Prudhvi Raj Success Story: గుంటూరు జిల్లా లోని కొల్లిపర మండలానికి చెందిన తూములూరు గ్రామం మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది . ఈ గ్రామం 1678 గృహాలు, 6 వేలమంది జనాభా కలిగి ఉంటుంది. క్రీస్తు పూర్వం ఉన్న గ్రామాలలో తూములురు గ్రామం కూడా ఒకటి . “తూములురు “గ్రామం త్రేతాయుగమున మునుల తపోవనం అని పురాణ ప్రాశస్త్యం . ఈ గ్రామం ఒక ప్రాచీన అగ్రహారం . ప్రాచీన గ్రామమని మనం గుర్తించటానికి ఒక ప్రాచీన బౌద్ధ శాసనం కూడా ఉంటుంది . ఈ గ్రామం మిరప పంటకు కూడా ప్రసిద్ది . అయితే ఈ గ్రామ శివారు లో క్రిస్టియన్ పాలెం ఉంది . ఈ క్రిస్టియన్ పాలేనికి చెందిన రైతు పేరే దూసరి పృద్వి రాజు . తండ్రి శామియేలు కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్నారు . వీరిరువురు 2016 న కాకినాడ లో జరిగిన సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ సదస్సుకు హాజరయ్యారు. ఆ సదస్సు లో పాల్గొన్న వక్తలు ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడిన మాటలు వీరిని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. అప్పటి కొల్లిపర మండల వ్యవసాయ అధికారి ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం మీద సంపూర్ణ అవగాహన కల్పించుకొని శాస్త్రీయ వ్యవసాయం పై కూడా అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో శాస్త్రీయ పద్ధతులపై దృష్టి పెట్టి గ్రామంలో కౌలుకు తీసుకున్న ఎకరా ఇరవై సెంట్లభూమి లో ప్రకృతి వ్యవసాయ సాగు చేపట్టారు . ప్రకృతి వ్యవసాయంలో 6 ఏళ్ల అనుభవం కలిగిన పృద్విరాజు ఈ ఏడాది ప్రత్యేకంగా అరటి సాగు చేపట్టారు . 50 సెంట్ల అరటి సాగు కోసం కొన్ని ప్రత్యేకతలు చేపట్టి దానిలో ప్రధానంగా మల్చింగ్ విధానం అవలంబించారు. అంటే భూమిని మినప పొట్టు తో మరియు అరటి ఆకులతో నిరంతరం కప్పి వుంచి సూర్య కిరణాలు భూమిని తాకకుండ చేయడం వలన భూమిలోని పోషకాలు నశించి పోకుండా మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతోంది. అంతేగాక ఆచ్చాదన చేయడం వలన హుమస్ అభివృద్ది చెంది పంట దిగుబడి పై కూడా ప్రభావం చూపుతోంది . దీనికి తోడు బయోడై వర్సిటీక్రాప్స్ ను అనుసరిస్తున్నారు. అరటి , బొప్పాయి ,ముల్లంగి,చెరకు, మరియు వంగ పంటలను ప్రధాన పంటలుగా PMDS పద్ధతిలో ఫిబ్రవరి మొదటి వారం లో ప్రారంభించారు. కనుక ఈ పద్దతిలో భూమిని సాగు చేయడం వలన రైతు కు ఎల్లప్పుడూ ఆదాయం అందుబాటులో ఉంటుంది . కారణం ఏమిటంటే ఒక పంట తరువాత మరొక పంట చేతికి వస్తుంది. కనుక ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది . ఇక పోతే మిగిలిన 25 సెంట్లలో సజ్జా, మరో 25 సెంట్లలో ఆకు కూరలు సాగు చేశారు . అరటి లో వారానికి 10 గెలల చొప్పున దిగుబడి రాగా ఒక్కో గెల 200 రూపాయల ప్రకారం విక్రయిస్తున్నాడు. అదనంగా ఏటీఎం మోడల్ లో నెలకు 10 నుంచి 12 వేల రూపాయల ఆదాయం లభిస్తోంది.ఈ రకంగా వైవిధ్యం కలిగిన పంట విధానంలో కేవలం అంతర పంటల ద్వారా 45 వేల రూపాయల ఆదాయం పొందిన పృథ్వీ రాజ్ ఖరీఫ్ రబీ కలిపి 95 వేల రూపాయలు ఇప్పటి వరకు పొందగలిగాడు. అరటి ద్వారా పంట దిగుబడి పూర్తి అయ్యేనాటికి మరో 90 వేల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నాడు. మొత్తం మీద 9 నెలల కాలంలో 1.20 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 15 వేల రూపాయల ఖర్చుతో దాదాపు రెండు లక్షల రూపాయల ఆదాయం పొందగలిగిన పృథ్వీ రాజ్ ఎంసీఆర్పీ గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి మాస్టర్ ట్రైనర్ గా, మోడల్ మేకర్ గా ఎదిగి ప్రస్తుతం మెంటార్ గా పనిచేస్తున్నాడు. పలు పంటలు వేయడం వలన భూమి గుల్ల బారి వేరు వ్యవస్థ బలంగా ఏర్పడింది. కాబట్టి చేతికి వచ్చే పంట కూడా ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటుంది కనుక రేటు కూడా ఎక్కువ పలుకుతుంది . అంతిమంగా ఈ రైతు చెప్పేది ఏమిటంటే ప్రకృతి వ్యవసాయాన్ని ఒక సైన్స్ లాగా చేయాలని చెప్పుచున్నారు .
Prudhvi Raj Success Story: ప్రకృతి వ్యవసాయంతో సుస్థిర వ్యవసాయం
Leave Your Comments