ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Paddy Crop: వరి పంటలో పురుగుల బెడద ఉందా? ఈ నివారణ చర్యలు పాటించండి..

1
Paddy Crop
హిస్పా (తాటాకు తెగులు)

Paddy Crop: వరి పంటను వివిధ రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి.వాటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.వాటిలో కొన్ని ముఖ్యమైన కీటకాలు,వాటి నివారణ గురించి తెలుసుకుందాం.

ఉల్లికోడు:

Paddy Crop

ఉల్లికోడు

నారుమడి దశ నుండిచి పిలక దశ వరకు నష్టపరుస్తుంది. అంకురం ఉల్లికాడ వలె పొడుగాటి గొట్టంగా మారి బయటకు వస్తుంది. కంకి వెయ్యదు. తట్టుకునే వంగడాల సాగుచేయాలి. ఒక సెంటు నారుమడిలో 160 గ్రా. కార్బోఫ్యురాన్ 3 జి. గుళికలు విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజులు లోపల వేయాలి. నాటిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు కార్బోఫ్యురాన్ 3 జి.10 కిలోల గుళికలు వాడాలి.

కాండం తొలిచే పురుగు:

Paddy Crop

కాండం తొలిచే పురుగు

నారుమడి నుంచి ఈనిక దశ వరకు అశిస్తుంది. పిలక దశలో మొవ్వు చనిపోతుంది.ఈనిక దశలో తెల్ల కంకులు వస్తాయి. పిలకలు వేసే దశలో క్లోరిఫైరిఫాస్ 20 ఇసి, 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 ఎస్.పి 1.5 గ్రా. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 యస్.పి. 2.0 గ్రా. లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 20 యస్.సి. 0.3 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరు పొట్ట దశలో ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి 8 కిలోలు లేదా కార్బోప్యూరాన్ 3% జి. గుళికలు 10 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో సమానంగా చల్లాలి.

Also Read: Management of fertilizers in Cashew Crop: జీడీ మామిడిలో దిగుబడులు పెరగాలంటే..ఎరువుల కీలకం

ఆకు ముడత (నాము/ తెల్ల తెగులు):

Paddy Crop

ఆకు ముడత (నాము/ తెల్ల తెగులు)

గొంగళి పురుగు ఆకుముడతలో ఉండి పత్రహరితాన్ని గోకి తినివేయటం వల్ల ఆకులు | తెల్లబడతాయి. పోటాకు దశలో నష్టం ఎక్కువ. పిలకదశలో క్లోరిపైరిఫాస్ 20 ఇ.సి. 2.5 మి.లీ. లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 20 యస్.సి. 0.3 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చిరు పొట్ట దశలో కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి. 2.0 గ్రా. లేదా ఎసిఫేట్ 75 యస్.పి. 1.5గ్రా. లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 20 యస్.సి. 0.3 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

హిస్పా (తాటాకు తెగులు):

Paddy Crop

హిస్పా (తాటాకు తెగులు)

తల్లి పురుగు శరీరంపై ముళ్ళు కలిగి నల్లగా ఉంటాయి. పిల్ల పురుగులు ఆకు పొరల్లో ఉంటాయి. పిల్ల,పెద్ద పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తిని వేయటం వల్ల తెల్లటి మచ్చలు, చారలు ఏర్పడి ఆకులు ఎండి పోతాయి. పిల్ల పురుగులు ఆశించిన ఆకులపై చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు ఆశించిన దగ్గర ఆకు తెల్లబడి గాలికి విరిగి పోవచ్చు.ఆకు కొనలను తుంచి నాటాలి. ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి. 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 20 ఇ.సి. 2.5 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

సుడి దోమ:

Paddy Crop

సుడి దోమ

గోధుమ వర్ణపు / తెల్ల వీపు మచ్చ దోమలు దుబ్బుల అడుగున నీటిమట్టంపై ఉండి దుబ్బుల నుంచి రసాన్ని పీలుస్తాయి.పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది. తట్టుకునే రకాలు సాగు చేయాలి. పొలాన్ని అడపా దడపా అరబెట్టాలి.ప్రతి రెండు మీటర్ల నాట్లకు 20 సెం.మీ. కాలి బాటలు వదలాలి. ఎసిఫేట్ 75 యస్.పి.1.5గ్రా. లేక ఇమిడా క్లోప్రిడ్ + ఎఫిప్రోల్ 80 డబ్ల్యూ జి 0.25 లేదా పైమెట్రోజైన్ 50 డబ్ల్యూ జి. 0.6 గ్రా. లేదా సైనికామిడ్ 50 ఎస్.జి. 0.4గ్రా. లేదా డైనోటెఫ్యురాన్ 20 ఎస్.జి. 0.4 గ్రా. లేదా ట్రైప్లుమిజోపైరిమ్ 10 యస్.సి. 0.48 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దోమ ఉధృతికి దోహదపడే పురుగు మందులైన క్వినాల్ ఫాస్, ప్రొఫెనోఫాస్, మిథైల్ పరాథియాన్, ట్రైజోఫాస్, ఫోరేట్ 10 జి.గుళికలు, సింథటిక్ పైరిత్రాయిడ్ వర్గానికి చెందిన డెల్టామెత్రిన్, సైపర్మెత్రిన్ మొదలగు పురుగు మందులను వాడరాదు.

పచ్చదీపపు పురుగులు:

పెద్ద, పిల్లపురుగులు ఆకుల నుంచి రసం పురుగులు పీల్చుతాయి. క్రమేపి ఆకులు పసుపు రంగుకి మారుతాయి. టుంగ్రో వైరస్ ను వ్యాప్తి చేస్తాయి. పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులో వుండి ముందు రెక్కల మీద మచ్చలు ఉంటాయి. ఎసిఫేట్ 75 యస్.పి. 1.5గ్రా. లేక ఇమిడా క్లోప్రిడ్ + ఎఫిప్రోల్ 80 డబ్భుజి 0.25 లేదా పైమెట్రోజైన్ 50 డబ్ల్యూ జి. 0.6 గ్రా.లేదా సైనికామిడ్ 50 ఎస్.జి. 0.4గ్రా. లేదా డైనోటెఫ్యురాన్ 20 ఎస్.జి. 0.4 గ్రా.లేదా ట్రైప్లుమిజో పైరిమ్ 10 యస్.సి. 0.48 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకునల్లి:

పిల్ల,పెద్దనల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన ఆశించి రసాన్ని పీల్చి వేయడం వల్ల ఆకులు పసుపు రంగుకి మారి క్రమేపి పైరు ఎండిపోయినట్లు కనిపిస్తుంది. బెట్ట పరిస్థితుల్లో పురుగు ఉద్భతి ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే గంధకపు పొడి 50 శాతం 3 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 50 ఇసి. 20 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కంకినల్లి (నల్లకంకి):

ఇవి కంటికి కనబడని సూక్ష్మ సాలీడు వర్గానికి చెందిన పురుగులు. ఇవి ఆశించిన ఆకులపై పసుపు వర్ణపు చారలు ఏర్పడి క్రమేపి ఆకు తొడిమల లోపల, ఆకు ఈనెలపై, ఆకు తొడిమలపై నల్లటిమచ్చలు ఏర్పడతాయి. గింజలపై నల్లటి మచ్చలు ఏర్పడి పాలుపోసుకోక తాలు గింజలుగా అవుతాయి. పురుగు నష్ట లక్షణాలు గుర్తించిన వెంటనే 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రొఫెనోఫాస్ 20 ఇ.సి. 2 మి.లీ./ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదా స్పైరోమెసిఫెన్ 240 ఎస్.సి. 1.0 మి.లీ./ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.దీనిని ఐ.సి.ఏ.ఆర్., ఐ.ఐ.ఆర్.ఆర్.- హైదరాబాద్ వారు సిఫారసు చేశారు.

త్రిప్స్ లేదా తామర పురుగులు:

పిల్ల,పెద్ద పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి చుట్టు కుంటాయి.వర్షాభావ పరిస్థితుల్లో ఇవి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి.ఫిప్రోనిల్ 5 యస్.సి. 2.0 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పిండినల్లి (మట్టసుడి):

తెల్లటి మైనం లాంటి పూతతో కప్పబడిన సన్నని పురుగులు ఆకు ఒరలలో నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పాలిపోతాయి. మొక్కలు గిడసబారతాయి. వెన్నులు ఏర్పడవు. మిథైల్-ఓ-డెమటాన్ 25 ఇ.సి. 2 మి.లీ. లేదా డైమిథోయేట్ 30 ఇసి, 20 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

వేరు నులి పురుగు:

నారుమడి దశలోను, నేరుగా వెదజల్లే పద్ధతిలోను, మెట్ట వరిని ఆశిస్తుంది.నులి పురుగు లార్వాలు వేరులోనికి ప్రవేశించడం వల్ల వేర్లు నీటిని, పోషకాలను సక్రమంగా మొక్కకు అందించలేవు. దీని వల్ల మొక్కలు గిడసబారి, పసుపు రంగుకు మారిపోతాయి. ఇవి ఆశించిన మొక్కల్లో ఎదుగుదల లేక కంకులు, వెన్నులు పరిమాణం తగ్గి, గింజ బరువు తగ్గిపోతుంది. దీని నియంత్రణకు కార్భోప్యురాన్ 3 జి గుళికలు ఎకరానికి 13.2 కిలోలు (ఐ.సి.ఎ. ఆర్-ఐ.ఐ.ఆర్.ఆర్., హైదరాబాద్ వారు సిఫారసు చేసినది) ఇసుకలో కలిపి పొలంలో సమానంగా చల్లాలి.

ఎన్. నాగేంద్ర బాబు, శాస్త్రవేత్త (విస్తరణ)
డా. కె. ఫని కుమార్ , ప్రధాన శాస్త్రవేత్త (కీటక శాస్త్రం)
ఏరువాక కేంద్రం, ఏలూరు జిల్లా

Also Read: Integrated Plant Protection in Chilli Crop: మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ

Leave Your Comments

Management of fertilizers in Cashew Crop: జీడీ మామిడిలో దిగుబడులు పెరగాలంటే..ఎరువుల కీలకం

Previous article

AP Depy CM Pawan Kalyan: గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికే గ్రామసభలు

Next article

You may also like