Horticultural Growers: ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి సస్యరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలో అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డా.ఎం.విజయ్ శంకర్ బాబు, డా.జి.నారాయణ స్వామి, డా.జి.డి. ఉమాదేవి ఇలా తెలియజేస్తున్నారు.
- టమాట పంటలో కాల్షియం ధాతు లోప నివారణకు 5 గ్రా.చొప్పున కాల్షియం నైట్రేట్ ఎరువును లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
- బీర వంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్న రైతులు సిఫారసు చేసిన ఎరువులు వేసుకోవాలి. అలాగే వెజిటబుల్ స్పెషల్ ఎరువును 2- 3గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పై పాటుగా పిచికారీ చేయాలి.
- అరటిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకొని అరటి తోటల్లో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. సిఫారసు మేరకు ఎరువులు వేసుకోవాలి.
- చీని, నిమ్మ తోటల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని కలుపు నివారణ చేసుకోవాలి. మోతాదు మేరకు పశువుల ఎరువు, పైపాటుగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి. చీని తోటల్లో కొత్తగా చిగుర్లు వచ్చిన తోటలకు సుక్ష్మధాతు లోప నివారణకు ఫార్ములా 4 లేదా సుక్ష్మధాతువుల మిశ్రమాన్ని లీటరు నీటికి 2.5 నుంచి 3 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
- మామిడి తోటల్లో కొత్తగా చిగుర్లు వచ్చే సమయంలో సుక్ష్మధాతు లోప నివారణకు ఫార్ముల 4 లేదా సుక్ష్మధాతువుల మిశ్రమం లేదా మాంగోస్పెషల్ లీటరు నీటికి 2.5 నుంచి 3 గ్రా.చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
- ప్రస్తుతం మిరప పంట అక్కడక్కడ శాఖీయ దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తామర పురుగులు, పచ్చ పురుగు ఆశించడానికి అనుకూలం. తమర పురుగుల నివారణకు నీలం, పసుపు రంగు జిగురు అట్టలు ఎకరాకు 30-40 వరకు పెట్టుకోవాలి. అలాగే 10000 పి.పి.ఎం.వేప నూనెను ఒక మి.లీ లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పచ్చ పురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ.చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Leave Your Comments