Agri Youth Summit – 2023: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 4 రోజుల పాటు నిర్వహించే అగ్రి యూత్ సమ్మిట్ – 2023 సోమవారం ప్రారంభమైంది. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో జరిగిన ఈ అగ్రి యూత్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ ప్రారంభ కార్యక్రమానికి కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీ.వి. సుబ్బారెడ్డి హాజరుకాగా, ఇక్రిశాట్ అగ్రి ఇన్నోవేషన్స్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ రూపావతారం కీలకోపన్యాసం చేశారు. వ్యవసాయం యువతకు ఆకర్షణీయంగా మార్చడం మన ముందున్న ప్రధాన సవాలని డాక్టర్ జీ.వి సుబ్బారెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో నవకల్పనలు చేపట్టే ఆధునిక వ్యవసాయంతో రైతులకు లాభసాటి ఉపాధి రంగంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నవ కల్పనలు చేపట్టడంలో యువత ప్రధాన భూమిక పోషించాలని సూచించారు.
ఇక్రిశాట్ అగ్రి ఇన్నోవేషన్ హబ్, హెడ్ డాక్టర్ శ్రీకాంత్ ‘వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ వినియోగం’ అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. వివిధ వ్యవసాయ కార్యకలాపాలలో కృత్రిమ మేధను వినియోగించి రైతులకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని అన్నారు. సశ్యరక్షణ, పంటల యాజమాన్యం తదితర కార్యకలాపాలలో కృత్రిమ మేధను వినియోగించి అనేకమైన డిజిటల్ వ్యవసాయ యాప్ లు రూపొందిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల రైతులు సమయాన్ని, ఖర్చును తగ్గించుకోవచ్చని అన్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. వెంకటరమణ, అధ్యక్షోపన్యాసం చేశారు. అగ్రి యూత్ సమ్మిట్ వివరాలను డి.ఎస్.ఏ డాక్టర్ జె. సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు డాక్టర్ సీమ, డాక్టర్ డాక్టర్ జమునా రాణి, డాక్టర్ నరేంద్ర రెడ్డి అలాగే ఫిజియాలజీ విభాగం యూనివర్సిటీ హెడ్ డాక్టర్ టి. రమేష్ పాల్గొన్నారు. అగ్రి యూత్ సమ్మిట్- 2023 సమావేశాలను హైదరాబాద్ తో పాటు సిరిసిల్ల, జగిత్యాల కళాశాలలో ఈనెల 26, 28 తేదీలలో నిర్వహిస్తారు. ఈనెల 31 తో ఈ అగ్రి యూత్ సమ్మిట్ – 2023 రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో జరిగే కార్యక్రమంతో ముగుస్తుంది.
Also Read: Sugarcane Farmers: చెరకు రైతుల బకాయిలు చెల్లించాం – కేంద్ర మంత్రి
Paddy Bund Maker: ఈ పరికరం వాడితే రైతులకి 50 వేల రూపాయలపెట్టుబడి తగ్గుతుంది..