ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీతో రైతుల బకాయిల వివాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతుల డిమాండ్, యాజమాన్య వైఖరిపై చర్చించారు. వివరాలలోకి వెళితే ..2019-20 సంవత్సర కాలంలో చెరుకు రైతులకు ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 16 కోట్ల 50 లక్షలు బకాయిపడింది. అయితే క్రషింగ్ చేయకపోవడమే కాకుండా రైతులకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించపోవడంతోనే రైతులు ఆందోళన చేపట్టారు. మరో విశేషం ఏంటంటే..రైతుల పేరుతో షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి రూ. 70 కోట్లు బ్యాంకు ఋణం తీసుకుంది. దీంతో రుణాలు తీర్చమని రైతులకు బ్యాంకులు నోటీసులు ఇచ్చింది. వీటికి తోడు షుగర్ ఫ్యాక్టరీ.. కార్మికులకు మరో 5 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించాలంటూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతు నాయకుల అరెస్టుకు నిరసనగా పోలీసులపై ఎదురుతిరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. పరిస్థితి చక్కబెట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకోగా గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో కొంతమంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇదే విషయంపై మంత్రి స్పందించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్‌సిఎస్ సుగర్స్ పై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. ఎన్‌సిఎస్ సుగర్స్‌కు చెందిన 24 ఎకరాలను వేలం వేసి రైతుల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 10కోట్ల రూపాయల విలువైన పంచదారను ఇప్పటికే ప్రభుత్వం సీజ్ చేసిందని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాల ధోరణిపై మంత్రి బొత్స మండిపడ్డారు. రైతులని అడ్డుపెట్టుకుని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అన్నారు. అదేవిధంగా రాజధాని ఉద్యమం రైతులది కాదు. టీడీపీ కార్యకర్తలదే అన్నారు. వైసిపి ప్రభుత్వం రైతుల కోసం పని చేసే పార్టీ, రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని, రైతు సంక్షేమమే మాకు ముఖ్యమని అన్నారు మంత్రి. రైతుల ముసుగులో వామపక్షనాయకలు పోలీసులపై రాళ్లు రువ్వారని అన్నారు. పోలీసులకు గాయాలు అయ్యాయని అయినా పోలీసులు సంయమనం పాటించారని గుర్తుచేశారు.
#NCSSugarFactory #BotsaSatyanarayan #sugarcanefarmers #protest #appoliticalnews #eruvaakanews #agriculturenews