వార్తలు

“రెయిన్ పైపు” విధానంతో ఉల్లి సాగు..

0

రైతుల ఇంట్లో రాబడుల రాశులు పొసే పంట ఉల్లి. ఆ విధంగానే ప్రతికూల వాతావరణంలోనూ సాగులో అద్భుతాలు సాధిస్తున్నారు తాండురూ పట్టణానికి చెందిన గాండ్ల నర్సింహులు, విజయ నిర్మల దంపతులు. తమ దగ్గర ఉన్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాల్లో రబీలో ప్రతి ఏటా ఉల్లి సాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధించేందుకు చక్కటి నైపుణ్యంతో “రెయిన్ పైపు” విధానంతో ఉల్లి సాగు చేస్తూ ఎకరానికి 120 క్వింటాళ్ల ఉల్లి పంటను పండిస్తున్నారు. ఇలా 2ఎకరాల పొలంలో 250 క్వింటాళ్ల వరకు ఉల్లిని పండించి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు.
మూడు నెలల స్వల్పకాలిక ఉల్లి పంటను వేసేందుకు ముందుగా నేలను బాగా దున్ని 120 సెం.మీ వెడల్పు, 3 మీ. పొడవుగల ఎత్తయినా నారుమళ్లను తయారు చేసుకోవాలి. 2 – 3 కిలోల విత్తనాన్ని 200 – 300 చ.మీ నారుమడుల్లో వేసి నారు చేయాలి. నారును 12 ఫీట్ల నారుమడిలో నాటాలి. అటు 6 ఇటు 6 ఫీట్ల మధ్య నుంచి నీళ్ల కోసం “రెయిన్ పైపు”ను వేయాలి. దీంతో నీళ్లు వృథా కాకుండా తగినంత మోతాదులో పంటకు చేరుతాయి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 – 30 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం ఎరువులు వేయాలి. నత్రజనితో పాటు పోటాష్ ను రెండు దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది.
ముఖ్యంగా ఉల్లిలో ఆకుతినే పచ్చపురుగు నివారణకు కార్బిల్ 3 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గడ్డలు పీకడానికి ముందు నీళ్లు పెట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెం.మీ. కదా ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.
వ్యవసాయానికి మళ్లీ స్వర్ణయుగం వస్తోంది. సాగును పండుగగా మార్చేందుకు సర్కారు పెట్టుబడి సహాయం అందిస్తూ అన్ని విధాలా రైతులను ప్రోత్సహిస్తున్నది. భవిష్యత్తులో అన్ని రకాల పంటల విస్తీర్ణం పెంచేలా సౌకర్యాలు కల్పిస్తున్నది.

Leave Your Comments

తేనె వలన కలిగే ఉపయోగాలు..

Previous article

గిరికోనల్లో సేంద్రియ విప్లవం..

Next article

You may also like