తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని సమకూర్చే పండ్లు, కూరగాయ పంటల సాగుపట్ల రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఉద్యానశాఖ అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి . ఇందులో ప్రధానంగా పండ్ల తోటలు 4.4 లక్షల ఎకరాలు, సుగంధ ద్రవ్యాలకు చెందిన పంటల సాగు 3.9 లక్షల ఎకరాలు, పూల తోటలు 0.113 ఎకరాలు, నర్సరీ తోటలు 0.453 ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతినిత్యం అవసరమయ్యే కూరగాయ పంటల సాగు 3.5 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును పెంచి తెలంగాణను హార్టీకల్చర్ హబ్ గా మార్చాలని ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యాలను నిర్ధేశించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల కిందట నిర్వహించిన సమావేశంలో ఉద్యాన పంటలసాగును పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. సిఎం ఆదేశాల మేరకు అధికారులు అన్ని జిల్లాల్లో అధ్యయనం నిర్వహించి నేల స్వభావం, నీటి వనరుల లభ్యత, వాతావరణ పరిస్థితులు, తదితర అంశాల ప్రాతిపదికన ఉద్యాన పంటల సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంకూడా జాతీయ స్థాయిలో పంటల సాగు వర్గీకరణ పథకం అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సహం అందించనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు రకాల ఉద్యాన పంటలను ఎంపిక చేసింది. వీటిలో మిరప, మామిడి, కమలా పండ్లతోటల సాగుతోపాటు కూరగాయల సాగుకు జగిత్యాల, మంచిర్యాల, నగర్ కర్నూల్ జిల్లాను ఎంపిక చేసింది. కమలా పండ్ల తోటల సాగుకు నల్లగొండ జిల్లాను ఎంపిక చేసింది. మిరప సాగుకు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలను ఎంపిక చేసింది. కూరగాయల సాగుకు సంబంధించి రాజధాని హైదరాబాద్ కు సమీపాన ఉన్న రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాలను ఎంపిక చేసింది.
రాష్ట్ర జనాభాకు అవసరమైన కూరగాయలను రాష్ట్రంలో నుంచే ఉత్పత్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గించి రాష్ట్రంలోనే వీటి ఉత్పత్తులు పెంచటం ద్వారా ధరలను కూడా నియంత్రించవచ్చని భావిస్తోంది. ఉద్యాన శాఖతో మార్కెటింగ్ శాఖను అనుసంధానం చేసి తద్వారా ఇటు కూరగాయలు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలతోపాటు వినియోగదారులకు కూడా సరసమైన ధరల్లో కూరగాయలు అందేలా సమన్వయం చేస్తున్నారు. కూరగాయలు పండించే రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించారు. సబ్సీడీ పై విత్తనాలు, నర్సరీల ద్వారా మొక్కలు అందించనున్నారు. డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా కూరగాయల సాగుకు ప్రోత్సహం అందచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సీడీ అందిస్తున్నారు. వేసవి తీవ్రతను తట్టుకునే విధంగా పందిళ్ల ఏర్పాటుకు కూడా ప్రోత్సహాలు ఇస్తున్నారు. ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకూ డ్రిప్ విధానం అమలుకు రాయితీలు, గ్రీన్ హౌస్ ఏర్పాటుకు సబ్సీడీలను ఇచ్చి ప్రోత్సహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలసాగు ప్రణాళికలు సిద్ధం..
Leave Your Comments