PJTSAU-ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పదవ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఈ రోజు(ఆగష్టు 3 న) ఘనంగా జరిగాయి. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ వేడుకల్ని నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బి. జగదీశ్వర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. “గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ది సొల్యూషన్” అన్న అంశంపై ప్రొఫెసర్ బి. జగదీశ్వర్ రావు ఉపన్యసించారు. రాష్ట్రానికి కీలకమైన వ్యవసాయ రంగానికి PJTSAU ఒక ఆభరణం వంటిదన్నారు. విద్య, జ్ఞానం అనేవి చాలా పదునైన అస్త్రాలని వాటితోనే సర్వసవాళ్ళని పరిష్కరించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. విద్య అంటే కేవలం తరగతి గదులు, డిగ్రీలు అన్న భావన నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. విద్య అంటే చాలా లోతైన అంశమని వర్ణించారు. భారతదేశంలో నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా విధానం విద్యకి సరికొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకునే అవకాశాన్ని ఈ విధానం అవకాశం కల్పిస్తుందని, అధ్యాపకులు, విద్యార్థులు నిరంతరం నేర్చుకోవడం పైనే దృష్టి పెట్టాలని అప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందన్నారు. త్వరలోనే భారతదేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా పరిణమించనున్నదని వివరించారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని, టెక్నాలజీలను ఉపయోగించుకొని, తయారీ రంగంలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. అదేవిధంగా దేశంలో సగం ఉన్న మహిళా శక్తిని పూర్తిస్థాయిలో సద్వినియోగ పరుచుకుంటే దేశం కొన్నేళ్లలోనే ప్రపంచంలో ప్రథమ స్థానానికి వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబాలు సంస్కరణ కేంద్రాలుగా మారి పిల్లలకు విలువలు ఇళ్ళలోనే నేర్పితే సమాజంలో అపసవ్య ధోరణలు తలెత్తవని అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీలే రానున్న వందేళ్లలో సమాజాన్ని శాసించనున్నాయని వివరించారు. ఇందిరా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి మహామహులు గతంలో ఉమ్మడి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని, ఆ వారసత్వం కొనసాగింపుగా పదేళ్ల క్రితం ఏర్పాటైన పి.జె.టి.ఎస్.ఏ.యూ మరింత పురోగతి సాధించాలని ప్రొఫెసర్ జగదీశ్వర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
పదేళ్లలో అనేక మైలురాళ్ళు…
ఏర్పాటైన పదేళ్లలోనే జయశంకర్ యూనివర్సిటీ బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో అనేక మైలురాళ్లు సాధించిందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఇన్చార్జి ఉపకులపతి ఎం. రఘునందన్ రావు వివరించారు. తెలంగాణ సోనా సహా సుమారు 67 నూతన వంగడాలని విడుదల చేశామని, అవసరాలకు అనుగుణంగా కొత్త కళాశాలల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రుణమాఫీ సహా అనేక రైతు కేంద్రీకృత పథకాలను అమలు చేస్తుందని, అందుకు అనుగుణంగా మనమందరము రైతాంగ సేవలకి పునరంకితం కావాలని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. అంతకుముందు జయశంకర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, పరిశోధనా సంచాలకులు డా. పి. రఘురామి రెడ్డి స్వాగతోపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులకి, బోధన, బోధన సిబ్బందికి పురస్కారాలు అందజేశారు. వేడుకలు ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ జయశంకర్ కి పూలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో బోధన, బోధ నేతర సిబ్బంది, రైతులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read :Success Story Of Farmer Nunna Rambabu: ఉద్యోగం వదిలి ప్రకృతి సాగు వైపు..