Success Story Of Farmer Nunna Rambabu: మిచాంగ్ తుఫానుకు ఎదురొడ్డి నిలిచిన రైతు పంట -సోషల్ మీడియా వేదికగా ఉత్పత్తుల మార్కెటింగ్ పక్క ఫొటోలో రసాయన, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన పంటల వ్యత్యాసాన్ని ఒక్కసారి పరిశీలించండి… ఇది 2023 చివర్లో వచ్చిన మిచాంగ్ తుఫాను సమయంలో చేసిన సేద్యం .. తుఫాను సమయంలో వీచిన గాలులకు రసాయన విధానంలో సాగు చేసిన పంట పడిపోగా, ఆ వెనుక ధైర్యంగా నిలబడి ఫొటోకు ఫోజిస్తున్నట్టు కనిపిస్తున్న వరి పంట మాత్రం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన పొలం. ప్రకృతి వ్యవసాయ విధానంలో పంట ఎందుకు పడిపోలేదో తెలుసుకోవాలంటే రైతుతో ముచ్చటించాల్సిందే.
పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం, కావలిపురం గ్రామానికి చెందిన యువ రైతు నున్న రాంబాబు ఐదారేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి, సారం పెరిగి, పంట వేరు వ్యవస్థ 28 సెంటీమీటర్ల లోతు వరకు వృద్ది చెందడంతో తుఫానును సైతం ఎదురొడ్డి నిలిచింది. పక్కనే పడిపోయిన రసాయన పంట వేర్ల పొడవు 22 సెంటీమీటర్లు మాత్రమే. ఈ వేర్లు భూమిలోకి తక్కువగా వెళ్లడం వల్ల తుఫాను దాటికి నిలదొక్కుకోలేని స్థితికి చేరుకుంది.
డిగ్రీ పట్టా చేతికొచ్చిందంటే చాలు.. యువత ఉద్యోగ వేటలో పడుతున్న రోజులివి… అలాంటిది అప్పటికే ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రకృతి బాట పట్టాడు బీటెక్ చదివిన రాంబాబు ఐదేళ్ల క్రితం వరకు సిప్లా కంపెనీలో ఉద్యోగం చేసేవారు. అప్పటికే తండ్రి సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తుండేవారు. హఠాత్తుగా తండ్రి బౌతికంగా దూరం కావడంతో ప్రకృతి విధానంపై పలుమార్లు శిక్షణ పొందిన రాంబాబు అదే పద్థతిలో సాగు చేయాలనే ఆసక్తితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి నాగలి పట్టాడు.
రాంబాబుకు పది ఎకరాల పొలం ఉంది. పది ఎకరాల్లోనూ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించి సాగు ప్రారంభించాడు. పూర్తిస్థాయిలో రాజీలేని సూత్రాలను అమలు చేయలేకపోవడం వల్ల మొదట్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ విషయం గ్రహించిన రాంబాబు పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి సాగు చేయాలని నిర్ణయించి మరో ప్రయత్నం చేశాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంట పోషణ, తెగుళ్ల నియంత్రణకు జీవ ఎరువులు వాడాలని రైతు సాధికార సంస్థ జిల్లా మేనేజరు సూచించడంతో ఆ దిశగా అడుగులు వేశారు. రుతుపవనాలకు ముందు నవధాన్యాలతో పాటు 30 రకాల విత్తనాలతో సాగుచేసారు. అందులో కేవలం తోటకూరలు, కూరగాయలను వినియోగించుకుని మిగిలిన పంటలన్నింటినీ కలిపి దుక్కి చేసారు. ఇదే సమయంలో వర్మీ కంపోష్టు, ఘన జీవామృతంతో పాటు ఎకరానికి 4 టన్నుల టైప్ 2 ఘన జీవామృతం వేసి నాట్లు పూర్తి చేశారు. ఉత్పత్తి అధికం అయ్యేందుకు చేపబెల్లంతో పాటు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాలను వినియోగించారు. ఈ విధంగా ఖరీఫ్ పూర్తయిన వెంటనే ఖాళీగా ఉన్న భూమిలో రబీ డ్రై షోయింగ్ లో భాగంగా మరోమారు నవధాన్యాలతో పాటు ఇతర విత్తనాలను వేశారు . 20 రోజులు గడిచాక వాటిని కలిపి దుక్కి చేసి, రబీకి నాట్లు వేశారు. సాగు ప్రారంభం నుంచి ముగిసే వరకు అన్నీ ప్రకృతి పద్ధతిలో రాజీలేని సూత్రాలను అమలు చేయడంతో దాదాపుగా ఎకరానికి ఖరీఫ్ లో 28 నుంచి 29 బస్తాలు, రబీలో 38 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. వీటితో పాటు రాంబాబు ఐదు సెంట్లలో ఏటీఎం మోడల్, ఫైవ్ లేయర్ మోడల్, 36*36 మోడల్ సాగు చేస్తున్నారు. వీటికి అవసరమయ్యే మూత్రం, పేడ కోసం దేశీయ ఆవులను సమకూర్చుకొన్నారు.
పంట దిగుబడి వరకు బాగానే ఉన్నా కొంతమంది రైతులు వాటిని మార్కెటింగ్ చేయడంలో విఫలమవుతున్నారు. అయితే అందుకు భిన్నంగా రాంబాబు మార్కెటింగ్ కోసం సోషల్ మీడియాను ఎంచుకొన్నారు . పక్కా ప్లాన్ తో మార్కెటింగ్ ఏర్పాట్లు చేశారు. తన స్నేహితులతో వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసి తన వద్ద ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వివరాలను ధరలతో సహా పోస్టు చేస్తుంటాడు. ఈ విధంగా తన ఉత్పత్తుల వివరాలను వందల సంఖ్యలో జనాలకు చేరుతుంది. దేశీయ విత్తనాలైన కుజీపఠాలియా, నవారా, ఇంద్రాణి తో పాటు తెలంగాణా రకం ఆర్ ఎన్ ఆర్, సుగర్ లెస్ రకాల ఉత్పత్తులను అమ్మకం చేస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాదుకు చెందిన స్నేహితులకు 25 కిలోల బియ్యాన్ని రూ. 1,850లకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా రాంబాబు పెట్టుబడులు పోను ఎకరానికి ఏటా లక్షా 20వేల రూపాయలు ఆర్జిస్తున్నాడు. తను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న ఐదు ఎకరాలకుగాను ఏడాదికి ఆరు లక్షల నికర ఆదాయం పొందుతున్నాడు. ఇంతటితో ఆగకుండా భవిషత్తులో కూరగాయలను ప్యాకింగ్ చేసి అమ్మకం చేసే విధంగా ప్రణాళికలు చేసుకుంటున్నారు
రాంబాబు ప్రధానంగా ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతం కావడంతో వానపాములు వృద్ది చెందాయి. అవి ఏ స్థాయిలో అంటే.. భూమిలో అడుగు లోతు గొయ్యి తీయగానే లక్షల సంఖ్యలో వానపాములు కనిపిస్తాయి. ఈ కారణంగా వేరు వ్యవస్థ మరింత లోపలకు వృద్ది చెంది ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైతం పంట దెబ్బతినకుండా తట్టుకొని నిలబడుతోంది. మిచాంగ్ తుఫాను సమయంలో రాంబాబు పొలంలో జరిగిన అద్భుతాన్ని చూసిన చుట్టుపక్కల రైతులు ప్రకృతి వ్యవసాయంలో అడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.