Palem Kisan Mela 2022: నాగర్ కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రూ.93 లక్షలతో నిర్మించిన భూసార పరీక్షాకేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం కిసాన్ మేళాలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జడ్పీ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ గారు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగదీశ్వర్ గారు, ఏడీఆర్ గోవర్దన్ గారు, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ గారు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన మాటలు మాట్లాడారు. రైతును గౌరవించినప్పుడే సమాజ అభ్యున్నతి సాధ్యం అవుతుందని ఆధునిక యుగంలో ఆహారరంగమే అతిపెద్ద పరిశ్రమ అని పరిశోధనా ఫలాలు రైతుల క్షేత్రాలకు చేరాలని ఆ ఫలాలతో రైతులు అద్భుతమైన వ్యవసాయ ఉత్పత్తులు సాధించాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
వ్యవసాయాన్ని ఆధునిక పరిశ్రమగా రుజువు చేయాలి. మానవ పరిణామక్రమంలో గత 10, 11 వేల ఏళ్లు కీలకం. అంతకుముందు అంతా స్థిరనివాసం లేని కాలం. స్థిరనివాసం ఏర్పడిన తర్వాత వచ్చిన పరిశోధనలు, ఆవిష్కరణలు అత్యంత గొప్పవి. ఇటీవలె భూమండలం మీద ప్రపంచంలో 800 కోట్ల జనాభా నమోదయింది. ప్రతి రోజు భూమ్మీద పుడుతున్న వారి సంఖ్య 2 లక్షలు, మరణిస్తున్న వారి సంఖ్య లక్ష. ప్రపంచ జనాభాకు అత్యంత ప్రాధాన్యం ఆహారం .. ఏది లేకున్నా నడుస్తుంది .. ఆహారం లేకుంటే నడవదు. వ్యవసాయం నడిస్తేనే ఆహారం వస్తుంది.
మానవజాతితో పాటు కొన్నిమినహా మిగిలిన జంతుజాలాలకు రైతు పండించిన వ్యవసాయం నుండి వచ్చిన ఉత్పత్తులే ఆధారం. జనాభాకు సరిపడా సమకూర్చుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. భూమి యొక్క సారాన్ని పెంచుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలి. వ్యవసాయంలో సహజ సిద్ద ఎరువుల వినియోగం తగ్గిపోతున్నది.
రోజువారీ అవసరాలకు అవసరమైన కూరగాయలు కూడా రైతు తన పంటచేలో పండించుకోవడం లేదు. ఏటా రెండు సార్లు భూసార పరీక్షలను నిర్వహించాలి .. వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా రైతులను ఈ విషయంలో చైతన్యపరచాలి. భూసార పరీక్షల ఫలితాల అనంతరం అధికారుల సూచనల మేరకు రైతులు ఎరువులను వినియోగిస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.
హరితవిప్లవంలో భాగంగా పంటల ఉత్పాదకత పెంచేందుకు దేశంలో ఎరువుల వినియోగం పెరిగింది .. అప్పట్లో ప్రజల అవసరాలకు సరిపడా ఆహారం కావాలన్న క్రమంలో అలా చేయడం జరిగింది. నేడు పంట ఉత్పత్తులలో పురుగుమందు అవశేషాలు పెరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. వ్యవసాయంలో ఎరువుల వినియోగం తగ్గించికోవాలి. భూమిలో కర్బనశాతం పెంచుకోవాలి .. ఏడు శాతం ఉండాల్సిన చోట కేవలం అరశాతం మాత్రమే ఉన్నది.
పిల్లిపెసర, జీలుగ విత్తనాలను రైతులు విరివిగా వినియోగించాలి. ఒకప్పుడు కొంత మంది చేతులలోనే భూమి ఉండేది. కొన్నితరాలు వ్యవసాయం నుండి దూరం కావడంతో ఇతర వర్గాల చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణలో కోటీ 46 లక్షల ఎకరాల భూమి ఉన్నది .. అందులో 92.5 శాతం భూమి 5 ఎకరాల లోపు రైతుల చేతుల్లో ఉన్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రామాల్లో తిరిగినప్పుడు తెలంగాణ ఏర్పాటు ఖాయం, భూముల విలువ పెరగడం ఖాయం .. అందుకే భూములు అమ్ముకోవద్దని రైతాంగానికి చెప్పాం.
ఇంటి వద్ద కోళ్లు, ఎడ్లు, గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలని చెప్పాం .. వాటితో సహజ ఎరువులు అందుబాటులో ఉంటాయని సూచించాం. నేడు జొన్న, గట్క ఆదానీలు, అంబానీలు తింటున్నరు .. అడ్డగోలు తిండి ప్రజలు తింటున్నారు. ఇంటి ముందు పండ్ల చెట్లు పెంచుకునేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రైతుల కష్టాలు చూసి, వ్యవసాయంలో వెతలు చూసి తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టాను.
స్వయంగా వ్యవసాయం చేసి అందులో ఇబ్బందులు గమనించాను. రాబోయే పాలకులు శాస్త్రీయంగా ఆలోచించి ప్రోత్సాహం ఇస్తే పదేళ్ల తర్వాత ప్రపంచానికి అవసరమైన ఆహారం అందించగలిగేది మన దేశమే. ఈ వానాకాలంలో 65 లక్షల ఎకరాలలో వరి సాగయింది. కాకతీయ, రెడ్డిరాజుల కాలం నుండే గొలుసుకట్టు చెరువుల కింద వరి సాగయ్యింది. చరిత్ర తెలియని మూర్ఖులు ఎన్టీఆర్ వచ్చాకనే తెలంగాణకు వరి అన్నం తెలిసింది అంటున్నారు. ఇంతటి మూర్ఖులను ఎక్కడా చూడలేదు.
సమైక్యరాష్ట్రంలో పాలకుల వివక్ష మూలంగా గొలుసుకట్టు చెరువులు దెబ్బతిని తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది. అమెరికా వెళ్లి వచ్చిన వారు వ్యవసాయం, మేకల పెంపకం చేస్తున్నారు. అందరూ పనిచేయాలి .. పని సంస్కృతిని గౌరవించాలి .. గౌరవించడం నేర్పాలి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో ఆహార సంక్షోభం వస్తుంది. రైతును కేంద్రబిందువుగా చేసుకుని కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
Also Read: Agricultural Technology 2022: నూతన వ్యవసాయ సాంకేతికతలపై సదస్సు మరియు ప్రదర్శన.!