Madhya Pradesh: దేశంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచడానికి సామర్థ్యాన్ని బట్టి అవసరమైన అన్ని నిర్ణయాలను కూడా తీసుకుంటోంది. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్‌లో నేటి నుంచి గోధుమలు, శనగలు, కందులు, ఆవాలు తదితర పంటలను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని రైతులందరూ తమ సమీపంలోని రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని సందర్శించి తమను తాము నమోదు చేసుకోవాలని మరియు తమ పంటల అమ్మకంపై మద్దతు ధరను పొందాలని కోరారు. దీనితో పాటు రైతులు రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ కేంద్రానికి వచ్చినప్పుడు కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను పాటించాలని ముఖ్యమంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ కేంద్రానికి చేరుకునే రైతులు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రైతులకు మద్దతు ధర ప్రయోజనం పొందడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత నెలలో వరి కొనుగోలు తేదీని కూడా పొడిగించింది. రైతుల నుండి ఎమ్మెస్పీ ధరకు వరి కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 29, 2021 నుండి జనవరి 20, 2022 వరకు సమయాన్ని పొడిగించింది. తద్వారా రైతులు మరింత ఎక్కువ పంటలను విక్రయించి వారి ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
రైతుల ఆదాయాన్ని పెంచి, వెనుకబడిన రైతుల ఆర్ధిక పరిస్థితిని మార్చే ప్రయత్నంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి కొనుగోలు చేసింది. జనవరి 13, 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి 37.37 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ 2021-22లో మధ్యప్రదేశ్‌లోని దాదాపు 5.5 లక్షల మంది రైతులు తమ వరిని MSPకి విక్రయించారు.