వార్తలు

సూక్ష్మ సేద్యం చేపట్టాలనుకునే రైతులకు ఊరట..

0

సూక్ష్మసేద్య పథకం కింద ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకు రూ.2.11కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా కేవలం కూరగాయలు, పండ్ల తోటల రైతులకు మాత్రమే సబ్సీడీపై డ్రిప్ పరికరాలు అందజేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 500 ఎకరాల్లో డ్రిప్ పరికరాల ఏర్పాటుకు అవకాశం లభించనుంది. ఐదు సంవత్సరాల నుంచి డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న రైతులు చాలామందే ఉండడంతో అధికారులు గతంలోనే ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివర్లో మంజూరు అవకాశం కల్పించడంతో చిన్న, సన్నకారు రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.
నీటిని ఆదా చేస్తూ మొక్కలకు నేరుగా సూక్ష్మ సేద్యం ద్వారా నీళ్లు అందించవచ్చు. ఈ సూక్ష్మ సేద్యం, తుంపర సేద్యం రెండు విధాలుగా ఉంటుంది. డ్రిప్ పరికరాల్లో హెడ్ కంట్రోల్ యూనిట్, స్క్రీన్ ఫిల్టర్, వాల్వ్స్, లిక్విడ్ ఫర్టిలైజర్ సిస్టం, పీవీసీ పైపులు, లాటర్ పైపుల ద్వారా మొక్క వద్ద నీరు చుక్కచుక్కగా పడుతుంది. దీనిని ఏర్పాటు చేసుకునేందుకు రెండన్నర ఎకరాలకు మామిడి, బత్తాయి తోటలకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతుండగా, ఇతర పంటలకు రూ.లక్ష వరకు అవుతుంది. తుంపర సేద్యంలో ఒక హెక్టారుకు 25 పైపులు, వాటికి నాజిల్స్ ఉంటాయి. నాజిల్స్ తిరుగుతూ నీటిని మొక్కలపై వెదజల్లుతుంది. హెక్టారుకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. తక్కువ నీటితో పంటలు పండించవచ్చు. సమయం, విద్యుత్ ఆదా అవుతుంది.
ఎన్నో ప్రయోజనాలు ఉన్న సూక్ష్మసేద్యాన్ని విస్తరించేందుకు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో సూక్ష్మ సేద్యం పథకాన్ని తీసుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకానికి నిధులు కేటాయిస్తాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీలకు 90 శాతం, ఓసీ రైతులకు 80 శాతం సబ్సీడీతో పరికరాలు అందిస్తారు. ఈ సబ్సీడీ ద్వారా రైతులు వారు వేసుకున్న పంటలకు సరైన రీతిలో నీటి సౌకర్యం అందడంతో పాటు అధిక దిగుబడి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తోటలు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పంట ఉత్పత్తులు నాణ్యతతో ఉంటాయి. కూలీల ఖర్చు తగ్గుతుంది.
జిల్లాలోని చాలా ప్రాంతాల్లో బోర్ల కింద వ్యవసాయం చేస్తున్నారు. డ్రిప్ పై ఇటీవల కాలంలో చాలామంది రైతులు దృష్టి సారిస్తున్నారు. పండ్లతోటలు, కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నారు. వర్షాలు సరిగ్గా కురవకపోతే బోర్లలో, బావుల్లో నీరు తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితిల్లో సూక్ష్మ సేద్యం ఉండడంతో నీటిని ఆదా చేయడంతో పాటు వర్షాలు బాగా కురవకపోతే పంటలను రక్షించుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐదేళ్లుగా రైతులకు డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడి డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఉద్యానవనశాఖ అధికారులు ప్రతి పాదనలు పంపించగా లాక్ డౌన్, కోవిడ్ కారణంగా మంజూరులో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం ముగియడానికి నెల రోజుల ముందు ఎట్టకేలకు ప్రభుత్వం సూక్ష్మసేద్యం పథకం కింద రూ.2.11 కోట్లు మంజూరు చేసింది. మంజూరైన నిధులు తక్కువే అయిన చిన్న, సన్నకారు రైతులకు కాసింత ఊరట లభించనుంది.

Leave Your Comments

బ్రకోలీ పంట సాగు..లాభాల బాటలో

Previous article

బెండ సాగులో మెళుకువలు..

Next article

You may also like