రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పంటలపై తెగుళ్లు పంజా విసురుతున్నాయి. వివిధ రకాల పంటలకు ఏదో ఒక రకమైన తెగులు సోకుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తక్కువ కావడంతో పైర్లపై పురుగులు పెరుగుల ఉధృతి పెరుగుతుంది. పైర్లకు చీడపీడలు ఆశిస్తున్నాయి. ఇది సాధారణమే, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో బుధవారం చాలా చోట్ల 42 డిగ్రీలుగా ఉంది. గతేడాది ఏప్రిల్ 13న డిగ్రీలు నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తారీఖున 42 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతిరోజూ 3 డిగ్రీలు పెరుగుతున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం పంటలపై చూపిస్తున్నది. ముఖ్యంగా పంటలకు రకరకాల తెగుళ్లు సోకానున్నాయి. ఏ పంటకు ఏ తెగులు వస్తుందనే విషయాన్నీ వ్యవసాయ, వాతావరణ శాఖలు ఉమ్మడిగా నివేదిక ఇచ్చాయి. ముఖ్యముగా వరికోతల సమయంలో కంకులు రాలిపోయే ప్రమాదం ఉందనీ, పొట్టదశలో అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయని వ్యవసాయ, వాతావరణ శాఖ పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు చేశారు. నష్టనివారణ కోసం రైతులు జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని చెబుతున్నాయి.
పంటలకే కాకుండా పశువులు, గేదెలు, కోళ్లు, గొర్రెలకు సైతం వేసవికాలంలో రోగాలు వ్యాపిస్తాయని నివేదికలో పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కోళ్లకు కొక్కెర తెగులు, గొర్రెలకు చిటుకు, మశూచి వ్యాధి, పీపీఆర్ పోకుట, గేదెలు, పశువులకు గొంతువాపు, గాలికుంటు వ్యాధులు బాధిస్తాయి. ఈ విషయంలో రైతులు స్థానిక పశు డాక్టర్ల సలహాలు తీసుకోవాలని సూచించింది.
కూరగాయలకు మచ్చ తెగులు సరైన సమయంలో తెగులును గుర్తించకపోతే కూరగాయలకు వేగంగా సోకుతుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగు చెలరేగుతున్నది. వంకాయలకు కాయ తొలుచు పురుగు, టమాటా మరియు మిరపలకు ఆకుపచ్చ తెగులు, తామర, బెండకాయపై తెల్లదోమ వాలి పంటను నాశనం చేస్తున్నది. మొక్కజొన్నకు కత్తెర పురుగు, వేరుశనగకు పొగాకు లద్దె పురుగు, టిక్కా, మామిడి తోటలు పిందె రాలడం, తేనె మంచు పురుగు వంటి తెగుళ్లు సోకుతాయని నివేదిక పేర్కొంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పైర్లపై చీడపీడలు..

Leave Your Comments