వార్తలు

సపోట సాగు.. లాభాల బాట

0

పండ్ల తోటలు సాగుచేసే చిన్న, సన్నకారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో రైతులు పండ్ల తోటల సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. ఉపాధి హామీ, ఎస్సీ కార్పొరేషన్, ఉద్యానవన, మాడా సంస్థల ద్వారా తోటలు సాగుచేసే రైతులకు స్ప్రింక్లర్లు తదితర వాటిని 50 శాతం నుంచి 75 శాతం వరకు సబ్సీడీ పై అందజేయడంతో ఐదారేండ్లుగా బీడు పొలాలు సైతం పండ్లతోటలతో స్వాగతం పలుకుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే పలు రకాల పండ్లతోటల సాగులో కొల్లాపూర్ ప్రాంత రైతులు ఒక అడుగు ముందుకేశారు. ఇక్కడి నేలలు అనువైనవి కావడంతో రైతులు పోటీపడి పండ్లతోటలు సాగు చేస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కోడేరు, పెద్దకొత్తపల్లి, పాన్ గల్, వీపనగండ్ల, కొల్లాపూర్, పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాల రైతులు తమ పొలాల్లో పంటల సాగు వదిలి పండ్లతోటల వైపు దృష్టి మళ్లించారు. బోరుబావుల సౌకర్యం లేని రైతులు ఎంజీకేఎల్ ఐ ప్రాజెక్టు ద్వారా అందే నీటిని తోటలకు పారబెట్టుకుంటున్నారు. నీళ్లు పారని రాళ్లు, గుట్టల ఎగువ భూముల్లో సైతం స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా రైతులు నీళ్లు పారబెడుతున్నారు. ఏటా పండ్లతోటల సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. పండిన కాయల దిగుబడులను కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కర్నూల్, వనపర్తి తదితర పట్టణాల్లో చౌకధరలకు అమ్ముకుంటున్నారు.
కొల్లాపూర్ ప్రాంత భూములు పండ్లతోటల సాగుకు అనుకూలంగా వుండే ఎర్రనేలలు కావడం విశేషం. నీటి వనరులు లేని బీడు పొలాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా సాగుచేసే రైతులకు 70 శాతం సబ్సీడీపై ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.
కొల్లాపూర్ నియోజకవర్గంలో 560 ఎకరాల్లో సపోట సాగు చేశారు. ఈ పంటను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ. స్థానిక ఉద్యానశాఖ అధికారి సపోట సాగులో పండ్లు అధికశక్తిని, కాల్షియం, విటమిన్లను శరీరానికి అందిస్తాయి. జ్వరాల నుంచి కోలుకుంటున్న వారికి పిల్లలకు ఈ పండు మంచి ఆహారం.
సపోట తేమతో కూడిన ఉష్ణమండలపు పంట. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. వర్షాధార పంటగా అనువైనది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పండ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నీరు ఇంకే అన్ని రకాల నేలల్లోనూ ఈ పంట పండుతుంది. తేలిక నేలల్లో త్వరగా ఎదిగి మంచి ఫల సాయాన్నిస్తోంది. ఇసుక భూములు, అధిక చౌడు ఉన్న నేలలు, ఉప్పు నేలలు కూడా నాటడానికి పనికొస్తాయి. నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం ఉండటం వల్ల కొండ ప్రాంతాలు, లోటు తక్కువ నేలల్లో కూడా సాగుకు అనువైనవి. కొల్లాపూర్ ప్రాంతంలో సపోట సాగులో పాలరకం విస్తారంగా ఉన్న రకం అధిక దిగుబడినిస్తున్నది. పండు పరిమాణం చిన్నది. కోలగా ఉండి గుత్తులుగా కాస్తోంది. తోలు పలుచగా కండ మృదువుగా అధిక తీపి కలిగి ఉంటుంది.
జులై నుంచి ఫిబ్రవరి వరకు నాటేందుకు అనుకూలం. ఎంపిక చేసిన అంట్లను 10.0 / 10.0 మీటర్ల దూరంలో ఎకరాకు 40 మొక్కల చొప్పున నాటుకోవాలి. నాటడానికి 1/1/1 మీటర్ల గుంతలను తీసి తవ్విన మట్టికి 30 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సూపర్ ఫాస్ఫెట్, 200 గ్రాములు 2% పెరథియాన్ పొడి మందు కలిపి గుంతల్లో నింపాలి. తొలకరి తోటలను ఇరువైపులా దున్ని చెట్లకు పాదులు చేసి ఎరువులు వేయాలి. ప్రతి చెట్టుకూ మోతాదు ఎరువు చెట్టు చుట్టూ 1.5 మీటర్ల దూరంలో పాదంతా సమంగా వేసి మట్టిలో కలిపి ఎరువులు కరుగుటకు సరిపడేంత తేలికపాటి తడి మాత్రమే ఇవ్వాలి. నీటిని ఎక్కువగా తట్టుకుంటాయి. మొక్కలు నాటిన రెండేండ్ల వరకు వేసవిలో నీటి ఎద్దడి రాకుండా 15 రోజులకొకసారి తడి ఇవ్వాలి. ఎదిగిన చెట్లకు వేసవిలో 30 రోజులకొకసారి తడి ఇవ్వాలి. ప్రతి చెట్టుకూ కాలాన్ని బట్టి 60 – 100 లీటర్ల నీరు ఇవ్వాలి.

Leave Your Comments

ఎకరం పొలంలో శాస్త్రీయ పద్ధతిలో టమాటా సాగు..లక్షలు ఆర్జిస్తున్న రాజస్థాన్ రైతు

Previous article

కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like