రెండు పంటలను సాగు చేసేందుకు వెసులుబాటు కలిగింది. వర్షాలు కురిసిన సమయంలో వృథాగా పోతున్న వరదను చెక్‌డ్యాంలు ఎక్కడికక్కడే ఆపుతాయి. దీంతో ప్రతి ఐదు నాలుగు కిలోమీటర్లు పరిధిలో ఎక్కడ చూసినా నీళ్లే దర్శనమిస్తాయి. గత నెల నుంచి కురుస్తున్న వానల వల్ల 20చెక్‌డ్యాంలు అలుగు పారుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భూగర్భజలాలు పెరిగాయి..
గతంలో వర్షాలు కురిసిన రెండు, మూడు రోజులు అంతకంటే వారంరోజులు సన్నగా వాగు పారేది. ఆ తర్వాత ఎండిపోతుండే. వేసిన పంటలకు సాగునీరు అందక ఎండిపోయేవి. ఏటా నష్టం జరిగేది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పెద్దవాగు పరిధిలోని నిజాలాపూర్, సంకలమద్ది శివారులో చెక్‌డ్యాంలు నిర్మించడం వల్ల వాగులో నెలల తరబడి వాగు పారుతున్నది. బావుల్లో భూగర్భజలాలు పెరిగాయి. ఇప్పుడు పంటలు ఎండపోవడం లేదు.
– మోత్కాయల భీమన్న, రైతు, నిజాలాపూర్
రైతులకు భరోసా
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి వనరులు పెంచింది. ఎమ్మెల్యే ఆల ఊకచెట్టు వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించడంతో భూగర్భజలాలు పెరిగినవి. ఎండిపోయిన బోరుబావులు సైతం నీటితో నిండాయి. గతంలో సాగునీటికి బాగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలాంటి సమస్యలు తీరాయి. పూర్తి భరోసాతో మూడెకరాల్లో వానకాలం, యాసంగి పంటలు వేసుకొని పండించుకుంటున్నాం.
– నర్సింహారెడ్డి, రైతు, నాగారం గ్రామం
మరో 11 చెక్‌డ్యాంలకు ప్రతిపాదనలు
చెక్‌డ్యాంలు నిండి ప్రవహిస్తుంటే సంతోషంగా ఉన్నది. వానలు పడినప్పుడు వాగుల్లో వృథాగా నీళ్లుపోతుంటే బాధేసేది. వంకల్లో కట్టే చెక్‌డ్యాంలు భారీగా ఇక్కడ కడితే బాగుండేదని అధికారులకు సూచించాను. అధికారులు వాగుపై ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి ఎంత డెప్త్‌లో, హైట్‌లో ఉండాలో ఇంజినీర్లు ప్రతిపాదనలు తయారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించగానే ఒప్పుకున్నారు. రూ.170కోట్ల ప్రత్యేక నిధులు వెచ్చించి 21మంజూరయ్యాయి. 20చెక్‌డ్యాంలు ఇప్పుడు అలుగు పారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే భూగర్భ జలాలు మా నియోజకవర్గంలోనే పెరిగాయి. మరో 11 చెక్‌డ్యాంలు కావాలని ముఖ్యమంత్రికి విన్నవించాం. అవి కూడా త్వరలో మంజూరవుతాయి.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర
Also Read:Agri Awards 2022: అగ్రి ఇన్ ఫుట్స్ పరిశ్రమలకు తెలంగాణ కేంద్ర బిందువు – మంత్రి నిరంజన్ రెడ్డి