ఉద్యానశోభచీడపీడల యాజమాన్యంరైతులువార్తలు

Horticultural crops: ముంపునకు గురైన ఉద్యాన పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

0

Horticultural crops: ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఖమ్మం, మహాబూబాబాద్ జిల్లాల్లో ఆపార నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల పొలాల నుంచి వరదనీరు బయటకు వెళ్లని పరిస్థితి నెలకొంది. వర్షాలతో నీట మునిగిన పొలాల్లో వరద నీరు బయటకు పోయిన తర్వాత ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
> పొలాల్లో నిల్వ ఉన్న అదనపు నీటిని బయటకు పంపివేయాలి. లేత తోటల్లో మొక్కలు చనిపోయిన చోట తిరిగి నాటుకోవాలి.
> కొంచెం నేల వాలిన మొక్కలను లేపి మొదళ్ల వద్దకు మట్టి ఎగదోయాలి.
> మొక్కలు తిరిగి బలంగా పెరగడానికి అవసరమైన పోషకాల మోతాదును పెంచాలి.
> వ్యాధికారక శిలీంద్రాలను, చీడలను నివారించడానికి తగిన చర్యలను చేపట్టాలి. దీని కోసం స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.

అరటి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
> ఈదురు గాలులకు విరిగిపోయిన అరటి తోటల్లో గెలలు ఉంటే వాటిని కోసి మార్కెట్ చేసుకోవాలి.
> లేత అరటి తోటలు (5 -7 నెలల వయస్సు) విరిగి పోయినట్లయితే అలాంటి తోటలను శుభ్రం చేసి కొత్త పిలకలను వదిలేయాలి. వదలిన పిలకలకు ప్రతి 25 రోజులకు ఒకసారి మొక్క ఒక్కింటికి 100 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
> 2 లేదా 3 నెలల వయసున్న అరటి మొక్కలు విరిగిపొతే విరిగిన చోట కోసి మరలా మొక్కలను పెంచవచ్చు. అరటి దుంపలు కుళ్లిపోకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపి లేదా బోర్డ్ మిశ్రమం 1 శాతం దుంప చుట్టూ తడిచేలా నెలలో పోయాలి.

నీటిలో మునిగిన అరటితోటలో యాజమాన్యం:
> 3 నెలల కన్నా తక్కువ వయస్సు ఉన్న మొక్కలు 3 అడుగుల లోతు నీటిలో మునిగిపోతే నేల ఆరిన వెంటనే మరలా మొక్కలను నాటుకోవాలి.
> ఆకులు, గెలలపై 0.5 శాతం 13-0-45 (నీటిలో కరిగి ఎరువు- మల్టీ-కె) వారం రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారి చేయాలి.
> సగం తయారైన గెల (75% లోపు పక్వానికి వచ్చిన గెల) లను ఎండిన అరటి ఆకులతో కప్పి ఉంచి 15 రోజుల లోపు కోసి మార్కెట్ చేసుకోవాలి.

కూరగాయల పంటల్లో జాగ్రత్తలు:
> పడిపోయిన కూరగాయల మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదలు దగ్గరగా మట్టిని ఎగదోయాలి.
> మొక్క సరిపోయినంత ఆకులు, కొమ్మలతో ఉంటే 2 శాతం యూరియా ద్రావణాన్ని వారం వ్యవధిలో 2 -3 సార్లు మొక్క తడిచేటట్లు పిచికారి చేయాలి.
> కూరగాయ పంటలు కొత్తగా నాటి అవి పూర్తిగా మునిగిపోయి ఉంటే వాటిని తీసివేసి మరలా నాటుకోవాలి.
> నీట మునిగి తేరుకున్న పంటకు ఆకుమచ్చ, కాయకుళ్లు, బూజు తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 2.5 గ్రా. సాఫ్ మందును కలిపి రెండుసార్లు పిచికారి చేయాలి.
> వేరుకుళ్లు ఆశించిన తోటల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30గ్రా. లేదా కార్బండిజమ్ 10 గ్రా. చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి.

పసుపు పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
> వర్షాలు ఆగి, పొలం నుంచి నీరు బయటకు పోయిన తర్వాత వెంటనే పసుపు పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2, 3 సార్లు పిచికారి చేయాలి.
> పంటలో ఇనుప ధాతులోపం ఏర్పడి లేత ఆకులు పాలిపోయినట్లు కనబడితే 10 లీటర్ల నీటిలో 50గ్రా. అన్నదేది, ఒక నిమ్మ చెక్క రసం, జిగురు మందుతో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
> నేల అదునుకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతుంది. పైపాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ తో పాటు 200 కిలోల వేపపిండి వేయాలి. ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా లీటరు నీటికి 1 మి.లీ.చొప్పున ప్రోపికోనజోల్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి.
> దుంపకుళ్లు తెగులు ఆశించినట్లు గుర్తిస్తే పాదుల్లో మొక్కల చుట్టూ నేలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.చొప్పున లీటరు నీటికి కలిపిన ద్రావణంతో తడపాలి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే లీటరు నీటికి 2.5గ్రా. రిడోమిల్ మందు కలిపిన ద్రావణంతో తడపాలి.

మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
> ఉరకెత్తిన పొలాల్లో మొక్కలు వెంటనే తేరుకోవడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 10 గ్రాముల పంచదార కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
> మొక్కలు తలలు వాల్చినట్లయితే లీటరు నీటికి 5గ్రా. మెగ్నీషియం సల్ఫేటు కలిపిన ద్రావణం పిచికారి చేయాలి. ఇనుప ధాతులోపంతో మొక్కలు పాలిపోయినట్లు కనిపిస్తే 10 లీటర్ల నీటికి 50 గ్రాముల అన్నభేదితో పాటు ఒక నిమ్మ చెక్కరసం కలిపి పిచికారి చేయాలి.
> కాపుతో ఉండి, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదళ్ళ చుట్టూ మట్టిని ఎగదోయాలి. పైపాటుగా ఎకరానికి అదనంగా 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్, 200 కిలోల వేపపిండి వేయాలి.
> పంటను బాక్టీరియా ఆకుమచ్చ, కానోఫోరా వంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 1 గ్రాము స్టెప్టోసైక్లిస్ మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి.
> వేరుకుళ్లు ఆశించిన చేలలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు లేదా కార్బండిజమ్ 10 గ్రాముల చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.
> కాయకుళ్లు, కొమ్మ ఎండు తెగులు వ్యాప్తి చెందకుండా ఒక మి.లీ. ప్రోపికోనజోల్ లేదా 0.5 మి.లీ. డైఫెన్ కోనజోల్ లేదా 2.5గ్రా. కాపర్ హైడ్రాక్సైడ్ లేదా 2.5గ్రా. సాఫ్ మందులను లీటరు నీటికి కలిపి, మందులను ఒకటి మార్చి ఒకటి వారం రోజుల వ్యవధిలో 2, 3 సార్లు పిచికారి చేయాలి. గొంగళి పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా అసిఫేట్ 1.5 గ్రా. లేదా నొవాల్యురాన్ 0.75 మి.లీ. వంటి కీటక నాశిని మందులను పిచికారి చేయాలి.

పూల తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
> మొక్కలపై 2 శాతం యూరియా లేదా 1 శాతం 13-0-45 (నీటిలో కరిగే ఎరువు- మల్టీ-కె ) ను వారం రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారి చేయాలి.
> ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ.చొప్పున లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 1,2 సార్లు పిచికారి చేయాలి.
> కోతకు సిద్ధంగా ఉన్న పూలను వీలైనంత త్వరగా కోసుకోవాలి. పూలను కోసిన తరువాత, మార్కెట్ కు పంపేలోపు వాటిని తాత్కాలికంగా బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో నిల్వచేయాలి. వీలైనంత త్వరగా పూలను మార్కెట్ కు పంపాలి.

–ఎం.డి. సాదిక్ పాషా, డా. జె. చీనా, డా.ఎస్. మల్లేష్, కె. నాగరాజు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం,డా.ఎ. నిర్మల, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం

Leave Your Comments

Minister Atchannaidu: రైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తాం – రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Previous article

Rain floods: వరిలో ఉధృతమవుతున్న చీడపీడలపై అప్రమత్తత అవసరం ..పి.జె.టి.ఎస్.ఏ.యు. పరిశోధన సంచాలకులు డా. పి. రఘురామి రెడ్డి

Next article

You may also like