CM KCR Warangal Tour: అకాల వర్షాలు రైతు కష్టానికి శాపంగా మారుతున్నాయి. ఆరుగాలం పండించిన పంట చేతికొస్తుంది అనుకునేలోపు అకాల వర్షాలు పంటను మింగేస్తున్నాయి. ఇటీవల దేశంలో పలు చోట్ల వర్షాలు కురిసాయి. అకాల వర్షాల కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల భారీ వర్షాల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక వర్షాల కారణంగా తెలంగాణాలో పంట నీటిపాలైంది. పంటను నష్టపోవడంతో రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే పంట నష్టపోయిన ప్రాంతాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంఓ నుండి సమాచారం అందింది. వివరాలలోకి వెళితే…
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర నాయకత్వం ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన నేడు మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు మంగళవారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.
కాగా.. ఖరీఫ్ సీజన్‌లో అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పత్తి పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో పత్తి రైతులు దిగులుగా ఉన్నారు. ఇక రబీ సీజన్ ప్రారంభంలో కురిసన వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు కొన్ని జిల్లాల్లో రైతులు ఇప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాలను కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
CM KCR Warangal Tour Updates, Eruvaaka Daily News