e- Crop App Problems: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి సాయం అందించాలన్నా ఈ క్రాప్ తప్పనిసరి. పంట సాగు చేసే భూమి వద్ద రైతులు ఫోటోలు దిగి వాటిని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ కాలంలో ఏ పంట సాగు చేశారు అనే సమాచారం ఈ క్రాప్ ద్వారా సేకరిస్తారు. విపత్తులు సంభవించి పంటలు చేతికి రాకపోతే ప్రభుత్వం ఇచ్చే పంటల బీమా అందాలన్నా ఈ క్రాప్ తప్పనిసరి. అయితే రైతులకు సాయంగా ఉండే ఈ క్రాప్ ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది.
జియో ట్యాగ్స్ పనిచేయడం లేదు
పంట పొలాల్లో ఈ క్రాప్ చేసి జియో ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. సాప్ట్ వేర్ లోపాల వల్ల జియో ట్యాగ్స్ పనిచేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ క్రాప్ నమదు చేస్తోన్న రైతు భరోసా కేంద్ర సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకోలేక రైతు భరోసా కేంద్రం సిబ్బంది చేతులెత్తేశారు. ఇక రైతులకు కూడా అందాల్సిన రాయితీలు దక్కాలంటే ఈ క్రాప్ తప్పనిసరి. అది పనిచేయపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఖచ్ఛితమైన సర్వేనెంబరులో ఉన్నా పనిచేయని యాప్
ఈ క్రాప్ యాప్ సక్రమంగా పనిచేయడంలేదు. రైతులకు చెందిన భూమిలో ఖచ్ఛితమైన సర్వే నెంబరులో ఉన్నా యాప్ సహకరించడం లేదని రైతు భరోసా సిబ్బంది చెబుతున్నారు. రైతులను పొలాలకు తీసుకెళ్లి వారి పంట పొలంలో రైతులను నిలుచోపెట్టి ఫోటోలు తీసినా యాప్ పనిచేయడం లేదు. కిలోమీటరు దూరంలో పొలం ఉన్నట్టు యాప్ చూపిస్తోంది. పంట పొలాల్లో నెట్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు. జియో కోఆర్డినేటర్లు కెమెరా ద్వారా తీసే ఫోటోలు 50 మీటర్ల వరకు అనుమతించాలి. కాని యాప్ పనిచేయకపోవడంతో ఫోటో అప్ లోడ్ చేయడం కష్టంగా మారింది.
గడవు దగ్గర పడుతోంది
సెప్టెంబరు 15లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. లేదంటే పంటల బీమా అందే అవకాశం లేదు. అయితే నేటికీ 30 శాతం పంట పొలాలు కూడా ఈ క్రాప్ చేయలేదు. ఇంకా కేవలం 25 రోజుల సమయం మాత్రమే ఉంది. గడవు ముగిస్తే ఇక రైతులకు పంటల బీమా కూడా దక్కే అవకాశం లేదు. అసలే కరవు పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయి. మరో వైపు ప్రభుత్వ సహకారం దక్కాలంటే ఈ క్రాప్ తప్పనిసరి కావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పంటల సాగులో నష్టాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే సాంకేతిక సమస్యలు సరిదిద్దకుండా ప్రభుత్వం చోధ్యం చూస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
Also Read: Tobacco Cultivation: రైతుల ఇంట సిరుల కురిపిస్తున్న పొగాకు సాగు.!