ఆంధ్రప్రదేశ్వార్తలువ్యవసాయ పంటలు

నూతన శనగ రకం ఎన్.బి.ఇ.జి.- 833…సాగులో రైతు అనుభవం  

0

మన దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ సాగు చేసే పప్పు జాతి పంటల్లో శనగకు ప్రత్యేకస్థానముంది. ఒకప్పుడు వాణిజ్య పంటలైన పత్తి, పొగాకుకు ప్రత్యామ్నాయ పంటగా ఉన్నశనగ సాగు ఉమ్మడి ఏపీలో 20 లక్షల ఎకరాలకు ఎగబాకిందంటే రైతులు ఎంతగా ఆదరించారో తెలుస్తుంది. కారణం.. తక్కువ కాలపు పంట, ఉపాధి హామీ పథకం దరిమిలా వచ్చిన కూలీల కొరత, శనగ పంట యంత్రీకరణకు అనువుగా ఉండటం, పంట మార్పిడి పంటగాను, భూమిలో నత్రజని స్థిరీకరించే పైరుగాను, ఒక్క అకాల వర్షాల నష్టం తప్ప ఎలాంటి రిస్కు లేని ఈజీ పంటగా ప్రాధాన్యం సంతరించుకోవడమే. అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్ ఒడిదుడుకులు, గిట్టుబాటు గాని కనీస మద్దతు ధర, ప్రత్యామ్నాయ పంటలు లేక వరుసగా శనగ సాగు చేయటంతో విల్ట్ (ఎండుతెగులు)లాంటి తెగుళ్ళు దాపురించి రైతును కొంత నిరాశ పర్చి సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ, ఇటీవల వాణిజ్య పంటయిన మిర్చి ఒడిదుడుకులకు లోనవ్వడం, శనగ మార్కెట్టు గిరాకి అందిపుచ్చుకోవటంతో మళ్ళీ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. అయితే ఇటీవల వచ్చిన ప్రధాన సమస్యయిన ఎండుతెగులు, తుప్పు తెగుళ్లకు నిరోధక శక్తిగల రకాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

నూతన రకం- ఎన్.బి.ఇ.జి.- 833:
నంద్యాల పరిశోధన స్థానం నుంచి గతంలోనే నంద్యాల-119, నంద్యాల -810 రకాలను విడుదల చేయగా, నంద్యాల- 833 రకం చిరుసంచుల ప్రదర్శన పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

రకం గుణగణాలు: ఇది కాబూలీ రకం. కాల పరిమితి 90-95 రోజులు.100 గింజల బరువు 42-45 గ్రాములు. ఎత్తు 18-22 అంగుళాలు. మిగతా కాబూలీ రకాలతో పోల్చితే గింజ నాణ్యతగా, గింజలు ఒకేతీరుగా, పైరు గట్టిగా, నిలబడి ఉండి యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది. కొంతవరకు  విల్ట్ (ఎండుతెగులు) కు నిరోధక శక్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఎకరాకు 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. విడుదలైన మిగతా రకాలతో సమానంగా ఉందనే చెప్పాలి.

శనగ సాగులో ఇతర అంశాలు:
అనువైన భూములు: తేమను బాగా నిలుపుకునే నల్ల రేగడి భూములు, తేలికపాటి ఒండ్రు నేలలు, ఉదజని సూచిక 7.5 నుంచి 8.5 ఉన్ననేలలు, క్షార, ఆమ్లము గాని నేలలు, పైరు విత్తిన తర్వాత అకాల వర్షాలు పడినప్పటికీ నీరు నిల్వని భూములు అనువైనవి.

సాగులో ఉన్న దేశీయ రకాలు: జె -11, నంద్వాల- 452, యాంత్రీకరణకు అనువైన నంద్యాల -776, 779, ఈ సీజన్లో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్న నంద్యాల – 1267 రకాలు.

కాబూలి రకాలు: ఎప్పటినుంచో సాగులో ఉన్న కాక్ -2, విహార్ (పూలే జి – 95311), మెక్సికన్ డాలరుతో పాటు నంద్యాల నుంచి విడుదలయిన నంద్యాల -119, నంద్యాల – 810 రకాలు సాగులో ఉన్నాయి. నంద్యాల- 810 రకం తప్ప యాంత్రీకరణకు అనుకూలంగా లేకపోవటం, ఎండుతెగులును తట్టుకోలేకపోవటం ప్రధాన సమస్యగా చెప్పాలి.

ఎరుపులు: వ్యవసాయ విశ్వవిద్యాలయం కంపోస్టులతో పాటు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం,16 కిలోల గంధకం సిఫారసు చేస్తున్నారు. అయితే రైతులు కంపోస్టును అందించక పోవటం, ఇటీవల అధికదిగుబడి రకాలు సాగులోకి రావటం, తక్కువ కాలపరిమితి రకాలను సాగుచేయటం వల్ల తప్పని సరిగా నత్రజనిని రెట్టింపు చేస్తూ, పచ్చి రొట్ట ఎరువుల అవసరం తప్పనిసరి అని గుర్తించాలి.

విత్తన మోతాదు: దేశీయ రకాలలో విత్తన పరిమాణాన్నిబట్టి ఎకరాకు 35-40 కిలోలు, కాబూలీ రకాలలో ముఖ్యంగా ఏ రకమయినా 100 గింజల బరువు గ్రాములలో తూచి  40గ్రాములున్నట్లయితే దానికి 20శాతం అదనంగా అనగా 48 కిలోలుగా విత్తనరేటు పాటించవచ్చు.

విత్తనశుద్ధి: సాగులో విత్తనశుద్ధి మేలైన యాజమాన్యంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కాబూలీ రకాలలో విత్తనశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనానికి 2 కాప్టాన్ గాని, 2 గ్రా. సాఫ్ గాని, 2 గ్రా. కార్బెండాజిమ్ గాని, బయో శిలీంద్రనాశిని అయిన ట్రైకోడెర్మా విరిడి 4- 5గ్రా. గాని విత్తటానికి కొన్ని గంటల ముందే విత్తనానికి పట్టంచి విత్తడం మేలు.

సస్యరక్షణ: ఇటీవల దేశీయ రకాలలో కీటకాలు సమస్య తక్కువగా ఉన్నా కాబూలి రకాలలో మొదటి దశలో వచ్చే పచ్చలద్దెపురుగుకు ఎసిఫేట్ గాని, ఇమామేక్టిన్ బెంజోయెట్ (పొక్లయిన్), రెండో దశలో వచ్చే పొగాకు లద్దె పురుగు, శననగపచ్చ పురుగు నివారణకు నోవాల్యూరాన్, ఫ్లూబెండమైడ్, క్లోరాంట్రానిలిప్రోల్ వంటి మందులు వాడి నివారించవచ్చు. శనగలో ఇటీవల ఎండు తెగులులుతో పాటు తుప్పు తెగులు సమస్యగా ఉంది. వీటి
నివారణకు హెక్సాకోనజోల్ (కాంటాఫ్)  లేదా నేటివో వంటి మందులు వాడాలి.

సాగులో మెళకువలు:
భూమిని మెత్తగా పొడి దుక్కులు చేయడం, పచ్చి రోట్ట ఎరువు అందించటం, కనీసం మూడేళ్ళకొకసారైనా కాయధాన్యపు పైరుతో పంటమార్పిడి చేయటం, భూసార  పరీక్షకు అనుగుణంగా ఎరుపులు అందించడం, జింకు లోపం నివారణ, సూటి ఎరువులైన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడటం, సేంద్రియ కర్బనం పెంచే కంపోస్ట్  ఎరువు అందించటం,పూత పిందె దశలో బెట్ట పరిస్థితులున్నట్లయితే 5-10 శాతం పొటాషియం నైట్రేట్  (ఎకరాకు1- 2 కిలోలు) పిచికారీ చేయడం, వీలుంటే తెలిక పాటిగా తుంపర (స్ప్రింక్లర్) పద్దతిలో నీటి తడివ్వడం, తప్పని సరిగా విత్తనశుద్ధి చేయటం, ఆర్థికనష్ట పరిమితులు దాటినప్పుడే  క్రిమి సంహారక మందులు వాడటం, పైరుపై నిఘా ఉంచటం, శనగలో పైరులో కలుపు నివారణ రసాయనాలు లేనందున ముందు జాగ్రత్తగా విత్తిన వెంటనే పెండిమిథాలిన్ కాని, స్టాంప్ ఎక్స్ ట్రా గాని పిచికారి చేయడం, రసాయన అవశేషాలు లేని ఉత్పత్తుల కోసం వేపనూనె వంటివి వాడటం శ్రేయస్కరం.

బోడావుల లక్ష్మీనారాయణ,
తెమిడిదపాడు, కారంచేడు,
బాపట్ల జిల్లా, ఫోన్: 9291294999 

Leave Your Comments

సోయాబీన్ అదనపు కొనుగోళ్ళకు అనుమతి ఇస్తు ప్రభుత్వ ఆదేశాలు 

Previous article

ఆంధ్రప్రదేశ్ లో చేపలు, రొయ్యల మార్కెటింగ్ సరళి  

Next article

You may also like