ఆంధ్రప్రదేశ్వార్తలు

ఎన్. జి. రంగా 124 జయంతి

0

“ANGRAU”……..నవ్యాంధ్రలో జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి….వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు.

రైతుబాంధవుడుగా పేరొందిన ఎన్. జి. రంగా ఆదర్శాలను ముందుకు తీసుకు వెళ్తామని, ఆయన స్ఫూర్తితో నవ్యాంధ్రలో జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రత్యేకంగా కృషి చేస్తామని వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్జీ రంగా 124 వ జయంతి సందర్బంగా ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో ఏర్పాటుచేసిన సమావేశంలో రంగా గురించి మంత్రి పలువిషయాలను గుర్తుచేశారు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని…

ఆదర్శనీయులు ఆచార్య ఎన్జీ రంగా…

ఎన్. జి. రంగా అసలు పేరు గోగినేని రంగనాయకులు. ఎన్జీ రంగా పేరుతో గుర్తింపు పొందారు. రంగా సేవలు చిరస్మరణీయం. సామాన్య కుటుంబం నుంచి వచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి ఎన్జీ రంగా. అయన స్వాతంత్య్ర సమరయోధులుగా, శాస్త్రవేత్తగా, రైతు బాంధవుడుగా, ఉపాధ్యాయుడుగా ఎంతో కృషి చేశారు. జమీందారీ వ్యవస్థను దేశం నుంచి పారదోలిన గొప్ప వ్యక్తి అయన. స్వాతంత్య్రం రాక ముందు జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్ర అనంతరం జమీందారీ వ్యవస్థను రద్దు చేసిన ఆదర్శనీయులు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఎన్జీ రంగాతో ఎనలేని అనుబంధం ఉంది.

రాజకీయ గురువు:

ఎన్ జీ రంగా రాజకీయ పాఠశాల నుంచి దేశానికి ఏడుగురు ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలు దేశానికి సేవలు అందించారు. కింజరాపు కృష్ణమూర్తి కూడా ఈయన పాఠశాలనుంచే నాయకులుగా సేవలు అందించారు.

రైతు బాగుంటేనే రంగాకు నిజమైన నివాళి !

రైతు బాగుంటేనే రంగాకు మనం నిజమైన నివాళి ఇచ్చినట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీ రంగా ఆశయాలను నెరవేర్చాలని రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందేలా నూతన కౌలు రైతు చట్టం కోసం పని చేస్తున్నామని మంత్రి అన్నారు. ఐదేళ్ల వైసీపీ నిరంకుశ విధానాలతో రాష్ట్రంలో ఐదేళ్ల పాటు యంత్ర పరికరాలు లేవు. భూసార పరీక్షలు లేవు. ఇప్పుడు తిరిగి ఎన్డీయే ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి, పథకాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం.

డ్రోన్లతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకోస్తాం. ప్రతి గ్రామంలో రైతులకు డ్రోన్ల సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసాం. ప్రధాని మోదీ ప్రోత్సాహంతో దేశంలోనే డ్రోన్ హబ్ గా నవ్యాంధ్రను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు.

రైతులకు తోడ్పడేలా శాస్త్రవేత్తల కృషి:

పెట్టుబడి తగ్గించి ఆదాయం రెండింతలు చేసే విధంగా ఎన్ జీ రంగా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు కృషి చేయాలి. ఎన్నో నూతన వంగడాలను సృష్టించి జాతీయ స్థాయిలో రైతులకు ఉపయోగ పడే విధంగా కృషి చేయాలి. చంద్రబాబు నాయకత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో విశ్వవిద్యాలయంలో 80 శాతం పూర్తయిన భవనాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మన ప్రభుత్వంలో నిధులు కేటాయించి భవనాలు పూర్తి చేసి విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Leave Your Comments

ఇప్పుడు ఏయే రబీ పంటలు విత్తుకోవచ్చు ?

Previous article

పంటలను అశిస్తున్న చీడపీడలను ఎలా నివారించుకోవాలి ?  

Next article

You may also like