ఆంధ్రప్రదేశ్వార్తలువ్యవసాయ పంటలు

దున్నకుండా మొక్కజొన్న సాగు…

0

వరిమాగాణుల్లో వరి కోసిన తర్వాత పొలంలో ఉన్న పదునును ఉపయోగించుకొని మొక్కజొన్న విత్తి సాగు చేసే విధానాన్ని దున్నకుండా (జీరో టిల్లేజ్) మొక్కజొన్న సాగు విధానం అంటారు. ఈ విధానంలో సాగువల్ల… రైతులకు దుక్కి దున్నే ఖర్చులు ఆదా అవుతాయి. నెల రోజులు పంట కాలం కలిసిరావడమేగాక రెండు నీటితడులు కూడా ఆదా అవుతాయి.

జాగ్రత్తలు: బరువైన, తేనును నిలుపుకొనే నేలల్లో మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి. కోస్తా జిల్లాల్లో నవంబరు నుంచి జనవరి వరకు విత్తుకోవాలి.

విత్తే విధానం: తాడును ఉపయోగించి లేదా విత్తనం వేసే యంత్రంతో గాని వరుసల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా ఒక లీటరు పారాక్వాట్ 200 లీటర్ల నీటిలో కలిపి విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పిచికారి చేయాలి. అట్రాజిన్ +  పారాక్వాట్ ను కలిపి కూడా పిచికారి చేయవచ్చ. ఎరువుల వాడకం, నీటితడులు వంటి మిగిలిన యాజన్య పద్ధతులు సాధారణ మొక్కజొన్నలో మాదిరే పాటించాలి.

విత్తడం: ఎకరాకు సంకర రకాల్లో 8 కిలోలు, తీపి మొక్కజొన్నలో 4 కిలోలు, పేలాల మొక్కజొన్నలో 5 కిలోల విత్తనం వాడి 60 x 20 సెం.మీ. ఎడంగా విత్తాలి. ఎకరాకు బేబీ కార్న్ లో 10 కిలోలు,పశుగ్రాస మొక్కజొన్నలో 16 కిలోల విత్తనాన్ని 45 x 20 సెం.మీ.ఎడం ఉండేలా విత్తాలి.

విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా.మాంకోజెబ్ లేదా థైరమ్ తో విత్తనశుద్ధి చేసుకుంటే లేత దశలో మొక్కలను తెగుళ్ళు బారి నుంచి  కాపాడుకోవచ్చు. కత్తెర పురుగు బారి నుంచి పంట తొలి దశలో కాపాడుకోవడానికి కిలో విత్తనానికి 6 మి.లీ. సయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.

కలుపు నివారణ: పంట విత్తిన 1-2 రోజుల్లో 800-1200 గ్రా. అట్రాజిన్ 50 శాతం పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారి చేసి కలుపు నివారించుకోవాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే 2, 4- డి సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రా. మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వెడల్పాటి, గడ్డి జాతి కలుపును నివారించటానికి ఎకరాకు 115 గ్రా.టెంబోట్రయాన్ 34.4 శాతం ఎస్.సి + 400 గ్రా.అట్రాజిన్ 50 శాతం  డబ్ల్యు.పి. మందు చొప్పున కలిపి పంట 15-18 రోజులప్పుడు పిచికారి చేయాలి. తుంగ ఎక్కువగా ఉంటె హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రా. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 30-35 రోజులకు పశువులతో అంతరకృషి చేయాలి.

ఎరువుల వాడకం(ఎకరాకు): సాధారణ సంకర రకాలకు నత్రజని 80-96 కిలోలు, భాస్వరం 32 కిలోలు, పొటాష్ 32 కిలోలు వేయాలి. అలాగే తీపి మొక్కజొన్నకు 72 + 24 + 20 కిలోలు, పేలాల మొక్కజొన్నకు 40 + 24 + 20 కిలోలు, బేబీ కార్న్ మొక్కజొన్నకు 60 – 72 + 24 + 20  కిలోల చొప్పున నత్రజని + భాస్వరం + పోటాష్ ఎరువులు వేయాలి. సూచించిన నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి పంట విత్తే సమయంలో, 30-35 రోజుల, 50- 55 రోజుల పైరు దశలో వేయాలి. మొత్తం భాస్వరంను విత్తే సమయంలో, పోటాష్ ను రెండు సమ దఫాలుగా విత్తే సమయంలో, పూత సమయంలో వేయాలి. ఎకరాకు 2 కిలోల జింక్ సల్ఫేట్ ని మూడు పంటలకొకసారి దుక్కిలో వేయాలి. మొక్కజొన్న పంటలో జింక్ లోపం కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రా.చొప్పున కలిపి ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేయాలి. మొదట దఫా ఎరువులు వేసిన తర్వాత సాళ్ళలోని మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోయాలి.

నీటి తడులు: పైరు కీలక దశలో అనగా పూతకు ముందు, పూత, గింజ పాలు పోసుకునే దశలో నీటితడులు అవసరం. 30-40 రోజులున్న లేత పైరుకు అధిక నీరు హానికరం. సాధారణంగా పంట కాలంలో 6- 8 నీటి తడులు అవసరం. ఆకులు చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి తడులివ్వాలి.

పంట కోత: బుట్టల పైపొరలు ఎండినట్లు కనిపించి, కండెలలోని గింజలను గోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా ఉండి  నొక్కులు ఏర్పడని దశలో పంటను కోయాలి.

డా. ఎస్. నీలవేణి, డా. ఎస్. కిరణ్ కుమార్,
డా. కె. భాగ్యలక్ష్మి, కె.వి.కె.,ఆముదాలవలస.

Leave Your Comments

ఆరోగ్య ప్రదాయని గుమ్మడి

Previous article

చలివల్ల యాసంగి వరి నారుమళ్లు సరిగా పెరగడం లేదా ?

Next article

You may also like