ఆంధ్రప్రదేశ్తెలంగాణవార్తలు

PJTSAU: భారీ వర్షాల నేపథ్యంలో వివిధ పంటల సంరక్షణ-సూచనలు

2

PJTSAU: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పరిశోధన సంచాలకులు డా.పి.రఘురామి రెడ్డి సెప్టెంబర్ 6 న ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆహార ధాన్యాలు, నూనె గింజలు, అపరాలు తదితర పంటలకు సంబంధించి రైతాంగానికి ఆయన అనేక సూచనలు, మెలకువలు సూచించారు.

ఇప్పుడు వరి నాట్లు వద్దు..

PJTSAU

వరి

గడిచిన వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు122 నుంచి 432 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీనివల్ల పంట పొలాల్లో నీరు నిలవడం వల్ల చాలా ప్రాంతాల్లో వివిధ పంటల్లో మొక్కలు వడలిపోవడం జరిగింది. అదేవిధంగా గాలిలో తేమ శాతం 79 నుంచి 98 శాతం ఉండడం వల్ల వివిధ పంటల్లో తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది.

వరి పంట నాటే పద్ధతిలో సాగు చేయటానికి జూలై చివరి వారం,ఎద పద్ధతిలో సాగుకు ఆగస్టు చివరి వారం వరకు అనుకూల సమయం. రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట దుబ్బు చేసే / కట్టే దశ నుంచి అంకురం /చిరుపోట్ట దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముందుస్తుగా నాట్లు వేసిన జిల్లాల్లో వరి పంట పూత దశలో ఉంది.సెప్టెంబర్ మాసంలో వరి పంటను నాటే పద్ధతిలో గానీ, ఎద పద్ధతిలో గానీ సాగు చేయరాదు. ఒకవేళ సాగు చేస్తే పంటపూతదశకు చేరుకునే సమయానికి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల పూత సరిగా రాకపోవడం, కంకులు వెన్నులో నుంచి బయటకు రాకపోవడం వంటి కారణాల వల్ల అతి తక్కువ దిగుబడులు నమోదయి రైతుకు నష్టం కలగజేస్తుంది. కావున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మాసంలో వరి పంటను సాగు చేయరాదు. వరి పంటకు ప్రత్యామ్నయంగా దిగువ తెలిపిన ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజల పంటలను సాగు చేసుకోవాలి.
ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత నేల తయారు చేసుకొని మొక్కజొన్న, సజ్జలు, పశుగ్రాస జొన్న, మాఘీ జొన్న, రాగులు మొదలగు పంటలను సెప్టెంబర్ మాసంలో విత్తుకోవడానికి అనువైన సమయం.

అపరాలు: పెసర, మినుము, ఉలవల వంటి పంటలను విత్తుకోవచ్చు.

నూనె గింజలు: వేరుశనగ, పోద్దుతిరుగుడు, ఆముదం మొదలగు నూనె గింజ పంటలను వేసుకోవచ్చు.
అక్టోబర్ – నవంబర్ మాసం నుంచి సాధారణంగా సాగు చేసే యాసంగి పంటలను బోదే సాళ్ల పద్ధతి లేదా ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేయడం వల్ల నేలలోని తేమను సంరక్షించుకోవడమే కాకుండా అకాల వర్షాల వల్ల పొలంలో నీరు నిలవకుండా బయటకు తీసివేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సూచించిన యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులను పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున అధిక వర్షాల వలన వివిధ పంటల్లో కొన్ని రకాల చీడపీడల ఉదృతి అధికంగా ఉండే అవకాశం ఉంది.

వరిలో :

వరి పంట అంకురదశకు చేరని పొలాల్లో పైపాటుగా నత్రజని, పొటాషియం ఎరువులను వేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంటలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంది.
* బ్యాక్టీరియా ఎండాకు తెగులు వ్యాప్తిని నివారించడానికి కాపర్ హైడ్రాక్సైడ్ 400 గ్రా. + స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 60 గ్రా. ఒక ఎకరానికి పిచికారి చేయాలి. అలాగే తెగులు లక్షణాలు తొలిదశలో గుర్తిస్తే నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా ఆపాలి. ఆఖరి దపాగా పోటాష్ ఎరువును వేయాలి. అలాగే కాపర్ శిలింద్రనాశినులను పూత దశలో ఉన్న వరి పంటలో పిచికారి చేయరాదు.
* ప్రస్తుతం వరి పంటలో రాష్ట్రవ్యాప్తంగా అధిక గాలులు వీయడం, వర్షాలు పడడం వల్ల పంట పసుపు రంగుకు మారడం, కొనల నుంచి తెల్లటి చారలు ఏర్పడడం క్షేత్రస్థాయిలో గమనించడమైనది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు తగ్గిన తర్వాత పై పాటుగా ఎరువులను వేసినట్లయితే వరి పంట ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది.

పత్తిలో :

PJTSAU

పత్తి

* పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా కాలువలు చేసి బయటకు తీయాలి. నీరు నిల్వ ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది.
* పంట విత్తిన తర్వాత 60, 80 రోజుల పైరుకు పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం రసాయనిక ఎరువులను వేయాలి.
* పూత, పిందే, కాయలు రాలటం నివారించేందుకు 10 గ్రా. 13-0-45 మందు చొప్పున లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేయాలి.
* అధిక వర్షాల వల్ల ఎండు తెగులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ తెగులు వ్యాప్తిని నివారించడానికి 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ చొప్పున లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ వద్ద పంపు నాజిల్ తీసి తెగులు ఆశించిన మొక్కలతో పాటుగా ఆరోగ్యంగా ఉన్న చుట్టుపక్కలున్న మొక్కల మొదళ్ళ వద్ద పోయాలి.
* పత్తిలో ఆకు మచ్చ తెగుళ్ళ నివారణకు 2.5 గ్రా. కార్బండాజిమ్ + మాంకోజెబ్ మందు చొప్పున లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. కాయకుళ్ళు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.,
* ఎర్ర బొంగు రోగం (ఆల్టర్నేరియా లీఫ్ మరియు స్టెమ్ బ్లైట్) తెగులు నివారణకు 3 గ్రా. పైరాక్లోస్ట్రోబిన్ మరియు మెటీరామ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి నివారించాలి.
* సుమారు ఒక నాలుగు గంటల పాటు వర్షాలు లేకుండా ఒరుపు ఇచ్చినప్పుడు పురుగు మందులు పిచికారి చేయాలి.

మొక్కజొన్నలో:

PJTSAU

మొక్కజొన్న

* అధిక వర్షాల వల్ల పంటలో నీరు నిల్వకుండా కాలువల ద్వారా బయటకు తీయాలి.
అధిక వర్షాల వల్ల 40 – 60 రోజుల వయసుగల పంటలో బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పొడిని ఎకరాకు 4 కిలోల చొప్పున పంట పుష్పించే ముందు సాళ్ళలో వెదజల్లాలి

సోయా చిక్కుడులో:

PJTSAU

సోయా చిక్కుడు

* సోయా చిక్కుడు పంట ఎక్కువ శాతం కాయలు ఏర్పడే దశలో ఉంది. అధిక వర్షాల వల్ల పంటలో నీరు నిల్వకుండా కాలువల ద్వారా బయటకు తీయాలి.
* అధిక వర్షాల వల్ల ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది.ఈ తెగులు వ్యాప్తిని నివారించడానికి 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ మందు చొప్పున లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ వద్ద పంపు నాజిల్ తీసి తెగులు ఆశించిన మొక్కలతో పాటుగా ఆరోగ్యంగా ఉన్న మొక్కల మొదళ్ళ వద్ద పోయాలి.
* పక్షి కన్ను తెగులు నివారించడానికి 1.5 మి.లీ. ప్రోపికోనజోల్ లేదా 2.5 మి.లీ. హెక్సాకొనజోల్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించాలని డా.పి.రఘురామి రెడ్డి సూచించారు.

Leave Your Comments

Minister Tummala Nageswara Rao: టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.15 వేలుండాలి..కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి తుమ్మల విజ్ఞప్తి

Previous article

Integrated Plant Protection in Chilli Crop: మిరపలో రసం పీల్చే, కాయ తొలిచే పురుగులు ఆశించకుండా..సస్యరక్షణ పద్ధతులు మేలు!

Next article

You may also like