వరిని వదిలి కూరగాయల సాగు – సేంద్రియ పద్దతుల్లో అధిక దిగుబడి ఏడాదిగా లాభాలు గడిస్తున్న యువరైతు
వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు,ఆకుకూరలు సాగుచేస్తూ ఓ యువరైతు మంచి లాభాలు పొందుతున్నాడు. మండలంలోని అప్పలమ్మగూడెం గ్రామ పంచాయితి పరిధిలోని సిత్యాతండా కు చెందిన ధానావత్ లక్కిరాం,భార్య లాలి తమకున్న ఎకరం భూమిలో 20 రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.బెండ,వంకాయ,పచ్చి మిర్చి,టమాటతోపాటు,ఆకుకూరలు,క్యాబేజి,క్యాలిఫ్లవర్,బంతిపూలను సేంద్రీయ పద్దతుల్లో ఏడాది పొడవునా పండిస్తున్నారు.రెండెండ్లుగా వాతావరణానికి అనుకూలంగా ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందో వాటినే వేసి లాభాలు గడిస్తున్నారు.
వరిని వదిలేసి.. ఎకరం పొలంలో ఏడాది కిందటి వరకూ వరి వేసేవారు.ప్రస్తుతం అందులో వివిధ రకాల పంటలను సేంద్రియ పద్దతుల్లో సాగు చేస్తున్నారు.రోజూ వచ్చే పంట ఉత్పత్తులను భార్యాభర్తలిద్దరూ ఆయా గ్రామాలు,మార్కెట్ కి వెళ్లి విక్రయిస్తారు.అడవిదేవులపల్లి, దామరచర్ల,త్రిపురారం మండలాల్లో ఎక్కువగా వీటిని అమ్ముతారు.ఫంక్షన్లు,ఇతర అవసరాల కోసం కొంతమంది పొలం దగ్గరికే వచ్చి తీసుకెళ్తుంటారు. వీటి ద్వారా ప్రతిరోజూ రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు సంపాదిస్తున్నారు.ప్రస్తుతం క్యాబేజి నాటగా,క్యాలిఫ్లవర్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.ప్రతి రోజూ పచ్చి మిర్చితో పాటు వుల్లిఆకు కూడా అమ్ముతున్నారు.ఉల్లి ఆకు మీదే రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు వస్తుందని వారంటున్నారు.
మంచి లాభాలున్నాయి… ఒక ఎకరంలో వరి వేసి ఆరు నెలలు కష్టపడితే రూ.12 నుంచి రూ.15 వేలు మాత్రమే వస్తాయి.కూరగాయల సాగుపై ప్రతి నెలా రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఆదాయం పొందొచ్చు.ఎలాంటి ఒత్తిడి లేకుండా ఏరోజూకారోజూ అమ్ముకోవచ్చు.త్వరలో దొండ,దోస,బీరకాయ పెట్టె ఆలోచన ఉంది.పొలం చుట్టూ వుండే వరాల గడ్డిని ఇంట్లో పశువులకు మేతగా తీసుకెళ్తున్నాం.మిగిలిన కూరగాయలను పశువులకు వేస్తాం.ప్రభుత్వం సహకరిస్తే పంట విస్తీర్ణం పెంచి మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే కూరగాయలను ప్రజలకు అందిస్తాం.