వ్యవసాయం భారతదేశంలో ఎక్కువగా వర్షాధారంగా జరుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని భూములు, లభ్యమయ్యే నీటిని బట్టి పంటలను సాగుచేస్తారు రైతులు. ఇక వరి, చెరకు, కొన్ని రకాలైన కూరగాయల పంటలకు నీరు అధికంగా కావాలి. దీంతో చాలా మంది రైతులు ముఖ్యంగా సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు తమ పంటకు తగిన నీరు కావాలని కోరుకుంటారు.. అయితే వ్యవసాయాన్ని దండగ కాదు.. పండగ చేయాలనీ భావించి శాస్త్రీయ పద్ధతిలో సాగు చేయాలనుకునే కొంతమంది ఆధునిక విజ్ఞానం కలిగిన వారు మాత్రం.. తమకున్న భూమితోనే తక్కువ వనరులతో లక్షలు సంపాదించేలా చర్యలు తీసుకుంటారు. లక్షలను ఆర్జిస్తూ సాటి రైతుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి వారిలో ఒకరు రాజస్థాన్ కు చెందిన శంకర్ జాట్ అనే రైతు ఇతనికి పెద్దగా భూమి లేదు.. అయినప్పటికీ శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయం చేసి లక్షలను ఆర్జిస్తున్నాడు..
రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని సలేరా గ్రామానికి చెందిన శంకర్ జాట్.. అనే రైతు తనకున్న 1.25 ఎకరాల భూమిలో టమాటాలు పండించాడు. మొదట్లో వాటి గురించి పెద్దగా తెలియకపోవడంతో కేవలం 60 వేల రూపాయలు మాత్రమే సంపాదించగలిగాడు. ఆ తర్వాత శాస్త్రీయ పద్ధతులు తెలుసుకుని అదే భూమిలో ఏడాదికి రూ. 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.
శంకర్ .. తాను పంటను పండించడంలో ఆధునిక పద్ధతులను తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇండియన్ అగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ సహాయంతో శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ పొందాడు. దీంతో తనకున్న కొద్ది పొలంలో 1057 టమాటా రకాన్ని వేసి మల్చింగ్, బిందు సేద్యం పద్ధతులను ఉపయోగించాడు. వాటివల్ల టమాటా దిగుబడి అధికంగా ఉంది. అంతేకాదు పేడ, మూత్రం, నీరు, సత్తుబెల్లం ఉపయోగించి జీవామృతాన్ని తయారు చేసి పంటకి ఎరువులుగా ఇచ్చాడు. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో పంటను పండించాడు. మల్చింగ్ విధానం ద్వారా 60 శాతం నీరు ఆదా అవుతుంది. ఈ పద్ధతి వల్ల ప్రతీ రోజూ 20 నిమిషాల పాటు నీరు పంటకు అందిస్తే చాలని తెలుసుకున్న శంకర్.. అదే పద్ధతిని ఫాలో అయ్యాడు. ఇక టమాటా వేయగా మిగిలిన భూమిలో గోధుమ పంటను వేశాడు. దీంతో ఇప్పుడు శంకర్ అదనపు లాభాన్ని కూడా పొందుతున్నాడు. అయితే మొదట్లో తాను వ్యవసాయం చేసే సమయంలో అప్పు కూడా చేశానని ఇప్పుడు కొత్త పద్ధతిలో వ్యవసాయం చేసి ఆ అప్పుని తీర్చడమే కాదు.. లాభాల బాట పెట్టానని తెలిపాడు. తనను చూసి చుట్టుపక్కల వారు కూడా వ్యవసాయ విధానంలో మార్పులు చేస్తున్నారని తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు శంకర్.
ఎకరం పొలంలో శాస్త్రీయ పద్ధతిలో టమాటా సాగు..లక్షలు ఆర్జిస్తున్న రాజస్థాన్ రైతు
Leave Your Comments