చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వరిలో చీడపీడలు వ్యాపిస్తున్నాయి. పంటను రక్షించుకోవడానికి ఇష్టానుసారంగా తోచిన పిచికారీ మందులను చల్లుతూ రైతులు పెట్టుబడులు పెంచుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోకుండా స్థానిక పిచికారీ మందుల వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో చీడపీడల నివారణ కంటే పెట్టుబడిని పెంచుకుంటున్నారని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. వరి పంటను నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో సుమారు 5.48 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పంట వివిధ దశల్లో ఉన్నప్పటికీ ఎక్కువ శాతం పిలక నుంచి దుబ్బు చేసే దశలో ఉంది. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 – 5 సెంటీ గ్రేడ్లు కనిష్టంగా నమోదయ్యాయి.
కే వి కే శాస్త్రవేత్తల సూచనలు
- చలి తీవ్రతను అధిగమించడానికి పొలంలో సాయంత్రం వేళలో నీరు పెట్టి ఉదయం తీసి వేసి కొత్త నీరు పెట్టాలి.
- మొదట దఫాలో పొటాష్ ఎరువులు వేయనట్లయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఎకరాకు 15 – 20 కిలోలు అందించాలి.
- చౌడు భూముల్లో జింకు ధాతు లోపం కనిపిస్తోంది. జింకుసల్ఫెట్ 2 గ్రాములు లీటరు నీటికి చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.
పైన సూచించినవన్నీ చేపడుతూ.. పైపాటుగా 19:19:19 పోషకాల మిశ్రమాన్ని 10 గ్రాములు, కార్బండిజమ్ + మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పొలం ఎర్రబడే సమస్యను అధిగమించవచ్చు.
మొగి పురుగు:
- నాట్లు వేసిన వారం రోజుల్లోపు క్లోరాంట్రోనిలిప్రోల్ 0.4జి గుళికలు ఎకరాకు 4 కిలోలు చల్లుకోవాలి.
- చిర పొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్.పి. 2 గ్రాములు లీటరు నీటికి లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ 18 ఎస్.సి. 0.3 మి. లీ. లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రెల్ల రాల్చు పురుగు:
- పురుగును తొలి దశలో గుర్తించి క్లోరాంట్రోనిలిప్రోల్ 18 ఎస్.సి. 0.3 మి.లీ.. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- పురుగు ఆశించినప్పుడు సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి. ఈ సమయంలో పొలంలో నీళ్లు నిండుగా ఉండేలా చూసుకోవాలి.
అగ్గి, పాము పొడ తెగులు:
- ట్రైఫ్లోక్సిట్రోబిన్ + టెబుకోనజోల్ 25 డబ్ల్యూజీ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిలక దశ నుంచి దుబ్బు చేసే దశలో తెగులు గమనించినప్పుడు పిచికారీ చేసుకుంటే నివారించవచ్చు ఎకరాకు రూ.5 వేలు
భూమిలో పోషకాలు లేకపోవడం.. సకాలంలో చీడ పీడలను గుర్తించకపోవడంతో నష్టాన్ని కలిగిస్తోంది. ఎర్రబడిన వరి పైరును రక్షించుకోవడం కోసం ఇప్పటీకే మూడు పర్యాయాలు పిచికారీ చేసి ఎకరానికి రూ. 5 వేలు ఖర్చు చేశామని రైతులు వాపోతున్నారు.