Pests In Crops Due To Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున అధిక వర్షాల వలన వివిధ పంటలలో కొన్ని రకాల చీడపీడలు యొక్క ఉదృతి అధికంగా వుండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక విసిర్ణంలో సాగు చేస్తున్న పంటలైన వరి, ప్రత్తి, మొక్క జొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర మరియు మినుము వంటి పంటలలో ప్రస్తుతం వున్న పంట దశలో కొన్ని రకాల చీడపీడలు ఈ అధిక వర్షాల వలన ఆశించే అవకాశం ఉంది. కావున వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వివిద పంటలలో ఆశించే పురుగు మరియు తెగుళ్ళ వాటి నివారణ కొరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచించింది. రైతులు ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల వివిధ పంటలను నష్టాలనుంచి కాపాడుకోవచ్చని పరిశోధనా సంచాలకులు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురాం రెడ్డి ఈ కింది సూచనలు చేశారు.
1. వరి:
రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట దుబ్బు చేసే / కట్టే దశ నుండి అంకురం /చిరుపోట్ట దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ముందుస్తుగా నాట్లు వేసిన జిల్లాలలో వరి పంట పూత దశలో ఉంది. ప్రస్తుత పరిస్థితులలో వరి పంటలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు, కాండం తొలిచే పురుగు, ఆకుముడత మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంది.
* బ్యాక్టీరియా ఎండాకు తెగులు వ్యాప్తిని నివారించడానికి కాపర్ హైడ్రాక్సైడ్ @ 400 గ్రా. + స్ట్రెప్టే మైసిన్ సల్ఫేట్ @ 60 గ్రా ఒక ఎకరానికి పిచికారి చేయాలి. అలాగే తెగులు లక్షణాలు తొలిదశలో గుర్తిస్తే నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా ఆపాలి. ఆఖరి దపాగా పోటాష్ ఎరువును వేయాలి.
అలాగే కాపర్ శిలింద్రనాశినులను పూత దశలో వున్న వరి పంటలో పిచికారి చేయరాదు.
Also Read:Rice Crop: రైతులు తమ వరి పంటను ఎలా సంరక్షించుకోవాలి ?
* కాండం తొలిచే పురుగు యొక్క గుడ్లు మరియు రెక్కల పురుగులు ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కంటే ఎక్కువగా గమనింపై చిరుపోట్ట దశలో వున్న వరి పంటలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ @ 400 గ్రా లేదా క్లోరాంట్రానిలిప్రోల్ @ 60 మి.లీ ఒక ఎకరానికి పిచికారి చేయాలి. ఒకసారి వెన్నులు బయటకు వచ్చిన తర్వాత తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఆకు ముడత పురుగు వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నది. అలాగే కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతోనే ఆకు ముడత పురుగును నివారించవచ్చును.
* అలాగే ఆగష్టు మాసంలో అధిక వర్షాలు కురిసి, ఒకవేళ సెప్టెంబర్ మాసంలో తక్కువ వర్షపాతం ఉండి, ఉక్కపోత వాతావరణం మరియు గాలిలో అధిక తేమశాతం ఉంటే సుడిదోమ ఆశించే అవకాశం ఉంది కావున ఉధృతి బట్టి నివారణ చర్యలు చేపట్టాలి.
* ప్రస్తుతం వరి పంటలో రాష్ట్రవ్యాప్తంగా అధిక గాలులు వీచడం మరియు వర్షాలు పడడం వలన పంట పసుపు రంగు మారడం మరియు కొనల నుండి తెల్లటి చారలు ఏర్పడడం క్షేత్రస్థాయిలో గమనించడమైనది. ఇలాంటి పరిస్థితులలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు తగ్గిన తర్వాత పై పాటుగా ఎరువులను
వేసినట్లయితే వరి పంట
ఆరోగ్యంగా పెరిగే అవకాశం
ఉంది.
2. ప్రత్తి:-
ఈ పంటలో అధిక వర్షాల కొన్ని రకాల తెగుళ్ళ ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా కాలువలు చేసి బయటకు తీయాలి. నీరు నిల్వ ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్తి పంటలో అధిక వర్షాల వలన ఎండు తెగులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తెగులు వ్యాప్తిని నివారించడానికి కార్బండాజిమ్ @1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ వద్ద పంపు నాజిల్ తీసి తెగులు ఆశించిన మొక్కలతో పాటుగా ఆరోగ్యంగా ఉన్న మొక్కల మొదళ్ళ వద్ద పోయాలి.
* ప్రతిలో ఆకు మచ్చ తెగుళ్లతోపాటుగా కాయకుళ్ళు తెగుళ్ళు ఉదృతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక వర్షాలు, చిరుజల్లులు, గాలిలో తేమశాతం ఉన్నప్పుడు ప్రత్తి లో తెగుళ్ళ ఉధృతి అధికంగా ఉంటాయి. ప్రధానంగా కాయకుళ్ళు తెగులు ఆశించినట్లయితే దిగుబడుపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అలాగే ఆకుమచ్చ తెగుళ్ళతో పాటుగా ఆల్టేనేరియా ఆకుమాడు మరియు కాండం మాడు తెగులు కూడా సమస్యాత్మకం అయ్యే అవకాశం ఉంది. వీటి నివారణకు కార్బండాజిమ్ + మాంకోజెబ్ @ 500 గ్రా. లేదా ట్రైప్లాక్సిస్టోబిన్ + టేబుకోనజోల్ @ 80 గ్రా. ఒక ఎకరానికి పిచికారి చేయాలి.
* కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ @ 600 గ్రా + streptomycin sulphate @ 60 గ్రా. ఒక ఎకరానికి పిచికారి చేయాలి.
* అలాగే ఆగష్టు మాసంలో కొన్ని జిల్లాలలో తలమాడు ఉధృతి కూడా గమనించడమైనది. దీని కొరకు తామర పురుగు యొక్క ఉధృతి నివారించడంతోపాటుగా పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలైన పార్థినియం మొక్కలను పీకివేయాలి. తామర పురుగు నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత పిప్రోనిల్ @ 400 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ @ 40 గ్రా. ఒక ఎకరానికి పిచికారి చేయాలి.
* ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో పచ్చ దోమ ఉధృతి అధికమయ్యే అవకాశం ఉంది. అధిక వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం లో ప్రత్తిలో పచ్చ దోమ అధికమవుతుంది. నివారణకు ఫ్లోనికామైడ్ @ 60 గ్రా. లేదా సల్పక్సోప్లొర్ @ 150 మి.లీ ఒక ఎకరానికి పిచికారి చేయాలి.
* పురుగు మందుల పిచికారి చేసేటప్పుడు సుమారు వర్షాలు ఒక నాలుగు గంటలు ఒరుపు ఇచ్చినప్పుడు పిచికారి చేయాలి.
* సోయా చిక్కుడు పంట ఎక్కువ శాతం కాయలు ఏర్పడే దశలో ఉన్నది. అధిక వర్షాలు వలన పంటలో నీరు నిల్వ లేకుండా చూడాలి. అలాగే వర్షాలు అధికంగా కురవడం వలన వేరుకుళ్ళ మరియు ఎండు తెగులు ఆశించే అవకాశం, అలాగే కాయలు మీద పక్షి కన్ను తెగులు మరియు ఆకుల మీద కొన్ని రకాల శిలీంద్రాల వలన ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది.
* ముఖ్యంగా కాయల ఆశించే తెగుళ్ళ నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత కార్బండాజిమ్ + మాంకోజిబ్ కలిపి ఉన్న మిశ్రమ మందును ఒక ఎకరాకి 500 గ్రా. పిచికారి చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగుళ్ళ కూడా పైన పేర్కొన్న మందు పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఎలాంటి మందులు పిచికారి చేయవలసిన అవసరం లేదు.
* ప్రధానంగా నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా బయటకు తీయాలి.