ఆంధ్రప్రదేశ్తెలంగాణరైతులువార్తలు

Precautions To Be Taken For Crops In Heavy Rains: భారీ వర్షాలకు వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

1
Precautions To Be Taken For Crops In Heavy Rains
Heavy Rains In Crops

Precautions To Be Taken For Crops In Heavy Rains: పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న అల్పపీడనం ప్రారంభంలోనే అల్పపీడనంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఆగస్టు 29 నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగాయి. గత నాలుగు రోజులలో ఎక్కువగా యన్.టి.ఆర్ జిల్లాలో 335.2 మి.మీ, గుంటూరు జిల్లాలో 255.6 మి.మీ, కృష్ణా జిల్లాలో 246.7 మి.మీ, పల్నాడు జిల్లాలో 189.7 మి.మీ, బాపట్ల జిల్లాలో 177.3 మి.మీ. వర్షపాతం కురిసినది. దీని వలన బరువైన నల్లరేగడి నేలల్లో సాగు చేసే వరి, ప్రత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము మరియు తేలికపాటి ఎర్ర నేలల్లో సాగు చేసే వేరుశనగ పంటల్లో నీరు నిలవడం జరిగిoది. అధిక తేమ శాతం వలన పూత, కాత రాలటం, పంట పెరుగుదల కుంటు పడడంతో పాటు దిగుబడులు తగ్గి, పంట నాణ్యత కూడ లోపిస్తుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వివిధ పంటల్లో రైతాంగం ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులను ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్. పాలడుగు వెంకట సత్యనారాయణ గారు వివరించారు.

Precautions To Be Taken For Crops In Heavy Rains

Heavy Rains In Crops

వరిలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పరిశీలనలు :

• వరి పంట ప్రస్తుతం నాట్లు వేసిన 20 – 40 రోజుల దశలో ఉన్నది.
• ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు కృష్ణ, గుంటూరు, బాపట్ల మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో 1.1 లక్షల హెక్టార్లలో పంట ముంపుకు గురైంది.
• ఈ జిల్లాలలో రైతులు ఎం.టి.యు 1318, ఎం.టి.యు 1061, ఎం.టి.యు 1062 మరియు బి.పి.టి 5204 రకాలను ఎక్కువగా సాగుచేశారు.
• ఎం.టి.యు 1318 రకం సుమారు 5 – 6 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది.
• ఎం.టి.యు 1061 రకం కూడా 6 – 7 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది.
• బి.పి.టి 5204 మరియు ఇతర రకాలు 3 – 4 రోజుల వరకు ముంపును తట్టుకుంటాయి.
• ముంపుకు కొద్ది రోజుల ముందు ఎరువులు వేసిన వరి పొలాలలో నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది.
• 3 – 4 రోజుల వరకు మాత్రమే నీట మునిగిన పొలాలలో నష్ట తీవ్రత తక్కువగా ఉంటుంది.
• ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వరిచేలలో వరద నీరు బయటకు బయటకు పోవుచున్నది.

సూచనలు :

• నీట మునిగిన పొలాలు త్వరగా పుంజుకోవడానికి 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా + 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. తరువాత లీటరు నీటికి 2 గ్రా. కార్బెండిజం + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.
• పిలకలు కట్టే దశలో నీరు బయటకు తీసిన వెంటనే ఎకరాకు 20 కిలోల యూరియా + 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయడం వల్ల పంట త్వరగా పుంజుకుంటుంది మరియు నష్టం చాలా వరకు తగ్గుతుంది.
• ఈ వాతావరణం లో ఆశించే తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్బెండిజం లేక 2 గ్రా. కార్బెండిజం + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి. డ్రోన్ లను ఉపయోగించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం లో పిచికారీ చేసే అవకాశం ఉన్నది.

ప్రత్తి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పరిశీలనలు :

• ఆగస్టు 30న ప్రారంభమైన ఇటీవలి వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రధాన జిల్లాలు: NTR జిల్లా, కర్నూలు, పల్నాడు మరియు గుంటూరులో 1 సెప్టెంబర్ 2024 నాటికి, సుమారు 21,405 హెక్టార్లలో పత్తి పంటలు ముంపునకు గురయ్యాయి.
• కర్నూల్ మరియు పల్నాడు జిల్లాలలో, పత్తి పంట ప్రస్తుతం 45 నుండి 90 రోజుల వయస్సు వరకు గూడ (పూత) మరియు పిందె దశలో ఉంది. ఈ పంటను తేలికపాటి నుండి మధ్యస్థ నల్ల నేలల్లో పండిస్తారు. ఇది ఈ దశలలో 3 నుండి 4 రోజుల వరకు ముంపును తట్టుకోగలదు.
• గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలలో, పత్తి పంట 45 మరియు 55 రోజుల మధ్య వయస్సు గలదు. పంట ఏపుగా పెరిగే దశ (శాఖీయ దశ) నుండి గూడ (పూత) దశలో ఉంది. ఇక్కడ, మధ్యస్థ మరియు భారీ నల్ల నేలల్లో పంటను సాగు చేస్తారు, ఇది 2 నుండి 3 రోజుల వరకు ముంపును తట్టుకోగలదు.
• రానున్న రోజుల్లో వర్షాలు కురవకపోతే వరద నీరు తగ్గే అవకాశం ఉంది.

సూచనలు :

ప్రస్తుతం ఉన్న పంట దశ ఆధారంగా, కింది సూచించిన శాస్త్ర సిఫార్సులను అమలు చేయాలి.
1. పంట నుండి నిలబడి ఉన్న అదనపు నీటిని తీసివేయాలి.
2. ఎండగా వున్న సమయంలో 1-2% పొటాషియం నైట్రేట్ (KNO₃) ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
3. అనుకూల పరిస్థితులు పునరుద్ధరించబడిన తర్వాత, పూత మరియు పిందె దశలో వున్న పంటకు ఎకరాకు 25-30 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (MoP) కలిగిన ఎరువులను బూస్టర్ మోతాదులో పై పాటుగా వేయాలి.
4. ముందు జాగ్రత్త చర్యగా, 90 రోజుల పంటలో కాయ తెగులును నివారించడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ (COC) 600 గ్రా/ఎకరానికి పిచికారీ చేయాలి. ఏపుగా పెరిగే దశలో (45 రోజుల వయస్సు ఉన్న పంటకు), ఆకుల మీద వచ్చే మచ్చ తెగుళ్ళను నివారించడానికి కార్బెండజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని 2.5 గ్రా/లీ పిచికారీ చేయాలి.

మినుము మరియు పెసర పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పరిశీలనలు :

• మినుము మరియు పెసర పంటలు ఏపుగా పెరిగే దశ నుండి కాయ పరిపక్వ దశలలో ఉన్నాయి.
• ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నీటమునిగింది.

సూచనలు :

పంట ఏపుగా పెరిగే దశ (శాఖీయ దశ):

1. ప్రభావిత పొలాల్లో అధికంగా నిలిచిపోయిన నీటిని బయటకు తీయాలి.
2. ఇనుము లోపాన్ని సరిచేయడానికి మరియు సమర్థవంతంగా పంట కోలుకోవడానికి ఫెర్రస్ సల్ఫేట్ @ 5.0 గ్రా + సిట్రిక్ యాసిడ్ @ 0.5 గ్రా మరియు యూరియా @ 20 గ్రా లీటరుకు పిచికారీ చేయాలి.
3. ఒక వారం తర్వాత, 1% 19:19:19 లేదా 1-2% పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలి.
4. వేరుకుళ్లు తెగులు మరియు ఆకుమచ్చ వ్యాధులను నివారించడానికి హెక్సాకోనజోల్ 2 మి.లీ లేదా ప్రొపికోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
5. మరుకా కాయ తొలుచు పురుగు నివారణకు వర్షం కురిసిన వారం తర్వాత క్లోర్‌పైరిఫాస్ @ 2.5 మి.లీ/లీ లేదా నోవాల్యూరాన్ @ 1 మి.లీ/లీ నీటికి పిచికారీ చేయాలి.

కాయ ఏర్పడే దశ నుంచి పరిపక్వ దశ:

1. ప్రభావిత పొలాల్లో అధికంగా నిలిచిపోయిన నీటిని బయటకు తీయాలి.
2. వేరుకుళ్లు తెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్లను నివారించడానికి హెక్సాకోనజోల్ 2 మి.లీ లేదా ప్రొపికోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
3. మారుకా కాయ తొలుచు పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ @ 2.5 మి.లీ/లీ లేదా నోవాల్యూరాన్ @ 1 మి.లీ/లీ నీటికి పిచికారీ చేయాలి.

కంది పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పరిశీలనలు :

• ప్రధానంగా కంది పంట పండించే ప్రాతాలలో ఎక్కువగా 30-50 రోజుల దశలో ఉంది.
• ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాల్లో పంట నీటి ముంపుగు గురైంది.

సూచనలు :

1. ప్రభావిత ప్రాంతాలలో పొలాల్లో అధికంగా నిలిచిపోయిన నీటిని బయటకు తీయాలి.
2. ఇనుము లోపాన్ని సరిచేయడానికి మరియు సమర్థవంతంగా పంట కోలుకోవడానికి ఫెర్రస్ సల్ఫేట్ @ 5.0 గ్రా + సిట్రిక్ యాసిడ్ @ 0.5 గ్రా లీటరుకు పిచికారీ చేయాలి.
3. ఎక్కువగా ముంపునకు గురైన పొలాల్లో నీరు తగ్గిన వెంటనే 20 కిలోల యూరియా/ఎకరానికి బూస్టర్ మోతాదులో వేయడం వల్ల పంట ఎదుగుదల పుంజుకుని నష్టాన్ని తగ్గించవచ్చు.

వేరుశనగ లో తీసుకోవలసిన జాగ్రత్తలు

పరిశీలనలు :

• వేరుశెనగ పంట ఏపుగా పెరిగే దశ(40 రోజులు) నుండి కోత దశ వరకు (100 రోజులు) వుంది.
• ఎక్కువ వేరుశనగ విస్తీర్ణం వున్న ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలు మరియు నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో ప్రస్తుత వర్షాలు పంటలకు ప్రయోజనకరంగా ఉన్నాయి.
• ప్రధానమైన రకాలు TAG 24, K1812, TCGS 1694 మరియు కొన్ని గుజరాత్ రకాలు సాగులో వున్నాయి.
• కోస్తా జిల్లాలలో, బరువైన నేలల్లో పండే పంటలు ఏపుగా పెరిగే దశలో 2-3 రోజుల పాటు నీటి ముంపును తట్టుకోగలవు. తేలికపాటి నేలల్లో సాగు చేసిన పంటలకు ప్రస్తుత వర్షాల వల్ల

Also Read:Pest Control In Papaya Cultivation: బొప్పాయిలో పిండినల్లి నివారించే పద్ధతులు
ప్రతికూల ప్రభావం పడలేదు.

సూచనలు :

1. సాధ్యమైన చోట పొలాల నుండి అదనపు నీటిని వెంటనే తీసివేయాలి.
2. ఆకుమచ్చ తెగుళ్లను నియంత్రించడానికి టెబుకోనజోల్ (200 మి.లీ/ ఎకరాకు) లేదా హెక్సాకొనజోల్ 400 మి.లీ/ ఎకరాకు పిచికారీ చేయండి.
3. ఐరన్ లోపాన్ని సరిచేయడానికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా/లీ తో పాటు సిట్రిక్ యాసిడ్ 1 గ్రా/లీ పిచికారీ చేయాలి.
4. పంట కోతకు సిద్ధంగా ఉన్న చోట వర్షాలు ఆగే వరకు పంట కోత ఆలస్యం చేయాలి

మొక్కజొన్న పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పరిశీలనలు :

• మొక్కజొన్న పంట 50 నుండి 90 రోజుల దశలో ఉన్నది అంటే శాఖీయ, పూత, గింజ గట్టిపడు దశలలో ఉన్నది.
• ప్రస్తుతం కురుస్తున్న తుపాను వర్షాల కారణంగా గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నం, గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పంట ముంపునకు గురి అయింది.
• ప్రస్తుత సమాచారం ప్రకారం 48 గంటల్లో పొలాల్లో నిలిచిన నీరు బయటకు పోవడానికి అవకాశం ఉంది.
• రెండు రోజులకు మించి పొలాల్లో నీరు నిలిస్తే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
• మొక్కజొన్న పంట పుష్పించే దశలో ఉండి రెండు రోజుల పాటు నిరంతరాయంగా వర్షాలు కురిస్తే దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
• వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం, కొన్ని ప్రాంతాలలో (ఆంధ్రప్రదేశ్‌లోని అత్యల్ప వర్షపాత మరియు దక్షిణ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలు), మొక్కజొన్న పెరుగుదలకు తేలికపాటి వర్షము ప్రయోజనకరంగా ఉంది.

సూచనలు :

• ఎట్టిపరిస్థితుల్లోనూ 48 గంటల్లో పొలంలో నిలిచిపోయిన నీటిని తీసివేయాలి.
• ఎక్కువ కాలం పంట నీట మునిగితే దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
• నిలిచిన నీటిని తీసివేసిన తర్వాత, పంటపై 2% యూరియా (10 కిలోలు/హెక్టార్) లేదా 1% పొటాషియం నైట్రేట్ (5 కిలోలు/హెక్టారు) పిచికారీ చేయడం వల్ల పంట త్వరగా కోలుకుంటుంది.
• నీటి ముంపు మరియు వాతావరణంలో అధిక తేమ కారణంగా వ్యాధులు (కాండం/వేరు తెగులు, గింజ బూజు తెగులు) రావడానికి అవకాశం ఉంది. కార్బెండజిమ్ @ 2-3 గ్రాములు లేదా మెటాలాక్సిల్ 35% WS @ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
• వీలు మరియు అవకాశాన్ని బట్టి, డ్రోన్ల సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయడానికి వినియోగించవచ్చు.

డా. పాలడుగు వెంకట సత్యనారాయణ
పరిశోధనా సంచాలకులు
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, లామ్, గుంటూరు

Leave Your Comments

Vannuramma Success Story: ఒంటరి మహిళ – అత్యున్నత గౌరవ వందనం

Previous article

PJTSAU Press Note: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పత్రిక ప్రకటన

Next article

You may also like