వార్తలు

విత్తనం కొనుగోలులో రైతులు తస్మాత్ జాగ్రత్త..

0

ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వరి కంటే కంది, పత్తి పంటలను అధికంగా సాగు చేయాలనే ప్రభుత్వం సూచన మేరకు పత్తి పంట సాగు పెరగనుంది. దాదాపు 75 లక్షల ఎకరాల్లో ఆ పంట సాగయ్యే అవకాశం ఉన్నట్టు సర్కారు అంచనా. అదే మోతాదులో నకిలీ విత్తనాలకు ఆస్కారం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్యాకెట్ల చొప్పున ఎకరాకు 900 గ్రాముల విత్తనాలు అవసరం. దీని ప్రకారం 75 లక్షల ఎకరాల ప్రత్తి సాగుకు కోటి 50 లక్షల ప్యాకెట్లు అవసరమవుతున్నాయి. విత్తన వ్యాపారులు, ఆర్గనైజర్లు, డీలర్లు, మధ్యవర్తులు, కొంత మంది అధికారులు సిండికేట్ గా ఏర్పడి రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తారనే విమర్శలున్నాయి.
రాష్ట్రంలో నాణ్యమైన పత్తి విత్తనాలు 30 లక్షల ప్యాకెట్ల నుంచి 40 లక్షల ప్యాకెట్లు మాత్రమే వస్తున్నాయి. కొన్ని ఏమో రైతులు సొంతంగా తయారు చేసుకోగా, మిగతావి నకిలీ విత్తనాలు మార్కెట్లను ముంచెత్తనున్నాయి. ప్రతి ఏటా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో నకిలీ విత్తనాలతో రైతులు నిండా మునుగుతున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. విత్తన జెర్మినేషన్ ప్రక్రియ చేసేటప్పుడు 75 శాతానికి పైగా మొలకెత్తాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువగా మొలకెత్తితే అవి నకిలీ విత్తనాలుగా పరిగణించాల్సిందేనని నిపుణులు చెప్పారు. కొన్ని గింజలతో నూనె తయారు చేయడం, పశువులకు దాణాగా ఉపయోగించే వాటిని సైతం ఆకర్షణీయమైన ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటితో రైతులు మోసపోతున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్, గద్వాల ప్రాంతంలో పత్తి విత్తన సాగు 40 వేల ఎకరాల్లో పండిస్తారు. 30 వేల మంది రైతులు సాగు చేస్తారు. రైతులకు, కంపెనీలకు మధ్యవర్తులుగా సీడ్ ఆర్గనైజర్ల వ్యవస్థ కీలకంగా పనిచేస్తున్నది. సుమారు 2 వేల కోట్ల విత్తన టర్నోవర్ ఉంటుందని అంచనా. అదేస్థాయిలో నకిలీ విత్తన దందా ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ విత్తనమైతే వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏండ్ల తరబడి పరిశోధనలు చేసి విత్తనాలు తయారు చేస్తారు. వాటిని ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతులకు తక్కువ ధరలకు విక్రయిస్తారు. కానీ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా తయారు చేస్తారు. విత్తన సాగు చేయాలంటే కార్పొరేట్ కంపెనీకి 15 నుంచి 20 ఎకరాల భూమి ఉండాలి. అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ అర్హత కలిగిన విద్యావంతులు ఉండాలి. చివరకు వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆమోదం తెలపాలి. రెండు లేదా మూడేళ్లు ఈ విత్తనాలపై ఎలాంటి ఫిర్యాదు లేకపోతే ఆ తర్వాతనే లైసెన్స్ ఇవ్వాలి. ఇవేవి లేకుండానే కార్పొరేట్ కంపెనీలకు కొంత మంది అధికారులు వత్తాసు పలకడంతో నకిలీ విత్తనాలు రైతులను ముంచెత్తుతున్నాయనే విమర్శలున్నాయి. కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. రైతు నష్టపోతే మాత్రం ఎటువంటి పరిహారం లేకుండా పోతున్నది. రైతులు విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్త.

Leave Your Comments

నువ్వుల సాగుతో అధిక లాభాలు..

Previous article

ఆక్సిజన్ ని అందించే మొక్కలు..

Next article

You may also like