చిలకడదుంప సాగు ఆహార భద్రతలో, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికున్న పోషక విలువల దృష్ట్యా ఈ పంట సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. చిలకడదుంపను మొరం తీగ, రత్నపురి గడ్డ, మొరం గడ్డ, గెలుసు గడ్డ, శకర కంద అనే పలు రకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. చిలకడదుంపను ఆహారంలో భాగంగా తీసుకోవడమే కాకుండా పశువుల దాణాగా, ఆల్కహాల్ తయారీలోనూ ఉపయోగిస్తారు. ఆరోగ్యరీత్యా శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు (బి, సి), ఖనిజలవణాలు చిలకడదుంప ద్వారా పుష్కలంగా లభిస్తాయి. చిలకడదుంపకున్న ఔషధ విలువలు… జీర్ణవ్యవస్థని బలోపేతం చేయడమే కాకుండా గుండెని పదిలంగా ఉంచుతుంది. దీనితో పాటు రక్తంలో ఉన్న చక్కెర శాతాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. చిలపడదుంపల నుంచి జామ్, జల్లి, పచ్చళ్ళు గులాబ్ జామున్ మిక్స్, ఫ్రైడ్ చిప్స్, చిలకడదుంప పిండి, బ్రెడ్, నూడుల్స్, క్యాండీ, స్వీట్ పొటాటో ప్యూరీ వంటి విలువ జోడించిన ఉత్పత్తులను తయారు చేయవచ్చు. తెలంగాణలో 180 హెక్టార్లలో 2830టన్నుల చిలకడదుంప ఉత్పత్తి జరుగుతుంది. ఈ పంట సాగులో చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో రైతులని లాభాల బాటలో నడిపిస్తుంది.
నేలలు: ఈ పంటకు ఇసుకతో కూడిన ఎర్రగరప నేలలు, మధ్యస్థ తేలిక నేలలు అనుకూలం. బరువు నేలల్లో దుంపల దిగుబడి తక్కువగా ఉంటుంది. వేసవిలో లోతు దుక్కులు చేసి వర్షాకాలంలో బోదెల వెంబడి నాటుకోవాలి. శీతాకాలంలో అయితే బోదెల పైన లేదా ఎత్తైన మడులపై నాటుకోవాలి. నీటిపారుదలకు, మురుగునీటికి కాలువలను చేసుకోవాలి.
వాతావరణం: చిలకడదుంప సమశీతోష్ణ మండలపు పంట. పంట కాలంలో 20 -36 డిగ్రీల సెల్సియస్ వరకు అనుకూలం. దుంప తయారయ్యే సమయంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉన్నా అధిక దిగుబడిని వస్తుంది.
రకాలు: సామ్రాట్: తక్కువ కాలవ్యవధి (110-120 రోజులు), అధిక దిగుబడినిచ్చే రకం. ఎకరాకు 7-8 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. దీని దుంపలు తెల్లగా ఉండి గులాబీ రంగు చారలు కలిగి ఉంటాయి.
కిరణ్: నారింజ రంగు కలిగిన రకం. అధిక దిగుబడినిచ్చే మధ్యస్థకాల పరిమితి రకం.120 రోజుల్లో పంట వస్తుంది. ముక్కు పురుగును ఓ మోస్తరుగా తట్టుకుని, ఎకరాకు 8 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.
ఆర్. ఎన్. ఎస్. పి-1: అధిక దిగుబడిని ఇచ్చే మద్యస్థ పరిమితి సంకర రకం. ఎకరాకు 6- 7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.
కేంద్ర దుంప పంటల పరిశోధన సంస్థ, తిరువనంతపురం నుంచి విడుదల చేసిన రకాలు : చిలకడదుంపలు వివిధ రంగుల్లో… గులాబీ రంగు, నారింజ, ఊదా రంగుల్లో లభిస్తాయి. నారింజ రంగు రకాల్లో బీటా కెరోటిన్లు ఉండడం వల్ల ఆరోగ్య కరమైన కంటి చూపును పొందడంలో సహకరిస్తుంది. ఊదా రంగులో ఉన్న అంతోసైనిన్లు గుండెనాళాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
శ్రీ కనక, శ్రీ భద్ర, శ్రీ అరుణ్, శ్రీ వరుణ్, శ్రీరత్న, శ్రీ నందిని, కిషన్, సౌరిన్, భూ సోనా, భూ కాంతి, భూ కృష్ణ, భూస్వామి రకాలు.
హెచ్ 41: తెలుపు రంగు కలిగిన రకం. అధిక దిగుబడి నిస్తుంది. 120 రోజుల్లో పంటకొచ్చే మధ్యస్థకాల పరిమితి రకం. ఎకరాకు 7-10 టన్నుల దిగుబడినిస్తుంది.
హెచ్ 42: అధిక దిగుబడి నిచ్చే మధ్యస్థకాల పరిమితి రకం. 120 రోజుల్లో పంట వస్తుంది. ఎకరాకు 7-10 టన్నుల దిగుబడినిస్తుంది
వర్ష: ఊదా రంగు కలిగిన రకం. 120 రోజులల్లో పంటకొచ్చి అధిక దిగుబడి నిచ్చే మధ్యస్థకాల పరిమితి రకం. ఎకరాకు 8 టన్నుల దిగుబడినిస్తుంది.
శ్రీ భద్ర: తక్కువ కాలవ్యవధి (90 రోజులు), అధిక దిగుబడినిచ్చే రకం. ఎకరాకు 7 – 8 టన్నుల దుంపల దిగుబడినిస్తుంది.
భూ కృష్ణ: ఊదా రంగు కలిగిన రకం. అధిక దిగుబడి నిచ్చే మధ్యస్థకాల పరిమితి (120 రోజుల పంటకాలం) రకం. ఎకరాకు 8 టన్నుల దిగుబడినిస్తుంది.
విత్తనం, వ్యాప్తి: సాధారణంగా చిలకడదుంప సాగు కోసం 3-5 కణుపుల గల తీగలను ముందుగా ఉన్నతోటల నుంచి సేకరించి నాటుతారు. తీగలు అందుబాటులో లేనట్లయితే దుంపలను నారుమళ్ళల్లో పెంచి, వాటి నుంచి వచ్చిన తీగలతో ప్రైమరీ, సెకండరీ నారుమడుల్లో మూడు నెలలు ముందుగా పెంచుకోవాలి. ఒక హెక్టారుకు సుమారు 18000- 22000 తీగ మొక్కలు అవసరమవుతాయి.
నారుమడి తయారీ: మంచి తీగలు తయారు కావడానికి కొన్ని ముఖ్య పద్ధతులను పాటించాలి.
1వ దశ : పొలంలో నాటడానికి మూడు నెలలు ముందుగా నారును తయారు చేసుకోవాలి. 40 చ. మీ.లలో పెంచిన నారు ఒక ఎకరానికి సరిపోతుంది లేదా 125- 150 గ్రా. సైజు గల 40 కిలోల దుంపలు సరిపోతాయి. ఈ దుంపలను లేదా తీగలను 60 సెం. దూరంలో బోదెలు తయారుచేసి బోదెలపై 20 సెం. దూరంలో నాటుకోవాలి. 20 – 30 సెం.మీ. పొడవు గల తీగలను 45 రోజుల తర్వాత కత్తిరించి రెండవ దశ నారుమడిలో నాటడానికి సరిపోతాయి.
2 వ దశ : మొదటి దశ నారు మడి నుంచి ఎన్నుకున్న నారును 60 సెం.మీ. దూరంలో బోదెలపై 20 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. ఒక ఎకరాకు 200 చ.మీ. రెండవ దశ నారు అవసరం. తీగ మంచి పెరుగుదలకు రెండు దఫాలుగా నాటిన 15 రోజులు, 30 రోజుల తర్వాత రెండు కిలోల యూరియా వేయాలి. తీగలు బాగా నాటుకోవడానికి వీలుగా నాటిన పది రోజుల వరకు రోజు మార్చి రోజు తడివ్వాలి. నారు 45 రోజులకు తయారవుతుంది.
తీగల ఎంపిక: రెండవ దశ నారుమడి నుంచి తీగలను ఎన్నిక చేసుకోవాలి. తీగలను కొమ్మల చివర్ల నుంచి తీసుకుంటే మంచి నాణ్యత కలిగి ఉండి ముక్కు పురుగు తీవ్రత తక్కువగా ఉండి, దుంపలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. తీగలు 20-30 సెం.మీ. పొడవుతో మూడు నుంచి నాలుగు కణుపులు కలిగినవి కోసి నీడలో రెండు రోజులు ఉంచి నాటడం వల్ల బాగా నాటుకుని క్రమంగా అధిక దిగుబడిని ఇస్తుంది.
విత్తన శుద్ధి: నాటే ముందు తీగలను డైమిథోయేట్ 2 మి.లీ. మందును ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి నాటితే ముక్కు పురుగు తీవ్రతను తగ్గించవచ్చు.
నాటటం : అనువైన పరిమాణంలో మల్లను తయారుచేసి నీటిపారుదల, మురుగు నీటిపారుదల సౌకర్యం గల కాలువలు తయారు చేయాలి. బోదెలపై 60 x 20 సెం.మీ. ఎడంతో తీగలను నాటుకోవాలి.
నాటే సమయం : తెలంగాణలో చిలకడ దుంపని ఎక్కువ రబీ పంటగా సాగు చేస్తారు. దీనిని అక్టోబర్ – నవంబర్ లో నాటడం వల్ల మహా శివరాత్రి వరకు కోతకి వస్తుంది. చిలకడ దుంపని ఖరీఫ్ పంటగా జూన్- జూలైలో, వేసవి పంటగా ఫిబ్రవరి- మార్చి వరకు వేసుకోవచ్చు.
నీటి యాజమాన్యం : కాలువల ద్వారా నీటిని పారించాలి. పది రోజులకు మించి వర్షం పడకుండా ఉంటే తప్పకుండా నీరు పారించాలి. రబీ కాలంలో నాటిన మొదటి నెల రోజులు, నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధితో నీటిని ఇవ్వాలి. దుంప పెరుగుదల దశలో వారం రోజుల వ్యవధితో నీరు ఇవ్వాలి. దీనివల్ల ముక్కు పురుగు తీవ్రత బాగా తగ్గుతుంది. దుంపలు ఏర్పడే దశలో అంటే నాటిన 60-90 రోజుల మధ్యలో నీరు తప్పకుండా ఇవ్వాలి. ఆ తర్వాత 10 -15 రోజుల వ్యవధిలో నీటిని ఇస్తే సరిపోతుంది.
అంతర కృషి : తీగలు నాటిన 30, 60 రోజులకు కలుపు తీసి, బోదెలపైకి మట్టిని ఎగదోయాలి. తీగలను అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. దీనివల్ల వేర్లు పాతుకోకుండా ఉంటాయి.
ఎరువులు: ఎకరాకు 6 – 8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 22 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం,16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజనిని రెండు దఫాలుగా అంటే నాటిన 30, 60 రోజులకు వేయాలి. 16 కిలోల పోటాష్ ను రెండవ దఫాగా నాటిన 60 రోజులకు వేయాలి.
సస్యరక్షణ : చిలకడ దుంపలో ముక్కు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు కాండం మొదటి భాగాన్ని, దుంపలను ఆశిస్తుంది. దుంపల నుంచి ఒక రకమైన వాసన వెలువడడంతో అవి తినటానికి పనికి రావు. దీని నివారణకు నాటే ముందు తీగలను లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్+ 2 గ్రా. కార్బెండాజిమ్ కలిపిన ద్రావణంలో ముంచి నాటాలి.
తెగుళ్లు: ఎండు తెగులు, నల్ల కుళ్ళు, ఆకుమచ్చ, ఆల్టర్నేరియా ఆకుమచ్చ, మొజాయిక్ తెగుళ్లు చిలకడదుంప మొక్కలను ఆశిస్తాయి. వీటి నివారణకు విత్తన తీగలను, దుంపలను ఆరోగ్యవంతమైన పంట నుంచి సేకరించి విత్తుకోవాలి. తీగలను నాటటానికి ముందు కార్బెండాజిమ్ 1 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపిన మందు ద్రావణంలో తీగలను 20 నిమిషాలు ముంచి నాటుకోవాలి.
సమగ్ర సస్యరక్షణ చర్యలు :
1. తీగలు నాటేటప్పుడు డైమిథోయేట్ 2 మి.లీ.చొప్పున లీటరు నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి.
2. వేప పిండి 100 కిలోలు ఎకరానికి వేసుకోవాలి.
3. చిలకడదుంపతో పాటు ధనియాలు లేదా వెల్లుల్లి 1:1, బంతి 1:2 నిష్పత్తిలో నాటుకొని దిగుబడి తగ్గకుండా పురుగు ఆశించడం నివారించవచ్చు.
4. లింగాకర్షణ బుట్టలు ప్రతి 100చ. మీ. విస్తీర్ణంలో ఒకటి చొప్పున తప్పనిసరిగా పెట్టుకోవాలి.
5. బవేరియా బాసియానా అనే జీవ శిలీంద్రాలను పశువుల ఎరువుతో పాటు కలిపి పొలంలో వేయటం వల్ల ముక్కు పురుగు ఉధృతి తగ్గించవచ్చు.
6. నాటిన 30, 60 రోజులకు 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా వేప సంబంధిత పురుగు మందులైన ఆజాడిరాక్టిన్ లాంటి వాటిని పిచికారి చేయాలి.
7. పురుగు ఆశించిన దుంపలను తీగలను, గడ్డలను తగలబెట్టాలి.
అడవి పందుల నివారణ: చిలకడదుంప పంటలో అడవి పందుల దాడి అధికంగా ఉంటుంది. ఇవి దుంప తయారీ సమయంలో వచ్చి పంటను నాశనం చేస్తాయి. పాత పద్ధతిలో రైతులు ఖాళీ సీసాలను వేలాడదీస్తే అవి ఒకదానికొకటి తగిలి వచ్చే శబ్దానికి పందులు దూరంగా వెళ్లిపోతాయి. అడవి పందులను బెదరగొట్టడానికి సౌరశక్తిని వినియోగించుకొని చీకటి పడిన తర్వాత పెద్ద ధ్వనులు చేస్తూ, ఎర్ర దీపము వెలుగుతూ ఉండే సాధనాలు నేడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని పొలంలో ఏర్పాటు చేసుకొని అడవిపందులను దూరంగా బెదరగొట్టవచ్చు. నులక తాడు లేదా కొబ్బరి తాడును గంధకంలో ముంచి, ఆరిన తర్వాత దానిని పొలం చుట్టూ రెండు, మూడు వరుసల్లో కట్టినట్లయితే అడవి పందులు పొలం దగ్గరకు రావు. రాత్రి వేళల్లో గట్లపై మంటలు పెట్టడం లేదా టపాకాయలు కాల్చడం వల్ల అడవి పందులను దూరంగా ఉంచవచ్చు.
పంట కోత: సిద్ధమైన వెంటనే పంట కోయాలి. కోతకు సిద్ధమైన దుంపలను కోసి గమనించాలి. బాగా పెరగని దుంపలను కోసినప్పుడు దుంపల మధ్య పచ్చగా ఉంటుంది. దుంపలను ఆలస్యంగా తీస్తే ముక్కు పురుగు తీవ్రత పెరుగుతుంది. తీగలను కోసి గడ్డపారతో తవ్వి దుంపలను తీయాలి. తేలిక నేలల్లో నాగలితో దున్ని దుంపలను తీసుకోవచ్చు. తీసిన దుంపలను వెంటనే శుభ్రం చేయాలి.
నిల్వ చేయడం: కోసిన దుంపలను నీడలో మూడు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ చేయవచ్చు. దుంపలను కోసిన వెంటనే మార్కెట్ కు పంపవచ్చు. మార్కెట్లో అవకాశాన్ని బట్టి నిల్వ చేసుకోవచ్చు.
కె. శ్రేయ, ఏ.వి.ఎన్.లావణ్య, ఏ. మమత,
డా.ఎం. శ్రీనివాస్,కె. నిరోష, ఎస్.కె.ఎల్.టి.హెచ్.యు.
కె. చైతన్య, పి.జె.టి.ఎస్.ఏ.యు., రాజేంద్రనగర్