తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బాబు జగ్జీవన్ రామ్ కుటుంబం పాత్ర ఎంతో ఉంది…. వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి జానయ్య ..
బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బాబు జగ్జీవన్ రావు కూతురైన మీరా కుమార్ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందేలా చేయడంలో ఆమె చేసిన కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. లోక్సభ స్పీకర్ గా వ్యవహరించిన ఆమె తెలంగాణ చట్ట సవరణ బిల్లు పై చర్చ జరిగి ఆమోదం పొందడంలో అందరిని సమన్వయ పరచి సమయస్ఫూర్తితో వ్యవహరించారని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కేంద్రంలో 32 ఏళ్ల పాటు, ఉప ప్రధానిగా, రక్షణ, వ్యవసాయం, న్యాయశాఖ వంటి అనేక కీలక మంత్రి పదవులు నిర్వహించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అలాగే, ప్రొఫెసర్ ఎన్జీరంగా తర్వాత, 50 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్ గా కొనసాగిన నాయకుడు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గొప్ప పరిపాలన దక్షత కలిగిన నాయకుడని, బంగ్లాదేశ్ ఏర్పాటులోనూ.. శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో హరిత విప్లవం సాధించడంలో ఆయన పోషించిన పాత్ర కీలకమని చెప్పారు. జగ్జీవన్ రామ్ తల్లిదండ్రులు చదువు విలువ తెలిసిన వారనీ కాబట్టే, జగ్జీవన్ రామ్ ను కూడా ఉన్నత చదువులు చదివించారని తెలిపారు. చదువు వల్ల ఆయన అపార జ్ఞానం పొందగలిగారని, ఫలితంగా ఆయన చేపట్టిన అనేక పదవులను విజయవంతంగా నిర్వహించ గలిగారని ఉపకులపతి ఆల్దాస్ జానయ్య కొనియాడారు. రిజిస్ట్రార్ డాక్టర్. జి. ఇ. సిహెచ్. విద్యాసాగర్ తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, బోధన – బోధనేతర సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.