SESAMUM PHYLLODY: ఖలీఫ్, రబీ, వేసవిలో కూడా సాగుచేసుకోగల నూనెగింజ పంటల్లో నువ్వు ప్రధానమైంది. గింజల్లో అధికంగా నూనె, మాంసకృత్తులు ఉండడంతో పాటు ఆయుర్వేద వైద్యం, నిల్వ పదార్థాల తయారీలో నువ్వుల నూనె కున్న ప్రాముఖ్యత వల్ల ఈ పంటకు మంచి ఆదరణ ఉంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నీరు నిలవని అన్ని రకాల నేలల్లో సాగు చేసుకునే అవకాశమున్నపైరు కావటం వల్ల పంటల సరళిలో భాగస్వామిగా కూడా ఈ పంటకు మంచి స్థానం ఉంది.మంచి దిగుబడి నిచ్చే రకాలు అందు బాటులో ఉన్నప్పటికీ చీడ పీడల కారణంగా ఆశించిన దిగుబడులు రావడం లేదు. రబీ, వేసవి పంటగా సాగు చేసినపుడు పురుగులు, తెగుళ్ళ బెడద తక్కువగా ఉండి మంచి దిగుబడులు వస్తున్నప్పటికీ, రబీలో ఆలస్యంగా విత్తుకున్నపుడు, ఖరీఫ్ లో ఎక్కువ వర్షపాతం, గాలిలో ఆర్ద్రత 90 శాతం కంటే ఎక్కువ ఉండి ఉష్ణోగ్రతలు 25 డి.సెం.గ్రే. కంటే తగ్గినపుడు పైరు పూత దశలో, వెర్రితెగులు (ఫిల్లోడి) ఆశించి పంటకు నష్టాన్ని కలుగచేస్తుంది.
వెర్రి తెగులు:
వెర్రి తెగులు మైకో ప్లాస్మా అనే సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది. నువ్వులతోపాటు ఆవాల జాతి మొక్కలు, శనగ, వేరుశనగ, జనుము మొదలగు పంటలపైన కూడా ఈ సూక్ష్మజీవి తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోగలదు. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు ఈ సూక్ష్మజీవులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి.
తెగులు లక్షణాలు:
వెర్రి తెగులు ఆశించిన మొక్కల ఆకులు చిన్నవై ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. పంట పూత దశలో తెగులు లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పూలు కాయలుగా మారవు. పూలలోని ఆకర్షక పత్రాలు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. మొక్కల ఎదుగుదల క్షీణించి, ఎక్కువగా కొమ్మలు ఏర్పడి, ఆకులు, పూతలు అన్నికూడా కొమ్మల చివరి భాగంలో కుచ్చులాగ గుబురుగా కనిపిస్తాయి. పూత, కాత లేకుండా మొక్కలు గొడ్డు బారి పోతాయి.
యాజమాన్యం:
>పంట పొలంలో, గట్ల మీద సూక్ష్మజీవికి అతిథేయిగా పనిచేసే కలుపు మొక్కలున్నట్లయితే వీటిని జాగ్రత్తగా పీకి నాశనం చేయాలి.
> నువ్వు పంటలో రోగ లక్షణాలున్న మొక్కలను ఏరి ఎప్పటి కప్పుడు నాశనం చేయాలి.
> తెగులు వ్యాప్తికి సహకరించే దీపవు పురుగుల నివారణ కోసం అంతర్వాహిక కీటక నాశినులైన ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా అసిటామిప్రిడ్ 0.3 గ్రా. లేదా థయోమిథాక్సామ్ 0.3 గ్రా. చొప్పున
లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
> అవకాశమున్నచోట తెగులును తట్టుకొనే హిమ, చందన, రాజేశ్వరి వంటి రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.పురుగుల యాజమాన్యం సకాలంలో చేసి తెగులు వ్యాప్తి, ఉధృతిలను తగ్గించుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు.
డా.ఎస్.దయాకర్ డా. ఎ.ఎస్.ఆర్. శర్మ, డా.పి. అమ్మాజీ,ఏరువాక కేంద్రం పెద్దాపురం, కాకినాడ జిల్లా