కోవిడ్ భయంతో ఆస్పత్రి ల్యాబ్ లో పనిచేస్తున్న యువకుడు ఇంటి దారి పట్టాడు. ఉన్న ఉద్యోగం పోవడంతో ఏం చేయాలో అర్థం కాక వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. ఆధునిక విధానంలో సేద్యం చేయాలని నిర్ణయించుకుని, యూట్యూబ్ లో సెర్చ్ చేసాడు. ఉపాధిలో పూలబాటను ఎంచుకున్నాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన కల్వల శ్రావణ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామానికి చెందిన కల్వల శ్రావణ్ అనే యువకుడు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పటిల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేసేవాడు. అయితే ఏడాది క్రితం కరోనా మహమ్మారి భయానికి ఆ ఉద్యోగం నుండి తీసివేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. తనకున్న వ్యవసాయ భూమిలో అగ్రికల్చర్ చేద్దాం అనుకున్నాడు. కానీ అందరిలా వరి, మొక్కజొన్న పంటలు వేస్తే ఏం లాభం ఉంటుందని డిఫరెంట్ గా ఆలోచించాడు.
నిత్యం డబ్బులు వచ్చే ఏదైనా పంటలు సాగు చేయాలని ఆలోచన చేశాడు. సరైన పంటకోసం యూట్యూబ్ లో సెర్చ్ చేశాడు. అలా.. లిల్లీ పూలు సాగు చేద్దామని డిసైడ్ అయ్యాడు. తనకున్న ఎకరం పొలంలో బెంగుళూరు నుంచి లిల్లీ మొక్కలను తీసుకొచ్చి నాటాడు. 70 వేల రూపాయల పెట్టుబడి అయ్యిందని చెబుతున్నాడు శ్రావణ్. కేవలం మూడు నెలల్లో క్రాప్ వచ్చింది. రోజుకు ఎనిమిది నుండి పది కిలోల లిల్లీ పూలు మార్కెట్లో అమ్ముతున్నారు. కిలోకు వంద నుండి నూటయాభై రూపాయల ధర పలుకుతోంది. సీజన్లో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉండడం తో ఈ లిల్లీ పూల సాగు లాభాలు తెచ్చిపెట్టాయని శ్రావణ్ చెప్పుకొచ్చాడు.
ఆ గ్రామంలో రైతులంతా శ్రావణ్ ను విచిత్రంగా చూస్తున్నారు. వాణిజ్య పంట లిల్లీ సాగు చేసి రోజుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడని ఆశ్చర్యపోతున్నారు. వరి, మొక్కజొన్న మిగతా పంటలు కాకుండా ఇలాంటి పూలతోటలు పెంపకంతో అధిక లాభాలు గడించవచ్చని రైతులు చర్చించుకుంటున్నారు. శ్రావణ్ పరిసర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం కూడా ఇలాంటి పూల సాగు చేసే రైతులకు ప్రోత్సహాన్ని కల్పించి రుణాలు అందిస్తే యువత ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని స్థానిక రైతులు అంటున్నారు. ఏది ఏమైనా కోవిడ్ మహమ్మారి వల్ల ఓ ఉద్యోగం పోయిందనుకుంటే.. మరో మంచి ఆదాయాన్నిచ్చే లిల్లీ సాగు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రావణ్, తన తల్లిదండ్రులు.
లిల్లీ పూల సాగుతో లాభాలు..
Leave Your Comments