PJTSAU : ఆచార్య జయశంకర్ వర్శిటీ పాలకమండలి నిర్ణయం
వచ్చే ఏడాది వానాకాలం నుంచి రాష్ట్రంలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో ఐదు నుంచి పదిమంది అభ్యుదయ రైతులకు విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి నిర్ణయించింది. బుధవారం (అక్టోబర్ 30 న) ఉపకులపతి ప్రొఫెసర్ అల్ధాస్ జానయ్య అధ్యక్షతన రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఈ సమావేశం జరిగింది. అనేక కీలకంశాలను ఈ పాలకమండలి సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పాలకమండలి ఆమోదించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి…
1. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా విత్తన విభాగం ఏర్పాటు చేసి దానికి ఒక సంచాలకుడి స్థాయి అధికారిని నియమించి రాష్ట్రంలో ఒక విత్తన నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణలోని ప్రతి రెవిన్యూ గ్రామంలో కనీసం ఐదు నుంచి పది మంది అభ్యుదయ రైతులకు యూనివర్సిటీ రూపొందించిన నాణ్యమైన విత్తనాలను ప్రతి ఏటా సరఫరా చేయాలని పాలకమండలి నిర్ణయించింది. దీనికోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) పథకం నుంచి ప్రత్యేక నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.
2. గత 13 ఏళ్ల నుంచి ఇంచార్జి పాలనతో నడుస్తున్న స్థానాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్న అంశానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.
3. వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఇటీవల భారీగా పెంచిన ప్రత్యేక కోట సీట్లకు.. భారీగా తగ్గించిన ఫీజులకు పాలకమండలి ఆమోదం తెలిపింది.
4. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాధిపతుల పదవీకాలాన్ని మూడేళ్లుగా నిర్ణయిస్తూ… ప్రతీ మూడేళ్లకోసారి రొటేషన్ పద్ధతిన, సీనియార్టీ ఆధారంగా విభాగధిపతులను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఒకసారి విభాగాధిపతిగా నియామకం అయితే పదవీవిరమణ పొందేవరకు ఆ పదవిలో కొనసాగే వారు. దీనివల్ల ఇతర సీనియర్లకు అవకాశం కలగకుండా పోతుందని పాలకమండలి భావించి, దేశంలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలలో మాదిరిగా ఈ రొటేషన్ పద్ధతిలో విభాగ అధిపతులను నియమించాలని నిర్ణయించింది.
5. వివిధ కళాశాలలో అసోసియేట్ డీన్స్ నియామకం, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలలో పరిశోధనా సహాసంచాలకుల (అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్)ను సీనియార్టీ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని, వారి పదవీ కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయిస్తూ.. అలాగే మరో రెండేళ్ల వరకు పొడిగించే వెసులుబాటును కల్పిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా పాలకమండలి ఈ మేరకు నిర్ణయించింది.
6. ఇటీవల యు.జి. సి ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ అనుభవం కలిగిన ప్రముఖ వ్యవసాయ శాస్త్ర నిపుణులను ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ గా ఏడాది కాలపరిమితితో మూడేళ్ల వరకు నియమించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో పేరెన్నిక కలిగిన నిపుణుల నైపుణ్యతను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధనల్లో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
7. గత ఏడెనిమిది సంవత్సరాలుగా విశ్వవిద్యాలయ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లుల చెల్లింపులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు నాలుగు దపాలుగా విడుదల చేయాలని పాలకమండలి నిర్ణయించింది.
8. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉద్యోగులు, పెన్షనర్లకు గత ఐదేళ్ల నుంచి నిలిపివేసిన యూనివర్సిటీ ఆరోగ్య కేంద్ర సేవలను పునరుద్ధరిస్తూ ఉపకులపతి అల్దాస్ జానయ్య ఇటీవల తీసుకున్న నిర్ణయానికి పాలకమండలి ఆమోదముద్ర వేసింది.
9. వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించి 60 సంవత్సరలు పూర్తయిన సందర్భంగా ఈ డిసెంబర్ లో విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది.
Leave Your Comments