Profits from the cultivation of foreign dragon fruit!:
డా.ఆదిశంకర, డా. టి. ప్రభాకర్ రెడ్డి, కె.జ్ఞానేశ్వర్ నారాయణ, డా. ఓ.శైల, డా. రామకృష్ణ, ఇ.జ్యోత్స్న, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం
ఇటీవలకాలంలో ఆరోగ్యప్రదాయనిగా, ఆశాజనక దిగుబడులనిచ్చే పంటగా డ్రాగన్ ఫ్రూట్ మంచి ఆదరణ పొందింది. ఈ మొక్క క్యాక్టస్ జాతికి చెందింది. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు. భారతదేశంలో 7500 ఎకరాల్లో సాగవుతోంది. తెలంగాణలో 690 ఎకరాల్లో సాగవుతూ 3188 టన్నుల దిగుబడి వస్తుంది.
మూడు రకాలు…
వృక్షశాస్త్ర పరంగా డ్రాగన్ ఫ్రూట్ మూడు రకాల్లో లభిస్తుంది. ఎరువు చర్మంతో లోపల ఎర్రని గుజ్జు (హైలోసెరియస్ పాలిరైజస్), ఎరుపు చర్మంతో లోపల తెల్లని గుజ్జు (హైలోసెరియస్ అన్ డేటస్), పసుపు చర్మంతో లోపల తెల్లని గుజ్జు (హైలోసెరియస్ మెగాలంథస్).డ్రాగన్ ఫ్రూట్ లో 70 నుంచి 80 శాతం గుజ్జు ఉంటుంది. ఇది మధుమేహం, పెద్దపేగు క్యాన్సర్ ను నివారిస్తుంది. భారీ లోహాల వంటి విష పదార్థాలను తటస్తీకరిస్తుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో విటమన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, పాస్పరస్, కాల్సియం పుష్కలంగా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ను సహజ రంగుల వెలికి తీతలో ఉపయోగిస్తారు.
అనుకూల వాతావరణం:
డ్రాగన్ పండ్లు సనుశీతోష్ణ మండల వాతావరణంలో బాగా పెరుగుతాయి. వీటి సాగుకు సాధారణ ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అనుకూలం. వార్షిక వర్షపాతం సమానంగా ఉండి, 100 -150 సెం.మీ.వర్షపాతం దీనికి సరిపోతుంది. సూర్యరశ్మి కూడా తక్కువగా అవసరం. అధిక వర్షపాతం ఈ మొక్కలకు మంచిది కాదు.మొక్కలు మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల పూత,కాత రాలిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు,అతి తక్కువ వర్షపాతం ఈ పంటకు అనుకూలం కాదు.
నేలలు:
ఈ పండ్ల పెంపకానికి అన్ని రకాల నెలలు అనుకూలం.తెలంగాణ భూములు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనువైనవి. మురుగు నీరు పోయే సౌకర్యం గల ఇసుక నేలలు మంచివి.ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 ఉన్న అధిక సేంద్రియ పదార్థం గల నేలలు మొక్కల పెరుగుదలకు అనుకూలం.
డ్రాగన్ ఫ్రూట్ ప్రవర్ధనం:
ఈ పండును విత్తనాల ద్వారా లేదా కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కానీ బాగా ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి, అధిక దిగుబడులు మాత్రం కత్తిరింపుల ద్వారానే సాధ్యం. 40-45 సెం.మీ పొడవు గల కత్తిరింపులు నాటడానికి అనువైనవి.నాటే 2 రోజుల ముందు కత్తిరింపులు ఎన్నుకొని బంక కారిపోయే వరకు అరబెట్టాలి. ఈ కత్తిరింపులను కాత దశలో ఉన్న మంచి ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి ఎన్నుకోవాలి. కత్తిరింపులను శిలీంద్ర నాశినులతో కలిపి నాటుకుంటే తెగుళ్ళు రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. ఈ కత్తిరింపులను 12 x 30 సెం.మీ.పరిమాణం గల పాలిథీన్ కవర్లలో 1:1: 2 (మట్టి,పశువుల ఎరువు,ఇసుక) మిశ్రమంతో నింపి నాటుకోవాలి.ఇలా కవర్లలో నాటిన కత్తిరింపులు 30 – 40 రోజులలో ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధమవుతాయి.
నాటడం:
మొక్కలు సాధారణంగా వర్షాకాలంలో నాటుతారు. మొక్కలు నాటడానికి ముందు పొలంలో 2 మీ.ఎత్తు ఉన్న సిమెంట్ పోల్స్ నాటి, సిమెంట్ రింగులను దానిపై అమర్చి ఒక వలయం లాగా తయారుచేసుకొని, ఒక పోల్ దగ్గర నాలుగు మొక్కలను నాలుగు వైపులా నాటుకోవాలి.ఈ సిమెంట్ పోల్స్ కు రెండు వరుసల మధ్య ఎటు చూసినా 3 మీటర్ల ఎడం ఉండే విధంగా నాటుకోవాలి. ఈ విధంగా నాటినప్పుడు ఒక ఎకరాకు 445 స్తంభాలు అవసరమవుతాయి.
ఎరువుల యాజమాన్యం:
* మొక్కలు నాటే ముందు గుంతకు 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,500 గ్రా.వేపపిండి వేసి గుంతలు నింపాలి.
* 1- 2 సంత్సరాల వయస్సుగల మొక్కలకు 10 -15 కిలోల పశువుల ఎరువు,300 గ్రా.యూరియా, 333 గ్రా.మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను 4 సమపాళ్ళుగా చేసుకుని 4 సార్లు పోల్ దగ్గర వేసుకోవాలి.
*మూడో సంత్సరం 4 దఫాలుగా ఒక్కో పోల్ కి 1.25 కిలోల యూరియా, 4.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 500 గ్రా.మ్యూరేట్ అఫ్ పోటాష్ చొప్పున వేసుకోవాలి.
రసాయన ఎరువులే గాకుండా పశువుల ఎరువు, కోళ్ల ఎరువు,వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను,సూడోమోనాస్, ట్రైకోడర్మా వంటి జీవన ఎరువులతో కలిపి వేసినట్లయితే మొక్కలు ఆరోగ్యాంగా పెరిగి వ్యాధి నిరోధకతను పెంచుతుంది.
సస్యరక్షణ:
డ్రాగన్ ఫ్రూట్ లో పురుగుల సమస్య ఎక్కువగా ఉండదు. అయితే నీరు ఎక్కువగా పారించినప్పుడు, నీటి తడి అధికమైనప్పుడు కాలర్ రాట్, కాండం కుళ్ళు తెగులు, కాండం మీద మచ్చ తెగులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనిని నివారించడానికి 1 -2 సంత్సరాలలో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ ను తెగులు లక్షణాలు గమనించిన వెంటనే డ్రెంచింగ్ లేదా పిచికారి చేసుకోవాలి. పొలుసు పురుగు లేదా రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొక్కల శిక్షణ (కత్తిరింపులు):
డ్రాగన్ ఫ్రూట్ మొక్క త్వరగా పెరిగి మొదటి దశలోనే కాయలను ఏర్పరచుకునే తత్వం కలిగి ఉంటుంది. పక్క నుంచి వచ్చే కొమ్మల్ని తొలిగిస్తూ ఉండాలి. 2-3 ప్రధాన కాండాలను మాత్రమే స్థంభం మొదలు నుంచి పైన సిమెంట్ రింగ్ వరకు చేరే దాకా భూమి నుంచి ఎటువంటి కొమ్మలు లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు కత్తిరింపులు చేస్తూ ఉంటే గాలి,వెలుతురు బాగా తగిలి చీడపీడలను,తెగుళ్లను రాకుండా నివారించవచ్చు.
పూత,కాత:
వీటి పూలు పెద్దవిగా ఉండి ఆర్ష ణీయమైన రంగులో సువాసన వెదజల్లుతాయి. ఈ పుష్పాలు సాయంత్రం సమయం నుంచి రాత్రి వేళల్లో విచ్చుకుంటాయి. పగటి సమయంలో వికసించవు. పూత సమయం ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసం. ఇది పరపరాగ సంపర్కాన్ని జరుపుకుంటుంది. పూత మొదలై పండుగా ఏర్పడటానికి 15 రోజుల సమయం పడుతుంది. పండ్లు ఏర్పడిన తర్వాత 30- 50 రోజులకు పండ్లు పెరిగి పక్వానికి వస్తాయి. కాత దశ 3-4 నెలల వరకు కొనసాగుతుంది. అంటే డిసెంబర్ వరకు కాపుకొస్తుంది. ఈ మధ్య కాలంలో 3 -4 సార్లు కోతనిస్తుంది. పండ్లు పక్వానికి రాని దశలో ఆకుపచ్చ రంగులో ఉండి, పక్వదశలో ఎరుపు రంగులోకి మారుతాయి. ఎరుపు రంగుకు మారిన 4 రోజులకు కోసుకుంటే మార్కెట్లో అమ్మడానికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు లేదా ఎగుమతికయితే రంగు మారిన మొదటి రోజు పండ్లను కోసి సరఫరా చేసుకోవాలి.
ALSO READ:Oil Palm Cultivation: రోజురోజుకు పెరుగుతున్న ఆయిల్‌పామ్ సాగు.!