Agriculture Minister :
కొత్తగా నియమితులైన వ్యవసాయాధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో ఈ రోజు (నవంబర్ 2 న ) జరిగిన శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ, కోఆపరేటివ్ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వారికి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యరంగం వ్యవసాయమని, రానున్న ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సేద్యరంగంలో అగ్రగామిగా నిలబెట్టే ప్రభుత్వం సంకల్పంలో వ్యవసాయాధికారులు భాగస్వాములు కావాలని కోరారు. రైతుల అనుభవాలు మనందరికీ పాఠాలని, తరగతి గదుల్లో నేర్చుకొన్న సాంకేతిక విజ్ఞానాన్ని దీనికి జోడించినట్లయితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని, రైతుల ప్రతీ సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత వ్యవసాయాధికారుల మీద ఉందని తెలియజేశారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. రైతులను సాంప్రదాయ పంటల సాగునుంచి వాణిజ్య పంటల సాగకు ప్రోత్సహించాలని, అదేవిధంగా పంటల మార్పిడి అవశ్యకతను వివరిస్తూ, జీవవైవిధ్యం కాపాడుకోవాలని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రొత్సహించి, తద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడేటందుకు మనందరం కృషి చేయాలని కోరారు.
- భవిష్యత్తులో వ్యవసాయరంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ రంగంలో మీరు ఉన్నందుకు గర్వపడాలని, ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి, సంవత్సరాల తరబడి మీరు చేసిన సేవలు గుర్తుంచుకొనే విధంగా కృషి చేయాలని కొత్తగా నియమితులైన వ్యవసాయాధికారులను కోరారు.
- ఎప్పటికప్పుడు అధికారులందరూ సాంకేతికంగా వస్తున్న మార్పులను, పద్ధతులను తెలుసుకొంటూ రైతులకు చేరవేయాలని, వాతావారణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులను గ్రహిస్తూ రైతులకు దిశానిర్ధేశం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
- అధికారులందరికీ ఎప్పటికప్పుడు వారి నైపుణ్యతను (స్కిల్స్ )పెంచేవిధంగా శిక్షణ తరగతులను నిరంతరం నిర్వహించాల్సిందిగా అక్కడే ఉన్న వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావుని కోరారు.
- ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, కోర్సు కోఆర్డినేటర్ ఉషారాణి, MCHRD డైరెక్టర్ జనరల్ శశాంక గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన అధికారులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 51,000 చెక్కును మంత్రికి అందచేశారు.