వార్తలు

ఉద్యోగం వదిలి వినూత్న పంటలు సాగు చేస్తున్న సుధాకర్…

0

వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం వదిలి, సొంతూరికి వచ్చి వినూత్న పంటలు పండిస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు ధీరావత్ సుధాకర్ నాయక్.. ఎంటెక్ చదివాడు. ఉద్యావన శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేశాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ నాయక్ ది వ్యవసాయ కుటుంబం. ఉన్నత చదువులు, ఉద్యోగాలు.. ఏవీ తనకు సంతృప్తినివ్వలేదు. దీంతో స్వగ్రామానికి వచ్చి సేంద్రియ సాగును మొదలుపెట్టాడు. అందరిలా కాకుండా బ్రొకోలీ, క్యాప్సికం, స్వీట్ కార్న్ లాంటి వినూత్న పంటలు సాగు చేస్తున్నాడు. ఆయా పంటలపై సాటి రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు సుధాకర్.
నగరాల్లో ఎక్కువగా ఉపయోగించే బ్రొకోలీని 20 గుంటల్లో సాగు చేశాడు. స్థానిక వాతావరణం అనుకూలించదని ఎంతమంది చెప్పినా పట్టించుకోలేదు. 20 రోజులు నారు పెరిగిన తర్వాత మొక్కలను నాటించాడు. డ్రిప్ ద్వారా సాగునీరు అందించి అద్భుతమైన దిగుబడిని సాధించాడు. అయితే మార్కెటింగ్ లో అనుభవం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు పడ్డాడు. తొలి రెండు విడతల్లో 23 క్వింటాళ్ల దిగుబడిని సాధించి, రూ. 70 వేల దాకా ఆదాయం పొందాడు. బ్రొకోలీ మీద పల్లెల్లోనూ అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కొంత దిగుబడిని గ్రామంలో ఉచితంగా పంచిపెట్టాడు. తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలు పండిస్తున్నాడు సుధాకర్. రెండు ఎకరాల్లో గ్రీన్ క్యాప్సికంతో పాటు తేజా రకం మిర్చి, సాధారణ మిర్చి సాగు చేస్తున్నాడు. మరో ఎకరంలో స్వీట్ కార్న్ , అంతర పంటగా పుచ్చకాయలు, మొరం గడ్డ లాంటివి సాగు చేస్తున్నాడు. మిగతా పొలంలో వరితోపాటు మినుము, వేరుశనగ, కంది, టమాట, వంకాయలను సేంద్రియ విధానంలో పండిస్తున్నాడు. వరి మినహా అన్ని పంటలకూ డ్రిప్ తోనే నీటిని అందిస్తున్నాడు. గతేడాది ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో పుచ్చకాయలను సాగు చేశాడు. మూడు నెలల్లోనే పంట చేతికి రాగా, స్వయంగా మార్కెటింగ్ చేసుకున్నాడు. అంచనాలకు మించి రూ.లక్షన్నర దాకా ఆర్జించాడు. సుధాకర్ నాయక్ పూర్తిగా సేంద్రియ సాగుకే మొగ్గు చూపుతున్నాడు. మిర్చి సాగులో బొబ్బర, ముడత తెగుళ్ల నివారణకు స్వయంగా సేంద్రియ మందులను తయారు చేశాడు. ఇందుకు రైతుల అనుభవాలతో పాటు సామజిక మాధ్యమాల సాయం తీసుకున్నాడు. ఉమ్మెత్త, జిల్లేడు, పొగాకు, పసుపు, గోమూత్రం, వేపనూనెల మిశ్రమంతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ, చీడపీడల నుంచి పంటలను కాపాడుతున్నాడు. వ్యవసాయమే నాకు సంతృప్తినిస్తున్నది. నాకున్న ఐదెకరాల్లోనూ మా నాన్నతో కలిసి పని చేయాలకున్నా ఎప్పుడూ వేసే పంటలే కాకుండా వెరైటీగా సాగు చేయాలనే ఉద్దేశంతో బ్రొకోలీ పంటను ఎంచుకున్నాడు. మంచి దిగుబడి వచ్చింది. కానీ మార్కెట్ పై అవగాహన లేకపోవడంతో ఆదాయం తగ్గింది. రైతులంతా ఆర్గానిక్ సాగు చేయాలన్నదే తన లక్ష్యం. తన గ్రామంలో సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నాడు.

Leave Your Comments

చేపల పెంపకంలో నీటి గుణాల ప్రాముఖ్యత – యాజమాన్య పద్ధతులు

Previous article

శరీరానికి తగినంత పొటాషియం అందకపోతే కలిగే నష్టాలు..

Next article

You may also like